పాశ్చాత్య పోకడల పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సనతానధర్మ జ్యోతిని ఒక కాపు కాయడానికి తమ గళాలు అడ్డుపెట్టిన మహనీయులు కొందరున్నారు. చాగంటి, గరికిపాటి, సామవేదం, వద్దిపర్తి, మాడుగుల..ఇలా తెలుగులో అనేకులుంటే మొత్తం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఈ బాధ్యతతో ఉన్న పెద్ద వ్యక్తి సద్గురు జగ్గి వాసుదేవ్.
సనాతనధర్మం విలువల్ని, సంప్రదాయ మూలాల్ని భక్తి ఆవశ్యకతని, పురాణ విశేషాల్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ వాటిలో ఉన్న శాస్త్రీయతని పరిచయం చేస్తూ చైతన్యాన్ని నింపుతున్న మహానుభావులే వీళ్లంతా. వీళ్ల పనేవిటో మనకంటే వీళ్లకే బాగా తెలుసు.
కొందరు అన్యమతస్థులకి, నాస్తికవాదులకి వీళ్ల మాటలు రుచించకపోయినా వీరందిస్తున్న సత్సంప్రదాయ ప్రవచన ప్రసదాన్ని భక్తిగా అనుష్ఠిస్తున్నవారు లక్షలాదిమంది ఉంటారు.
ఈ ప్రవచనకారుల బాధ్యతల్లా రాజకీయవివాదాల్లో తలపెట్టకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. పైన ఒప్పుకున్న పేర్లల్లో ఒక్క గరికిపాటివారు తప్ప తక్కిన వారంతా ఆ బాటలో వెళ్తున్నవారే.
ఎందుకా బాధ్యత వహించాలి అంటే ఒక కారణముంది. అనవసరపు విషయలు మాట్లాడడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతినొచ్చు. దాని వలన విద్వత్తుకి, వయసుకి గౌరవం ఇవ్వకుండా అమంగళకరమైన తిట్లు తిట్టే ప్రబుద్ధులు బయలుదేరొచ్చు. దానివల్ల సదరు ప్రవచనకారుడికే కాదు. ఆ మలినం వారి వృత్తికి కూడా అంటుకునే ప్రమాదముంది. అంటే సనాతనధర్మం మీద గౌరవం వీళ్ల ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంది.
బిందెడు పాల్లల్లో కాస్త ఉప్పు కలిస్తే చాలు..మొత్తం విరిగిపోతాయి. ఈ ప్రవచనకారుల జీవితాలు కూడా అంతే. వీళ్లు ఎలాపడితే అలా స్వేచ్ఛ తీసుకుని ప్రవర్తించకూడదు…అది ధర్మమే అని వారు అనుకున్నా సరే. ఎంత ఆధ్యాత్మిక విషయాలు చెబుతున్నా లౌక్యం వహించడం చాలా అవసరం. అప్పుడే వారి వృత్తికి, మాటకి కూడా శోభ కలుగుతుంది.
అయితే ఈ ప్రవచనకారులంతా భారతదేశ పౌరులే. వాళ్లకీ రాజకీయ అవగాహన, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ వాటిని బహిర్గతం చేయడం ఇక్కడ ప్రమాదకరం. ఉదాహరణకి గరికిపాటివారి గురించి చెప్పుకుందాం.
వీరికి చంద్రబాబుగారన్నా, వారి పాలన అన్నా ఇష్టం ఉండొచ్చు. అస్సలు తప్పులేదు. కానీ ఒకసారి బహిరంగంగా బయటపడ్డారు. అదెప్పుడంటే, హైదరాబాదులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ప్రపంచ తెలుగుమహాసభలు నిర్వహించి అప్పటి ఆ.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పంపలేదు. దానికి స్పందిస్తూ, “నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం లేని తెలుగు సభలకి నేను వెళ్లను. అది నాకు అవమానం” అని ఏదో అన్నారు మీడియా ముఖంగా. నిజానికి ఇది కాస్త అతి. ఈయన తెదేపా సభ్యుడు కాదు. పైగా ఒక కవి, అవధాని, పండితుడు. తెలుగు సభలకి ఆహ్వానిస్తే వెళ్లి తీరాలి. అక్కడ రాజకీయాలు, ముఖ్యమంత్రుల మధ్య ఉన్న మనస్ఫర్థలు ఈయనకెందుకు?
మరో సందర్భంలో వై.ఎస్.ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి, తిరుమలకి ఏదో లింకు పెట్టి అన్యాపదేశంగా వెటకారం చేస్తూ ఏదో ఒక మాటన్నారు. అది కచ్చితంగా తప్పే కదా. అయినా వైకాపావాళ్ళు ఉపేక్షించారు ఆయనమీద గౌరవంతో.
గత గోదావరి పుష్కరాల టైములో కొంతమంది తొక్కిసలాటలో చనిపోతే దానిని వెంటనే పేరు చెప్పకుండా సాటి ప్రవచనకారుడైన చాగంటివారి మీదకి నెట్టేసి, ఆయన అక్కడే స్నానం చేయమని చెప్పడంవల్లే అంతమంది తొక్కిసలాటలో చచ్చిపోయారని ప్రచారం చేసారీయన. దానివల్ల ఇద్దరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నయని ప్రచారం జరిగింది. కానీ చాగంటివారి పెద్దమనసు వల్ల మళ్లీ ఇద్దరూ ఒకటయ్యారు.
చాలామంది చెప్తుంటారు… ఏదైనా విన్నపంతో వీరిని ఎవరైనా సంప్రదిస్తే పండితగర్వం చూపిస్తారని, మనసు చివుక్కుమనేలా మాట్లాడిన సందర్భాలు ఉంటాయని. ఈ విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎదుటివారి మనసుల్ని చివుక్కుమనేలా చేయడం, చిరాకుపడడం ప్రవచనకారులకి అస్సలు సరికాదు.
ఇక నిత్యం ప్రవచనాలు చెప్పడంలో ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పొరపాట్లు దొర్లడం సహజం. ఒక సందర్భంలో విశ్వబ్రాహ్మణులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఈయన్ని క్షమాపణ అడిగారు. వీడియో ముఖంగా అందరికీ క్షమాపణ చెప్పారీయన. అది వారి సహృదయమే. అది తప్పు కూడా కాదు…పొరపాటు మాత్రమే. అయినా క్షమాపణ చెప్పారు. శాంతిమంత్రం పాడేశారు.
అయినప్పటికీ తాను నిష్కర్షగా ఉంటానని, క్రమశిక్షణాపరుడినని గొంతు లేపి చుట్టూ ఉన్నవారిని రకరకాల సందర్భాల్లో చిరాకుపడడం జరుగుతూనే ఉంది. ఈ మధ్యనే ఒక సభలో వీరికి సన్మానం చెయ్యాలని కొందరు అభిమానులు వేదికమీదికొస్తే మైకు తీసుకుని మరీ అందర్నీ గద్దించారు. తాను సన్మానాలకి రాలేదని, తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, అందరూ వేదిక దిగకపోతే తాను వెళ్లిపోతానని అరిచారు. ఒక ఆధ్యాత్మిక ప్రవచనకారుడు ఇలా ప్రవర్తిస్తే ఆయన బోధించే శాంతికి, ఓర్పుకి, ప్రేమకి అర్థమేమున్నట్టు? శివుడంతటి వాడే భక్తకన్నప్ప ఎలాంతి భక్తి ప్రదర్శించినా అక్కున చేర్చుకున్నాడు. అలాగే ఆ అభిమానులు కూడా ఏ గజమాలలో, శాలువలో తెచ్చి తమ గురువుని సత్కరించుకోవాలని అనుకున్నారు. దానికి ఒంటికాలిమీద లేవడమెందుకు?
ఇప్పుడు తాజాగా అలయ్-బలయ్ లో చిరంజీవి అంశం. పైవన్నీ ఎన్నో జరిగినా పెద్దగా జనబాహుళ్యంలోకి వెళ్లలేదు. విషయం చిరంజీవి కనుక ప్రచారమెక్కువైపోయి ఈయన కోపం, క్షణికావేశం అందరికీ పరిచయమయ్యాయి. “గరికిపాటి” అని యూట్యూబులో కొడితే ఆయన చెప్పిన వేలాది ప్రవచనాలు కాకుండా కేవలం ఈ తాజా సంఘటనకి సంబంధించిన వార్తలు, ఖండనలే కనిపిస్తున్నాయి. అమృతమయంగా ఉన్న ఆయన కీర్తివలయాన్ని అనవసరపు భావోద్వేగంతో విషమయం చేసుకున్నారు కదా ఈయన. మళ్లీ కొన్నాళ్లకి ఇదంతా కచ్చితంగా సర్దుకుపోతుంది. అయినప్పటికీ ఈ మచ్చ మాత్రం దేనికి?
ఆయనది ధర్మాగ్రహమే కావొచ్చు. కానీ దానిని అర్థం చేసుకునేంత పరిపక్వత సమాజంలో అందరికీ ఉండదు. ఎదుటివారిని ప్రేమ, ఓర్పు, సహనం లాంటి గుణాలతోనే జయించగలరు ఎవరైనా…కేవలం పాండిత్యంతో కాదు. ఆ విషయం గరికిపాటిగారికి చెప్పే స్థాయి ఈ వ్యాసకారుడికి లేనే లేదు. ఇదంతా దేనికంటే ఆయన వ్యక్తిత్వంలో చిన్నమార్పు ఆయనకే కాకుండా, ఆయన బోధించే విషయాలకి, మొత్తంగా హిందూసమాజానికి శోభని తీసుకొస్తుందని ఆశ. ప్రస్తుతానికి ఆయన పౌరాణిక సినిమాల్లో చూసిన విశ్వామిత్రుడు, భృగుమహర్షి, దూర్వాసుడు లాగ కనిపిస్తున్నారు. ఆ యుగాల్లో ఏమో గానీ…సోషల్ మీడియా ఉన్న ఈ కలియుగంలో మాత్రం ఆ స్వభావాలతో గౌరవాలు పొందడం అసాధ్యం.
మంత్రిప్రగడ రామాంజనేయశర్మ