Advertisement

Advertisement


Home > Politics - Opinion

వెంటాడే మ‌మ్ముట్టి న‌ట‌న‌

వెంటాడే మ‌మ్ముట్టి న‌ట‌న‌

కునుకు ప‌డితే మ‌ర‌ణం.తిరిగి లేస్తే జ‌న‌నం.. -తిరుక్కుర‌ల్ (త‌మిళ మ‌హాక‌వి)

రాత్రి పూట చాలా మందికి అనిపిస్తూ వుంటుంది, నిద్ర‌పోతే తిరిగి లేస్తామా? అని. లేస్తాం అనేది న‌మ్మ‌క‌మే త‌ప్ప‌, గ్యారెంటీ కాదు. అదృష్టం కొద్ది లేస్తూ వుంటాం. ఏదో ఒక రోజు లేవం. అది మ‌న‌కి తెలియ‌దు. నిద్ర‌కే కాదు, క‌ల‌ల‌కి కూడా గ్యారెంటీ లేదు. చాలా సంతోషంగా ఉన్న రోజు పీడ‌క‌ల‌లొస్తాయి. బాధ‌గా వున్న రోజు అంద‌మైన క‌ల‌లొస్తాయి.

క‌ల‌ల గొప్ప‌త‌నం ఏమంటే, ప్రేక్ష‌కుడు మ‌న‌మే. పాత్ర‌ధారి మ‌న‌మే. క‌ల‌కి రంగు వుండ‌దు, బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు. క‌ల ఎలా వుంటుందో స్ప‌ష్టంగా మ‌న‌కీ తెలియ‌దు. చాలా క‌ల‌లు గుర్తు వుండ‌వు.

గాలిలో తేలుతున్న‌ప్పుడు, కుప్ప‌కుప్ప‌లు నాణాలు దొరుకుతున్న‌ప్పుడు (ఎందుకో నోట్లు దొర‌క‌వు) త‌ట్టి నిద్ర‌లేపే వాళ్లు ఒక‌రు సిద్ధంగా వుంటారు. క‌త్తితో పొడుస్తున్న‌ప్పుడు, లోయ‌లో ప‌డిపోతున్న‌ప్పుడు మ‌న‌మే నిద్ర లేస్తాం. అదృష్టానికి అడ్డు ప‌డేవాళ్లుంటారు కానీ, దుర‌దృష్టానికి ఎవ‌రూ రారు.

నాన్‌పాక‌ల్ నేర‌తు మ‌య‌క్క‌మ్ (మ‌ధ్యాహ్న‌పు కునుకు) మ‌ల‌యాళ‌ సినిమా వెంటాడుతూ వుంది. మమ్ముట్టి గొప్ప న‌టుడ‌ని కొత్త‌గా చెప్పాల్సింది ఏమీ లేదు. ప్ర‌తి సినిమాలో ఆయ‌న అది నిరూపించ‌డ‌మే గొప్ప విష‌యం. ఈ క‌థ గురించి సింపుల్‌గా చెప్పాలంటే జేమ్స్ అనే వ్య‌క్తి త‌న నాట‌క బృందంతో వేలాంగ‌ణి (త‌మిళ‌నాడులోని క్రైస్త‌వ పుణ్య‌క్షేత్రం) వెళ్లి, తిరిగి కేర‌ళ‌లోని త‌న సొంత వూరికి బ‌య‌ల్దేరుతాడు. మ‌ధ్యాహ్నం ఒక డాబాలో భోంచేసి మినీ బ‌స్సు ఎక్కుతాడు. కాసేప‌టికి నిద్ర‌లేచిన జేమ్స్ బ‌స్సుని ఆపి ఒక త‌మిళ ప‌ల్లెటూరి వ‌ద్ద దిగుతాడు. నేరుగా వూళ్లోని ఒక ఇంట్లోకి వెళ్లి ఆ ఇంటి మ‌నిషిలా ప్ర‌వర్తిస్తాడు. ఒక రోజంతా  ఆ వూరి వాళ్ల‌ని, త‌న వాళ్ల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేసి మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్న‌పు నిద్ర త‌ర్వాత లేచి జేమ్స్‌లా మారి త‌న వూరు వెళ్లిపోతాడు.

జేమ్స్, సుంద‌ర్ లా ఎందుకు మారాడో ద‌ర్శ‌కుడు ఎక్క‌డా చెప్ప‌డు. ఇంకా చాలా విష‌యాలు చెప్ప‌డు. మ‌న‌మే అర్థం చేసుకోవాలి. ఇది నిజానికి జేమ్స్ క‌థ కాదు. సుంద‌ర్ క‌థ‌. అయితే సినిమాలో ఎక్క‌డా అత‌నుండ‌డు. చివ‌ర్లో అస్ప‌ష్టంగా క‌నిపిస్తాడు.

సుంద‌ర్ ఎవ‌రు? అత‌నో చిన్న రైతు, క‌ష్ట‌జీవి. క‌ళ్లు క‌న‌ప‌డ‌ని త‌ల్లి, ముస‌లి తండ్రి, భార్య‌, 12 ఏళ్ల కూతురితో క‌లిసి చిన్న పెంకుటింట్లో వుంటాడు. క‌న్యాకుమారి జిల్లాలోని ఒక ప‌ల్లె అత‌ని సొంత వూరు. నీటి సౌక‌ర్యం పెద్ద‌గా లేని ప్రాంతం. వ్య‌వ‌సాయం గిట్టుబాటు కాని వూరు.

సుంద‌ర్ తెల్లారి లేచి పాలు పితికి ఇల్లిల్లూ పోస్తాడు. కూర‌గాయ‌ల తోట‌లో కాసేపు ప‌ని చేస్తాడు. మిత్రుల‌తో క‌బుర్లు చెబుతాడు. సాయంత్రం ఒక పెగ్గు మందు తాగుతాడు. వైన్‌షాప్‌లో ర‌జ‌నీకాంత్ డైలాగ్‌లు చెబుతాడు. కూతురంటే ప్రాణం. భార్య‌ని ఇబ్బంది పెట్ట‌కుండా కాఫీ కూడా తానే చేసుకోగ‌ల‌డు. ముస‌లి త‌ల్లి ఒళ్లో ప‌డుకుంటాడు. తండ్రి అంటే ఇష్టం. ఊళ్లో అంద‌రికీ చేదోడు వాదోడుగా వుండే మ‌నిషి. ఈ సుంద‌ర్ రెండేళ్ల క్రితం వ‌డ‌చెర్రీ (త‌మిళ టౌన్‌) మార్కెట్‌కి వెళ్లి తిరిగి రాలేదు. మ‌న దేశంలోని చాలా మంది రైతుల్లాగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

భార్యాపిల్ల‌ల మీద ప్రేమో, ఊరి మీద మ‌మ‌కార‌మో తెలియ‌దు కానీ, సుంద‌ర్ ఆత్మ జేమ్స్‌లో ప్ర‌వేశించింది. జేమ్స్ రూపంలో సుంద‌ర్ త‌న వూళ్లోకి వ‌చ్చాడు. రెగ్యుల‌ర్‌గా ప‌నులు ప్రారంభించాడు. మోపెడ్‌ని తీసుకుని ఊళ్లోకి బ‌య‌ల్దేరాడు. అత‌నెవ‌రో సుంద‌ర్‌లా ఎందుకు మాట్లాడుతున్నాడో ఊరి జ‌నానికి షాక్‌. త‌మ‌ని గుర్తు ప‌ట్ట‌న‌ట్టు ఎందుకున్నాడో జేమ్స్ బంధువుల‌కి షాక్‌. రాత్రికి ఇంటికొచ్చిన జేమ్స్‌ని లాక్కెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. తాను ఆ ఊరికి చెందిన వాడిన‌ని వాదించి , ఒక‌రిద్ద‌రిని తంతాడు కూడా. ఊళ్లో వాళ్లంద‌రికీ జ‌రిగిన విష‌యాల్ని గుర్తు చేస్తాడు.

మ‌రుస‌టి రోజు తెల్లారి లేచి పాలు పితికాడు. ఇంటింటికీ వెళితే అత‌నెవ‌రో తెలియ‌దంటారు. ఊళ్లో కొత్త‌గా నిర్మాణం అవుతున్న గుడిని చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు. రెగ్యుల‌ర్‌గా షేవింగ్ చేసే వ్యక్తి చ‌నిపోయి రెండేళ్లైంద‌ని తెలిసి షాక్ అవుతాడు. అద్దంలో త‌న ముఖం చూసి భ‌య‌ప‌డ‌తాడు. ఆత్మ త‌న‌దే, ముఖం కాదు.

ఇంటికొస్తాడు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి నిద్ర‌పోతాడు. నిద్ర‌లేచిన జేమ్స్ త‌న వాళ్ల‌తో క‌లిసి బ‌స్సులో వెళ్లిపోతాడు.

