తమ్ముళ్లకు దమ్ముంది.. చంద్రబాబుకు ఉందా?

మయసభలో ద్రౌపది పరిహసించిన పరాభవం తరువాత విపరీతమైన మధనానికి లోనైన సుయోధన చక్రవర్తికి ఒక సంశయం ఎదురయింది! ‘‘మనుటయా.. మరణించుటయా!!’’ అని దుర్యోధనుడు పాపం తీవ్రంగా ఆలోచన చేశాడు. Advertisement అదే తరహాలో ఏపీ…

మయసభలో ద్రౌపది పరిహసించిన పరాభవం తరువాత విపరీతమైన మధనానికి లోనైన సుయోధన చక్రవర్తికి ఒక సంశయం ఎదురయింది! ‘‘మనుటయా.. మరణించుటయా!!’’ అని దుర్యోధనుడు పాపం తీవ్రంగా ఆలోచన చేశాడు.

అదే తరహాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఇప్పుడు ఒక విషమ పరీక్ష ఎదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేయడమా? మానడమా? అనే సంశయం చంద్రబాబు ఎదుటకు వచ్చింది!

మామూలుగా ఉప ఎన్నికలు వస్తే గెలవడం చేతకాక డొంకతిరుగుడు కుంటి సాకులు వెతుక్కునే అలవాటున్న చంద్రబాబు, మునుగోడు విషయంలో మాటలతో తప్పించుకోవడం కష్టం! పైగా అక్కడి స్థానిక తెలుగుదేశం నాయకులు స్వయంగా అడుగుతున్నారు, కాదంటే పరువు నష్టం! ఇలాంటి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పడిపోయారు!

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ శవాసనం వేసి ఉంది. దానిని లేపి ఇప్పుడు పెళ్లికూతురు లాగా ముస్తాబు గట్రా చేయడం అసాధ్యం. తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు, తెలంగాణలో పార్టీకి కనీస జవసత్వాలు తీసుకురాగలను అనే నమ్మకం కూడా లేదు! అందుకే ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టడం పూర్తిగా మానేశారు.

ఏదో తాను హైదరాబాదులో ఉన్న సమయాలలో తెలంగాణ నాయకులు కలిసినప్పుడు, ఇకమీదట ప్రతినెలా రెండుసార్లు కార్యకర్తలతో సమావేశం అవుతా.. అంటూ ఒక రొటీన్ స్టాక్ డైలాగ్ వల్లించి రోజులు నెట్టేయడం తప్ప, చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు!

సాధారణంగా అభ్యర్థి మరణం పర్యవసానంగా ఉప ఎన్నిక వచ్చే  ప్రతి సందర్భంలో ఒక అప్రకటిత కట్టుబాటు పాటిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు పోటీకి దిగకుండా తప్పించుకుంటూ వస్తున్నారు.

‘మరణించిన వారి కుటుంబంలో అభ్యర్థికి టికెట్ ఇస్తే పోటీకి దిగకపోవడం అనేది సత్సంప్రదాయం, దానిని పాటిస్తున్నాం’ అని తమను తాము మభ్యపెట్టుకుంటున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక వేరే నేపథ్యంలో వచ్చింది.

కేవలం తన అహాన్ని ప్రదర్శించడానికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. సాంప్రదాయం ముసుగులో పోటీకి దిగకుండా తప్పించుకునే అవకాశం చంద్రబాబుకు లేదు. అలాగని పోటీకి దిగితే గెలుస్తామని నమ్మకం కాదు కదా.. డిపాజిట్ దక్కుతుందనే ఆశ కూడా లేదు! 

అయితే స్థానిక తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడుకు కుదురుగా కూర్చునే అవకాశం ఇవ్వడం లేదు! మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి లోకల్ లీడర్ జక్కలి ఐలయ్య యాదవ్ ఉత్సాహం చూపిస్తున్నారు.

దాంతో రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు బక్కని నరసింహులు కూడా చంద్రబాబును కలిసి, తమ పార్టీని పోటీకి దింపుతాం అనే ప్రతిపాదన ఆయన ముందు పెట్టారు. రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న పార్టీ ‘‘పోటీకి దిగుతాం’’ అనే ఆలోచన చేయడమే సిగ్గుచేటు! ఎన్నిక వచ్చీ రావడంతోనే ప్రచార పర్వంలో దిగిపోయి ఉండాలి. సరే ఎటు శవాసనం వేసి ఉన్న పార్టీ గనుక వారు ఇంకా మీమాంసలో ఉన్నారని అనుకోవచ్చు!!

మరి చంద్రబాబు నాయుడులో ఉన్న మనోవేదన ఎలాంటిది? ఎన్నికల్లో పోటీ చేయిస్తే గెలిచేది లేదు.. కానీ తమ అభ్యర్థి రంగంలో ఉన్నప్పుడు తాను స్వయంగా ప్రచారానికి వెళ్లాల్సి వస్తుంది. వెళితే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి.

‘తమలపాకుతో తాను ఒకటంటే.. తలుపు చెక్కతో పది వడ్డించటానికి’ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్ధంగా ఉంటారు.  ఏపీ ప్రయోజనాల కోసం  కమల నాయకులతో మైత్రి కుదుర్చుకునే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు.

ఈ ఎన్నికలో టీడీపీ దిగడం వలన వారి విజయావకాశాలకు గండి పడితే.. ఆ పార్టీ తనను క్షమించదనే సంగతి ఆయనకు తెలుసు! ఏపీలో బిజెపి మైత్రి కోసం తహతలాడుతుండగా, అక్కడి సమీకరణాలను ఈ ఎన్నిక దెబ్బతీసినా తీయవచ్చు! గెలిచే అవకాశం లేని ఎన్నిక కోసం ఇన్ని కష్టాలు పడడం అవసరమా? అనే గుంజాటనలో చంద్రబాబు పడ్డారు!

ఉపఎన్నిక వస్తే పోటీ చేయడానికి భయపడే స్థాయిలో.. ఉండడమే చంద్రబాబులోని దౌర్బల్యానికి ప్రతీక. చివరికి కేఏ పాల్ కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థిని మోహరిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో చంద్రబాబు మాత్రం సైలెంట్‌గా ఉండిపోతే అది ఆయన తన పార్టీని తానే, మరో వెన్నుపోటు పొడిచినట్లుగా అవుతుంది!!