సన్యాసులు సినిమాలు తీస్తే మేధావులు చూస్తారు. మేధావులు తీస్తే సన్యాసులు కూడా చూస్తారు. తీసేవాళ్లు, చూసేవాళ్లలో అజ్ఞానులే ఎక్కువుంటారు. పాదాల మీద నడిస్తే పాదయాత్ర, సీన్స్ మీద నడిస్తే సినిమా యాత్ర.
బౌండ్ స్క్రిప్ట్ లేదని ఈ మధ్య ఒక నిర్మాత బాధపడ్డాడు. హైదరాబాద్‌లోని బుక్ బైండర్స్ వులిక్కి పడ్డారు. తాము ఇంత మంది వుండగా ఆయనకి బైండ్ చేసేవాడు దొరకలేదా అని ఆశ్చర్యపడ్డారు. బౌండ్ స్క్రిప్ట్ వున్నా అది తలకింద దిండులా ఉపయోగపడేది. డైరెక్టర్ తలలో ఏమీ లేకపోతే స్క్రిప్ట్‌లో మాత్రం ఏముంటుంది? అక్షరాల్లో గాఢత మిస్ అయితే సినిమాలో శూన్యతే.
సినిమాకి కథ అవసరం లేదని ఒకాయన సూత్రీకరించాడు. కథకి కాళ్లుంటాయని, అది కంచి వరకూ వెళుతుందని ఆయన నమ్మకం. కంచిలో తెలుగు రాదని, తమిళ వూళ్లో తెలుగు కథలు చేరడం ఎందుకని వాదిస్తూ భాషాభిమానంతో కథని వద్దనుకున్నాడు.
ఈ మధ్య ఒక సినిమా రచయితని భాష గురించి తెలుసా అని అడిగితే, బాగా తెలుసని, ఆయన తమ వీధి చివర సోడాలు అమ్ముతూ వుంటాడని చెప్పాడు. బాషా వేరు, భాష వేరని చెప్పడానికి సాహసిస్తే అక్షరాల కింద గూటం వుండడం వల్లే తాను తెలుగు నేర్చుకోలేదని చెప్పాడు. ఇంగ్లీష్ సినిమాలు చూసి , ఇంగ్లీష్‌లో ఆలోచించి, రాసి, తెలుగు సినిమాలకి మాటలు అందిస్తానని అన్నాడు. డైలాగ్‌లు ముందే రాసుకోవడం పాత పద్ధతని, సెట్‌లో కూచుని హీరోకి ఏది నోరు తిరిగితే అది రాస్తానని అన్నాడు. హీరోయిన్‌కి నోరు తిరిగే అవకాశమే లేదు కాబట్టి, పెదాలు కదిలించి పాటల్లో డ్యాన్స్ చేస్తే చాలని చెప్పాడు.
హీరోలు కూడా లాంగ్వేజ్ అవసరం లేదని, బాడీ లాంగ్వేజ్ వుంటే చాలని నమ్ముతున్నారు. సినిమాలో పాత్ర గురించి అడిగితే సినిమా అంటే స్టీల్ సామాను అంగడి కాదని చెబుతున్నారు. హీరో క్యారెక్టర్ గురించి చెప్పమంటే, బాడీ వుంటే క్యారెక్టర్ అవసరం లేదన్నాడు.
సినిమా కోసం సంవత్సరం కష్టపడ్డానని, రోజూ మూడు గంటలు వర్కౌట్స్ చేస్తూ ఆరు కోడిగుడ్లు, కిలో చికెన్ తిన్నానని వివరించాడు. ఎంత తిన్నా, ఆకలిగా వుండేదని, ప్రేక్షకుల్ని తినాలంటే హీరో కడుపు నిండా తినకూడదని డైరెక్టర్ అడ్డుకున్నాడని చెప్పాడు. కథలో హీరో వెయిట్ పెరిగిందని, కుడి చేత్తో ఆరుగురిని, ఎడమ చేత్తో ఎనిమిది మందిని తంతాడని అన్నాడు. సినిమాలో ఎమోషన్స్ గురించి ప్రశ్నిస్తే ప్రమోషన్స్ బాగా చేస్తే ఎమోషన్స్ అనవసరమని, ఈ సారి తాను చార్మినార్ పైనుంచి దూకి ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తానని అన్నాడు.
ఈ మధ్య ఒక దర్శకుడు పాన్ ఇండియా అని తెగ తిరిగి హీరోకి బాక్సింగ్ కూడా నేర్పించాడు. ఇండియాలో ఉన్న వాళ్లు సరిపోరని మైక్‌టైసన్ దగ్గరికి వెళ్లాడు. ప్రేక్షకులకి సహనం చచ్చి బాక్సాఫీస్ దగ్గర బాక్సింగ్ ఆడారు. అందరి ముక్కులు, మూతులు పగిలిపోయాయి. ఇంకా కోలుకోలేదు.
ఒక నిర్మాతకి నిద్ర పట్టనప్పుడల్లా దర్శకుల్ని రప్పించి కథలు వినేవాడు. కునుకుపడితే యావరేజ్, గురకతో కూడిన నిద్ర వస్తే అది హిట్. కొన్ని గంటల పాటు మెలకువ రాకపోతే బ్లాక్ బస్టర్. ఈ థియరీ ఆధారంగా కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
ఒకాయన మనుషుల జడ్జిమెంట్ నమ్మడం మానేశాడు. ఆయన దగ్గర తెలివిమీరిన కుక్క వుంది. కరోనా టైమ్‌లో ఓటీటీలో తెలుగు సినిమాలు చూసేసింది. ముందు దానికి కథ చెప్పాలి. అది తోక అటూఇటూ ఊపితే పర్వాలేదని అర్థం. ముందరి కాళ్లతో బస్కీలేస్తే జస్ట్ ఓకే. గుర్రుమని సౌండ్ చేసి పిక్కమీద పావు కేజీ కండను పట్టి లాగితే నచ్చలేదని అర్థం. ఫిల్మ్‌నగర్‌లో కుంటుతూ నడుస్తున్న యువ దర్శకుల్ని గమనించిన ఒక యూట్యూబ్ చానల్ ఈ విషయాన్ని బయట పెట్టింది.
నరకం గురించి వినడమే తప్ప, వాస్తవంగా తెలియదు. ఆ లోటు భర్తీ చేయడానికి ప్రతి శుక్రవారం శాంపిల్‌గా థియేటర్‌లలో చూపిస్తారు. సమీక్షకుల్లో చాలా మందికి తొందరగా జుత్తు ఊడిపోవడానికి కారణం కథ ఏంటో అర్థం కాక, జుత్తు పీక్కుంటూ చూడడమే!
జీఆర్ మహర్షి