సినిమాలో ద‌ర్శ‌కుడు లిజోజోష్ పెల్లిస్సెర్రీ ఎక్క‌డా జోక్యం చేసుకోని పాత్ర‌ల ద్వారా సినిమాని వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డు. కెమెరా మాట్లాడుతూ వుంటుంది. మ‌నం అనువాదం చేసుకోవాలి. ప్ర‌తి పాత్ర ఏదో మ‌గ‌త‌గా, మైకంలో వున్న‌ట్టు తాత్విక‌త‌తో నిండి వుంటుంది.

జేమ్స్ భార్య‌, సుంద‌ర్ భార్య‌ది చాలా చిత్ర‌మైన స్థితి. అప్ప‌టి వ‌ర‌కూ అత‌ని మీద వాలి ప్ర‌శాంతంగా నిద్ర‌పోయిన జేమ్స్ భార్య‌కి స‌డెన్‌గా అత‌ను అప‌రిచితుడిగా ప్ర‌వ‌ర్తిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియ‌ని స్థితి.

సుంద‌ర్ భార్య‌ది చాలా నిస్స‌హాయ స్థితి. రెండేళ్ల క్రితం భ‌ర్త మాయ‌మ‌య్యాడు. ముస‌లి అత్తామామ‌, కూతురిని తానే సంర‌క్షించాలి. బావ (సుంద‌ర్ అన్న‌) కొంత సాయం చేసినా ఇంట్లో క‌డు పేద‌రికం. ఆమె ఒక అప‌స్మార‌క స్థితిలో జీవిస్తూ వుంది. స‌డెన్‌గా ఒక వ్య‌క్తి వ‌చ్చి, అచ్చం భ‌ర్త‌లా మాట్లాడుతూ, ప్ర‌వ‌ర్తిస్తూ వుంటే ఆమె దుఃఖం రెట్టింపు అయ్యింది. ఎదురుగా త‌న‌లా ఒక స్త్రీ భ‌ర్త ఎక్క‌డ దూర‌మ‌వుతాడో అని భ‌యంగా చూస్తూ వుంది.

సుంద‌ర్ కూతురికి తండ్రి అంటే పిచ్చి ప్రేమ‌. తండ్రి మోపెడ్‌ని ఎవ‌రో కొత్త వ్య‌క్తి తీసుకెళ్లాడంటే కోపం వ‌చ్చేసింది. అక్క‌డ మోపెడ్ విలువ ముఖ్యం కాదు, అది తండ్రి జ్ఞాప‌కం.

రోజూ త‌ను లేకుండా భోజ‌నం కూడా చేయ‌ని తండ్రి, స్కూల్ క‌బుర్లు అడిగి తెలుసుకునే తండ్రి, పాపా ముత్తు అని ప్రేమ‌గా పిలిచే తండ్రి హ‌ఠాత్తుగా ఏమ‌య్యాడో తెలియ‌దు. రెండేళ్ల పాటు ప్ర‌తిరోజూ ఎదురు చూసింది. స‌డెన్‌గా ఒక వ్య‌క్తి వ‌చ్చి తండ్రిలాగే మాట్లాడుతున్నాడు. ప‌సి మ‌న‌సుకి అర్థం కావ‌డం లేదు, అందుకే తండ్రి కాని తండ్రి క‌న్నీళ్లు పెడుతున్న‌ప్పుడు తాను క‌ళ్లు తుడుచుకుంటుంది (చివ‌రి 15 నిమిషాల న‌ట‌న‌కి మ‌మ్ముట్టికి ఎన్ని అవార్డులు ఇచ్చినా త‌క్కువే).

బ‌స్సులో త‌మ‌ ఊరికి వెళుతున్న వాళ్లు హ‌ఠాత్తుగా తాము ఏనాడూ చూడ‌ని ప‌ల్లెలో ఆగి, కొత్త మ‌నుషుల మ‌ధ్య ఒక రోజంతా గ‌డుపుతారు. జీవితంలో ఏది జ‌రిగినా ఒక నిమిషంలో జ‌రిగిపోతుంద‌ని సినిమాలో ఒక డ్రైవ‌ర్ పాత్ర అంటాడు.

తేనీ ఈశ్వ‌ర్ కెమెరా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. సినిమా మొత్తం కెమెరా ఒక ధ్యాన ముద్ర‌లో వుంటుంది. పాత్ర‌లు క‌దులుతారు త‌ప్ప కెమెరా క‌ద‌ల‌దు. హీరోకి కూడా ఒక‌ట్రెండు క్లోజ‌ప్ షాట్స్ మాత్ర‌మే వున్నాయి. గోడ‌ల మ‌ధ్య‌న, కిటికీలోంచి , గేట్లోంచి కెమెరా త‌దేకంగా చూస్తూ వుంటుంది.

