ఎంపీ బరిలో దిగరట.. కేసీఆర్ మహాచాతుర్యం!

‘‘ఆయుధమున్ ధరింప.. నని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము చేయువాడ..’’ అన్నాడు కృష్ణుడు. Advertisement ‘‘ఔరా కృష్ణుడెంత మోసగాడు! సైన్యాన్నంతా అర్జునినికి కట్టబెట్టడానికి ఈ ఎత్తు.  బలగములేని ఈ ఏకాకి కంచిగరుడ సేవ ఏరికి…

‘‘ఆయుధమున్ ధరింప.. నని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము చేయువాడ..’’ అన్నాడు కృష్ణుడు.

‘‘ఔరా కృష్ణుడెంత మోసగాడు! సైన్యాన్నంతా అర్జునినికి కట్టబెట్టడానికి ఈ ఎత్తు.  బలగములేని ఈ ