రాజకీయ సీజన్ మొదలు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో గంటా మంత్రిగా పని చేశారు. ఐదేళ్ల పాటు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. టీడీపీ అధికారం పోగొట్టుకున్నప్పటికీ, గంటా మాత్రం గెలవగలిగారు. అయితే పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లకు కనీసం మొహం చూపడానికి కూడా గంటా ఇష్టపడలేదు.
ఇదే గంటా శ్రీనివాస్ మళ్లీ లోకేశ్‌ను ఇటీవల కలిశారు. లోకేశ్ పాదయాత్రపై ఆకాశమే హద్దుగా ప్రశంసలు కురిపించారు. సహజంగానే ఇది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి కోపం తెప్పించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య అసలు పొసగదు. ప్రత్యర్థులపై అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకుంటున్నప్పటికీ, టీడీపీ విషయంలో ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. పార్టీకి మొదటి నుంచి నిబద్ధతతో సేవలందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి గంటా చేరువ కావడంపై ఇవాళ మీడియా సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. గంట ఏమైనా పెద్దనాయకుడా? ప్రధానా? ఇన్ని రోజులు గప్‌చుప్‌గా ఇంట్లో దాక్కుని, ఎన్నికలొస్తుండగా… బయటకు వస్తున్నాడు’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటాపై అయ్యన్నపాత్రుడి ఆగ్రహాన్ని అర్థం చేసుకోదగ్గదే.
ఇదే సందర్భంలో కష్టకాలంలో పార్టీని గాలికొదిలేసి, తన స్వార్థం కోసం మౌనాన్ని ఆశ్రయించి, ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్లీ తమ దగ్గరికి వస్తున్న గంటాను చంద్రబాబు, లోకేశ్ ఎలా ఆదరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గంటా నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిని దగ్గరికి తీసుకునే చంద్రబాబు, లోకేశ్‌లను అయ్యన్నపాత్రుడు … ‘గంటాను ఎలా తీసుకుంటారు? కష్టకాలంలో పార్టీని పట్టించుకోకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా వస్తే, దగ్గరికి తీసుకోడానికి మాకైనా సిగ్గు వుండదా? అని తండ్రీకొడుకులు ఎందుకు ప్రశ్నించరు’ అని అయ్యన్న నిలదీయగలరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబు, లోకేశ్ లాంటి నాయకులు ఆదరించే వాళ్లున్నంత కాలం…. గంటా లాంటి స్వార్థపరులు రాజకీయాల్లో చెలామణి అవుతూనే వుంటారనే విమర్శ వెల్లువెత్తుతోంది. గంటాను అయ్యన్న తిడితే లాభం ఏంటి? ఆ ఘాటు మాటేంటో చంద్రబాబు, లోకేశ్‌ను అంటే, నిలదీస్తారనే భయంతోనైనా అవకాశవాద రాజకీయ నాయకుల విషయంలో అప్రమత్తంగా వుంటారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలొస్తున్నాయని గంటా టీడీపీకి చేరువ అవుతున్నారనే కంటే, ఎన్ని చేసినా ఆయనే టీడీపీకి దిక్కు అయ్యారంటే…తప్పు కాదేమో అనే వాదన కూడా లేకపోలేదు.