ఒక‌ప్పుడు ప‌ల్లెల్లో కొత్త వ్య‌క్తి వ‌స్తే ఎవ‌రిని అడిగే వాళ్లు. ఇపుడు ఎవ‌రికీ టైమ్ లేదు. ఏ ఇంట్లో చూసినా టీవీ సౌండ్‌. ఈ సినిమాలో కూడా టీవీ డైలాగ్‌లు వినిపిస్తూ వుంటాయి. సుంద‌ర్ త‌ల్లి అంధురాలు. నిరంత‌రం టీవీ వైపు చూస్తూ డైలాగ్‌లు వింటూ న‌వ్వుతూ వుంటుంది. క‌ళ్లు లేవు కాబ‌ట్టి జేమ్స్ రూపంతో ప‌నిలేదు, అత‌నిలోని కొడుకు ఆత్మ‌ని ఆమె గుర్తు ప‌డుతుంది. ఆ ఆత్మ కూడా ఆ త‌ల్లి ఇచ్చిందే క‌దా, అందుకు. కొడుకుతో మాట్లాడిన‌ట్టే మాట్లాడుతుంది. జేమ్స్ వెళ్లిన‌ప్పుడు క‌న్నీళ్లు పెడుతుంది. అది టీవీలోని డైలాగ్‌ల వ‌ల్ల లేదా కొడుకు దూర‌మ‌వుతున్నాడ‌నా? మ‌న‌కి డైరెక్ట‌ర్ చెప్ప‌డు.

ద‌ర్శ‌కుడి ప‌రిశీల‌న ఎంత గొప్ప‌దంటే, క‌రువు ప‌ల్లెల్లో యువ‌కులు వుండ‌రు. ప‌నుల కోసం వ‌ల‌స వెళ్లిపోతారు. ఆ ఊళ్లో కూడా ఎక్క‌డ చూసినా ముస‌లి వాళ్లే వుంటారు. ఆఖ‌రి సీన్లో అంద‌రూ నిద్ర‌పోతున్న‌ప్పుడు ఒక నెల‌ల బిడ్డ క‌ళ్లు తెరుచుకుని చూస్తూ వుంటుంది. మైకం, భ్రాంతి పెద్ద వాళ్ల‌కే కానీ, ప‌సివాళ్ల‌కి కాదు. దాన్నే దైవ‌త్వం అంటారు.

క‌థ‌లో జేమ్స్ సుంద‌ర్‌లా ప‌రావ‌ర్త‌నం చెందితే ఆశ్చ‌ర్య‌పోతాం కానీ, జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే మ‌న‌మంతా వివిధ రూపాలుగా ప‌రావ‌ర్త‌నం చెంది జీవిస్తున్న వాళ్ల‌మే. మ‌న‌లోని మంచి వాన్ని బ‌ల‌వంతంగా పాతిపెట్టి దుర్మార్గాన్ని క‌ప్పు కుంటున్నాం, లేదా దుర్మార్గుడు క‌న‌ప‌డ‌కుండా మంచి వాడి మేక‌ప్ వేసి , అమాయ‌క‌త్వం అనే మాస్క్ త‌గిలించి జీవిస్తున్నాం. కాసిన్ని ప్ర‌యోజ‌నాల కోసం మ‌న‌ది కాని బ‌తుకుని బ‌తికేస్తున్నవాళ్లం. సినిమాలో జేమ్స్‌కి రెండు ఆత్మ‌లుంటాయి. అస‌లు ఆత్మ లేకుండా జీవించ‌డ‌మే మాడ్ర‌న్ ఆర్ట్‌.

జేమ్స్‌లు త‌క్కువ మంది క‌నిపిస్తారేమో కానీ, సుంద‌ర్‌లు ఈ దేశంలోని ఏ ప‌ల్లెకి వెళ్లినా క‌నిపిస్తారు. మ‌న‌కి మూడు పూట్ల అన్నం పండించే రైతు, ఒక పూట స‌రిగా తిన‌లేని దుస్థితి. అన్నం తినాల్సిన రైతు పురుగుల మందు తింటున్న దృశ్యం.

చాలా ఏళ్ల క్రితం సాల్ట్ అండ్  పెప్ప‌ర్ అనే షార్ట్ ఫిల్మ్ వ‌చ్చింది. ప్రేమ విఫ‌ల‌మై ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన అమ్మాయితో ఒక పేద రైతు (న‌వాజుద్దీన్ సిద్ధిఖి న‌టించాడు) ఇలా అంటాడు..

"ఈ దేశంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోడానికి రైతులున్నారు క‌ద‌మ్మా. మళ్లీ మీరు కూడా ఎందుకు?"

జీఆర్ మ‌హ‌ర్షి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా