‘భాజపా’-ట్రాన్సిట్ హాల్ట్

చంద్రబాబు దగ్గరకు రానివ్వరు..జగన్ వల్ల ఉపయోగం లేదు. కానీ అలా అని షెల్టర్ లేకుంటే పనులు జరగడం మాట దేవుడెరుగు, బ్యాకింగ్ పవర్ వుండదు. ఆంధ్రలో చాలా మంది రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తున్నట్లు…

చంద్రబాబు దగ్గరకు రానివ్వరు..జగన్ వల్ల ఉపయోగం లేదు. కానీ అలా అని షెల్టర్ లేకుంటే పనులు జరగడం మాట దేవుడెరుగు, బ్యాకింగ్ పవర్ వుండదు. ఆంధ్రలో చాలా మంది రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. 

కేంద్రంలో ఇప్పట్లో మార్పు వచ్చే సూచనలు లేవు. మోడీ కనీసం మరో టెర్మ్ బండి లాగించేలాగే వున్నారు. అందువల్ల సేఫ్ గార్డ్ గా భాజపాను చేసుకోవడం కన్నా ఉత్తమం లేదన్న ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కండిషన్ అప్లయ్ ఏమిటంటే పదవులు, పోటీలు ఆశించకుండా, రాజకీయాల్లో వుండాలంటేనే భాజపా పంచన చేరాలి.

సుజన చౌదరి ఏం చేసారు. జగన్ నుంచి తప్పించుకోవాలి. తన బిజినెస్ తలకాయనొప్పులు తనకు వుండనే వున్నాయి. అందుకే భాజపాలోకి జంప్ అన్నారు. రఘురామకృష్ణం రాజు సంగతి చూడండి. వైకాపాతో పొసగడం లేదు. భాజపా అండ పొందాలని తెగ ప్రయత్నిస్తున్నారు. 

ఇంకా చాలా మంది తెలుగుదేశం లీడర్లు భాజపా తీర్థం తీసుకుని సైలంట్ అయిపోయారు. పేరుకే భాజపాలో వున్నారు. కానీ ఏ యాక్టివిటీ వుండదు. మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాక జంప్ జిలానీ అనే అవకాశాలే ఎక్కువ.

వైకాపా ఎంపీ అభ్యర్థి పివిపి కి కూడా వైకాపాతో పొసుగుతున్నట్లు లేదు. ఆయన కూడా ఎప్పుడో ఒకప్పుడు జంప్ అనేలాగే వుంది వ్యవహారం. ఆంధ్రలో భాజపా పంచన చేరుతున్నవారిలో ఎక్కువ మంది జగన్ తో పొసగని వారు, అలాగే వ్యాపారాల్లో ఇబ్బందులు వున్నవారు కావడం విశేషం. 

తేదేపా..వైకాపాతో పడకపోతే జనసేనకు వెళ్లొచ్చు. కానీ అలా చేయడం లేదు ఎవ్వరూ. భాజాపానే ఆల్టర్ నేటివ్ డెస్టినేషన్ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వలసలు భాజపాకు ఏ మాత్రం ఉపకరించేవి కావు. 

గతంలో వైఎస్ఆర్ టైమ్ లో కూడా వాడవాడలా భాజపా జెండా దిమ్మలు కట్టారు. ఆ పార్టీకి జై కొట్టారు. అలా చేసిన వారంతా తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వారే. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే వీళ్లంతా ఒక్క రోజులో అట్నుంచి ఇటు మారిపోయారు.