కర్మసిద్ధాంతం కళ్లముందే కనిపించడమంటే ఇదే. మగపిల్లాడే ముద్దని, బోలెడంత కట్నం మూటకట్టడమే కాకుండా తమని వృద్ధాప్యంలో పోషిస్తాడని ఇలా రకరకాల లెక్కలతో ఆడ శిశువుని కడుపులోనే చంపేసుకున్న తల్లులు ఎందరో.
ఆ శిశువుల ఉసురు తగిలిందో ఏమో లక్షలాది మంది యువకులకి పెళ్లి చెయ్యాలంటే ఆడపిల్లలు దొరకట్లేదిప్పుడు. గంతకి తగ్గ బొంతలాగ ప్రతివాడికి ఎక్కడో పెళ్లాన్ని కూడా రాసి పెట్టుంటాడు ఆ భగవంతుడు అని అనుకుందామన్నా కూడా కుదరట్లేదు. ఒంటికాయ సొంటికొమ్ముల్లాగ నలభై-యాభై ఏళ్ళొచ్చినా పెళ్లికాని ప్రసాదులు సందుకొకడు దర్శమిస్తున్న రోజులొస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా కేవలం 27 ఏళ్ల తెలుగు యువకుడు పక్క ఊరికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
“కట్నమెంత ముట్టింది?” అని అడిగితే,
“ఊరుకోండి సర్! పెళ్లి కావడమే ఎక్కువ. కట్నం కోసం కూర్చుంటే నలభై వచ్చినా పెళ్లికాదని నా భయం. మా ఊరిలో కొందరు అలాగే మిగిలిపోయారు. ఇప్పుడు ఫ్రీగా చేసుకుంటామన్నా ఎవ్వరూ దొరకట్లేదు వాళ్లకి” అన్నాడు.
“మంచి పని చేసావోయ్. కట్నం అడక్కుండా ఆదర్శంగా నిలిచావ్” అనగానే..
“ఆదర్శం కాదు సర్. అవసరం అలాంటిది. అమ్మాయి తండ్రికి ఆలోచన మారకూడదని పెళ్లి ఖర్చంతా నేనే పెట్టుకుంటానన్నాను. పెళ్లి ఖర్చు రూ 30 లక్షలయ్యింది. పొలం మీద తీసుకున్నాను” అన్నాడు.
ఇంతకీ ఇతను ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. నెలకి రూ 50,000 జీతం. కుటుంబ నేపథ్యం మధ్యతరగతి.
మరొక కేసులో నెలకి 25,000 సంపాదించే డ్రైవర్. వయసు 29. పెళ్లి ఖర్చు తానే భరించి, ఇల్లరికానికి కూడా ఒప్పుకుని, తన కులానికే చెందిన ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయిని పెళ్లాడాడు.
మరొక కేసు 32 ఏళ్ల అబ్బాయిది. పైసా కట్నం తీసుకోకుండా 35 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. అడిగితే “ఇంకొక ఏడాది ఆగితే ఆమె కూడా దొరక్కపోవచ్చు. నేనింకా అదృష్టవంతుడిని. ఎదురు కట్నం (కన్యాశుల్కం) అడగలేదు. ముందు ముందు అది కూడా వస్తుందేమో” అన్నాడు.
అదీ పరిస్థితి. అమ్మాయిలు తక్కువగానూ, అబ్బాయిలు ఎక్కువగానూ ఉన్న సమాజమిది.
పెద్ద జీతం, ఉన్నంతలో అందం, ఆరోగ్యం, బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే అరేంజ్డ్ మేరేజ్ ద్వారా అబ్బాయికి పెళ్లవడం సాధ్యమే కానీ అతను చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి రావొచ్చు. అమ్మాయిల అంచనాలు అలా ఉన్నాయి మరి. అమ్మాయిలు తమ అందం, చదువు, కుటుంబ ఆర్ధిక పరిస్థితి వంటి అంశాల్లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు. ఇవన్నీ ఉండి ఇగో లేకుండా ఉండి తమ మనసుకి నచ్చాలి. ఆ హై రేంజ్ అబ్బాయిల్ని మినహాయిస్తే కింద స్థాయిలో ఉన్న అబ్బాయిలకి పెళ్లవ్వాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.
మ్యారేజ్ బ్యూరోల వాళ్లు కూడా పెళ్లికాని ప్రసాదులతోనే ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. ఏళ్ల తరబడి తమ మెంబెర్షిప్ రిన్యూ చేయించుకుంటున్నా నెత్తి మీద జుట్టు ఊడుతోంది తప్ప తమకి పెళ్లి మాత్రం కావట్లేదని వాపోతున్నారు.
ఇదంతా ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చుకదా అని ఉచిత సలహాలిస్తున్నవాళ్లు కూడా ఉన్నారట వాళ్లకి.
“లవ్ మ్యారేజ్ సినిమాలో చూపించినంత తేలిక కాదు. అందరికీ కుదరదు కూడా. అదేమీ ప్రణాళికాబద్ధంగా అనుకుంటే జరిగేది కాదు. ప్రేమ అనేది దానంతట అది కలగాలి. కలిగినా కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు దాటి కోరుకున్న వాళ్లని పెళ్లి చేసుకోవడం సాధారణ కుటుంబాలకు చెందిన యువకులకి కష్టం. ఈ విషయంలో జరుగుతున్న పరువుహత్యలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ హత్యలు కేవలం కులాలకి సంబంధించిన అంశమే కాదు, ఆర్ధిక పరమనైనవి కూడా ఉంటున్నాయి”, అని విజయవాడకు చెందిన ఒక మ్యారేజ్ బ్యూరోకి చెందిన వ్యక్తి అభిప్రాయపడ్డారు.
ఎలా చూసుకున్నా అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటే 30 దాటకుండా ఒక నిర్ణయం తీసేసుకోవాలి. అమ్మాయిలకైనా లేటు వయసులో ఎవరో ఒక వరుడు (తమకంటే చిన్నవయసువాడైనా కూడా) దొరుకుతున్నాడేమో తప్ప అధికశాతం అబ్బాయిల పరిస్థితి అలా లేదు.
సినిమా తీసి మంచి రేటొస్తేనే అమ్ముతాను అని నిర్మాత రిలీజు చెయ్యకుండా కూర్చుంటే కొన్నేళ్లకి ఫ్రీగా సినిమా చూపిస్తామన్నా ఎవ్వడూ చూడకపోవచ్చు. ఈ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల పరిస్థితి కూడా అంతే. కట్నం కోసం కూర్చుంటే అంతే సంగతులు. సరైన వయసులో సరైన నిర్ణయమా లేకపోతే యవజ్జీవిత బ్రహ్మచర్యమా? తేల్చుకోవాలి.
– జె. విశ్వేశ్వరరావు