ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అయితే.. నుదుటి తిలకం లాంటి నటుడు కృష్ణ. అలాంటి లెజెండ్ ను ఈ ఏడాది కోల్పోయింది టాలీవుడ్. కేవలం కృష్ణను మాత్రమే కాదు.. దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు లాంటి ఎంతోమంది నటుల్ని ఈ ఏడాది టాలీవుడ్ కోల్పోయింది.
తెలుగుతెరపై చెదరని సంతకం కృష్ణ. ప్రయోగాలకు పెట్టింది పేరైన ఈ సీనియర్ నటుడ్ని టాలీవుడ్ కోల్పోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ హవా నడుస్తున్న టైమ్ లో ఇండస్ట్రీకొచ్చి.. వాళ్లకు పోటీగా నిలిచి, తనకంటూ ఓ మార్గాన్ని నిర్మించుకున్న అసమాన్యుడు కృష్ణ. ఇప్పటికీ, ఎప్పటికీ కృష్ణ చేసినన్ని ప్రయోగాల్ని టాలీవుడ్ లో మరే హీరో చేయలేడు.
ఇదే ఏడాది మరో దిగ్గజాన్ని కోల్పోయింది టాలీవుడ్. ఆయనే కృష్ణంరాజు. 87 ఏళ్ల కృష్ణంరాజు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటివాడు అనే ఇమేజ్ ను తెచ్చుకున్న ఏకైక నటుడు కైకాల.
కైకాల కన్నుమూసిన 24 గంటల్లోనే మరో నటుడు చలపతిరావును కోల్పోయింది పరిశ్రమ. ఇండస్ట్రీలో చాలామంది బాబాయ్ అంటూ ఆత్మీయంగా పిలుచుకునే చలపతిరావు, 78 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి, పోషించిన ప్రతి పాత్రలో తన మార్క్ చూపించారీయన. ఇండస్ట్రీలో ఈయనకు విరోధులు లేరు.
సెన్సిబుల్ డైరక్టర్ మదన్, సీనియర్ దర్శకులు తాతినేని రామారావు కూడా ఇదే ఏడాది కన్నుమూశారు. 'ఆ నలుగురు' అనే చిత్రంతో రచయితగా సత్తా చాటిన మదన్, ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఇక తాతినేని రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. ఇలాంటి అప్పటితరం నటులందరితో సినిమాలు తీశారు. యమగోల లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈయనదే. దొరబాబు, జీవన తరంగాలు, పచ్చటి కాపురం లాంటి సినిమాలు తాతినేని ప్రతిభను చాటుతాయి.
వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, బంధువులొస్తున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు తీసిన మరో దర్శకుడు శరత్ ను కూడా ఇదే ఏడాది టాలీవుడ్ కోల్పోయింది. మరో దర్శకుడు పీసీ రెడ్డి కూడా ఈ ఏడాది కన్నుమూశారు. బడిపంతులు, మానవుడు-దానవుడు లాంటి సినిమాలు తీసింది ఈయనే.
వీళ్లతో పాటు సీనియర్ నటుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా ఇదే ఏడాది మరణించారు. మరో సీనియర్ నటుడు బాలయ్య, సినీ గేయరచయిత కందికొండ యాదగిరి, నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ నారంగ్ ని కూడా టాలీవుడ్ కోల్పోయింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కేకే, సూపర్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు బప్పిలహరి, గానకోకిల లతా మంగేష్కర్ కూడా ఇదే ఏడాది తనువు చాలించారు. చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు.