డిసెంబర్ 31, ప్లాష్ బ్యాక్‌ను గుర్తు చేసే డేట్. ఈ సంవత్సరం ఏం చేసామా అని ప్రతి ఒక్కరూ రీల్ వెనక్కి తిప్పుతారు. ఏమీ చేయలేదు. అన్ని సంవత్సరాలలాగే ఈ ఏడాది కూడా ముగిసింది అని అర్థమై, అనేక నిర్ణయాలు తీసుకుని రాత్రికి పార్టీ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నిద్రపోతారు.
మెజార్టీ నిర్ణయాలు ఇలా వుంటాయి.
1.జనవరి ఒకటి నుంచి మందు మానేయాలి.
డిసెంబర్ 31తో ఆఖరు కాబట్టి, ఇంకో మూడు పెగ్గులు ఎక్కువ తాగుతారు. రేపసుసుచిచి …మంద్యుస్ బంద్స్‌సుసు (రేపట్నుంచి మందు బంద్) అని స్‌స్ భాష మాట్లాడి, ఎంత స్ట్రిక్ట్‌గా మందు మానేస్తున్నారో మందు భాషలో నవ్వుతూ, ఏడుస్తూ చెబుతారు. నిద్ర లేస్తే హాంగోవర్, తలనొప్పి. ఇంట్లో వాళ్ల గుడికి పోదాం రమ్మంటారు. బలవంతంగా లేచి తూలుతూ వెళ్లి రాగానే శ్రేయోభిలాషి ఫోన్.
“హాంగోవరికి 60 పడితే అదే మందు మామా”.. “మానేశాను మామా”.. “ఈ రోజు వేసి రేపు మానేయ్”
తలనొప్పితో చచ్చేకంటే వేయడమే మేలు. 60 పడితే తలనొప్పి మాయం. రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు స్ట్రిక్ట్. కాకపోతే సాయంత్రానికి తిక్కతిక్కగా, ఫస్ట్రేషన్‌గా ఉంటుంది.
అడక్కపోయినా అందరికీ ఫోన్ చేసి “మందు మానడం పెద్ద కష్టం కాదురా నేను మానేసి నాలుగు రోజులైంది” అని స్వయం ప్రకటన.
ఆరో తేదీ వైన్ షాప్ చూడగానే నరాలు జివ్వుమని, కాళ్లు బ్రేకులేస్తాయి. అందరికీ చెప్పుకున్నాం, మర్యాద పోతుంది అని పక్కనే ఉన్న పానీపూరి తింటారు.
ఏడో తేదీ ప్రాణ మిత్రుడి ఫోన్. సాయంత్రం బర్త్‌డే పార్టీ. స్కాచ్ విస్కీ. మానేశాను అంటే వినడు. ఊరికే కూచుని మంచింగ్ తీసుకో. మందు పోస్తున్నప్పుడు స్కాచ్ విస్కీ చెక్క వాసనకి ముక్కులోని కండరాలన్నీ సాగుతాయి. సోడా బుడగలు సుర్ అని సౌండ్ చేస్తాయి.
ముందర పెట్టిన గ్లాస్‌ని వెనక్కి తోసి “రుణం తీరిపోయిందిరా” అని ఫిలాసఫీ. “ఈ ఒక్క రోజు కానీయ్. రేపు నీ ఇష్టం. మనకున్నది ఒకే రిలాక్సేషన్. ఇదీ మానేసి ఏం పీకాలని?”
అన్నీ మానేసి ఏం సాధించాలి? గొంతులోకి దిగింది. ఐదు రోజులుగా నిద్రపోతున్న పేగులు లేచి నాగుపాముల్లా డాన్స్ చేశాయి. రెండో పెగ్గుకి నవ్వుల్ నవ్వుల్. మూడో పెగ్గుకి మళ్లీ ఆత్మ విశ్వాస ప్రకటన.
“నేను అనుకుంటే మానేయగలను. ఐదు రోజులు ముట్టలేదు తెలుసా” డిసెంబర్ 31 తర్వాత ప్రతి ఏడాదీ ఇదే సీన్ రిపీట్.
సిగరెట్ మానేసేవాళ్ల స్టోరీ కూడా ఇదే. కాకపోతే వీళ్లు ఐదు రోజులు కూడా వుండరు. మూడు రోజులే. ఇక ఆరోగ్య శపథాలు చేసేవాళ్లు వేరే వుంటారు. జనవరి 1 నుంచి వాకింగ్ స్టార్ట్. నాలుగు రోజులు చేసి, ఐదో రోజు వాన వచ్చిందనో, ఎండ కాస్తుందనో ఆపేస్తారు. తర్వాత అంతే.
కొందరు నాన్‌వెజ్ మానేస్తారు. బిర్యానీ వాసన తగిలితే ఈ ఒక్క సారికే అని లాగిస్తారు. బరువు తగ్గాలనుకునే వాళ్లు కూడా సేమ్. రచయితలు కొంచెం డిఫరెంట్. 31 రాత్రిలోగా కథ రాసి, గత ఏడాది అకౌంట్‌లో వేయాలని అనుకుంటారు. రెండు పేజీలు రాసి ఎప్పటికీ పూర్తి చేయరు. కొత్త ఏడాదిలో ఎలాగైనా నవల రాయాలని కూచుంటారు. అది ఏ ఏడాదిలో పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు.
కొంత మందికి క్యాలెండర్లు, డైరీల పిచ్చి వుంటుంది. కనపడిన ప్రతి వాన్నీ పీక్కు తింటారు. పాతిక క్యాలెండర్లు, డజను డైరీలు పోగు చేస్తారు. ఏం చేయాలో తెలియక చివరికి తూకానికి వేస్తారు.
పార్టీలు జోరుగా జరుగుతాయి. న్యూ ఇయర్ ఏదో అద్భుతాలు తెస్తుందని అందరి ఆశ. అద్భుతాలు బయటి నుంచి రావు. మనలోపలే వుంటాయి. ఎవరికి వారు తెలుసుకోవాలి.
ఫేస్‌బుక్, వాట్సప్ ఈ రాత్రికి కిటకిటలాడుతాయి. కవిత్వంతో కొంత మంది వేటాడుతారనే హెచ్చరిక కూడా వాతావరణ శాఖ నుంచి వస్తుంది. కవులు, రచయితల మెరుపుదాడి కొత్త ఏడాది కూడా కొనసాగకుండా బుక్ ఫెయిర్‌ని 31వ తేదీ ముగించడం ఒక విశేషం.
క్యాలెండర్, తేదీలు మారితే ఏమీ మారదు. మనలోపల ఏదో మారాలి. దాన్ని గుర్తు పడితే మన ప్రపంచం మారిపోతుంది.
ముక్తాయింపుః ఏపీ తాగుబోతు వ్యాఖ్య.. మనశ్శాంతి కోసం మేము మందు తాగుతుంటే.. మందుబాబులకే మనశ్శాంతి లేకుండా చేసిన మా జగన్ గ్రేట్
జీఆర్ మహర్షి