జ‌గ‌న్‌తో పెట్టుకుంటే…అట్లుంట‌ది మ‌రి!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో వైరం పెట్టుకుంటే ఎట్లా వుంటుందో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి రుచి చూపించారు. ఇటీవ‌ల సొంత ప్ర‌భుత్వంపై ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే వ్య‌తిరేకంగా మాట్లాడారు. ఒకట్రెండు సంద‌ర్భాల్లో హ‌ద్దులు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో వైరం పెట్టుకుంటే ఎట్లా వుంటుందో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి రుచి చూపించారు. ఇటీవ‌ల సొంత ప్ర‌భుత్వంపై ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే వ్య‌తిరేకంగా మాట్లాడారు. ఒకట్రెండు సంద‌ర్భాల్లో హ‌ద్దులు దాటినా… సీఎం జ‌గ‌న్ చూసీచూడ‌న‌ట్టు ఉన్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆనం మ‌రింత రెచ్చిపోయారు. ఎన్నిక‌లు ఎంత త్వ‌రగా వ‌స్తే, తాము అంత వేగంగా ఇంటికి వెళ్తామంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అలాగే అభివృద్ధి ప‌నులేవీ జ‌ర‌గ‌డం లేద‌ని, జ‌నం అడిగితే ఏం చెప్పాలంటూ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే మాదిరిగా బ‌హిరంగంగా విమర్శ‌ల‌కు దిగారు.

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఇక ఎంత మాత్రం ఉపేక్షించ‌వ‌ద్ద‌ని సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆనం స్థానంలో వైసీపీ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవ‌ల నియ‌మించారు. అలాగే గ‌న్‌మెన్ల‌ను కుదించారు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు ప్ర‌భుత్వం తాజాగా మ‌రోసారి షాక్ ఇచ్చింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించి అందించిన స‌హ‌కారం మ‌రువలేనిద‌ని, ఇందుకు ధ‌న్య‌వాదాలంటూ ఆయ‌న‌కు ప్ర‌భుత్వం త‌ర‌పు మెసేజ్ పంపారు. ఇక‌పై ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లొద్ద‌నే ప‌రోక్ష సంకేతాల్ని వైసీపీ ఇచ్చింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తానొక సీనియ‌ర్ నేత‌న‌ని, త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నోటికి ప‌ని చెప్పారు. జ‌గ‌న్ స‌హ‌నాన్ని ఆనం ప‌రీక్షించారు. అయితే పార్టీలో వుంటూ, ప్ర‌భుత్వ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఏమ‌వుతుందో జ‌గ‌న్ షాక్ మీద షాక్‌లు ఇచ్చి, మ‌రెవ‌రైనా తోక జాడిస్తే ఇదే గ‌తి అని హెచ్చ‌రిక పంపారు. ఇంకా ఏడాదికి పైగా అధికార పార్టీలో ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేయాల్సిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అన‌వ‌స‌రంగా నోరు జారి ఇక్క‌ట్ల‌ను కొని తెచ్చుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌ర‌నే సంగ‌తి తెలిసి కూడా, ఆనం సంయ‌మ‌నం పాటించ‌కుండా కోరి అవ‌మానపాల‌వుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇదిలా వుండ‌గా ఇక మీద‌ట ఆనం వెంట ఏ ఒక్క వాలంటీర్‌, స‌చివాల‌య ఉద్యోగి వెళ్ల‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వెళ్లిన‌ట్టు తెలిసింది.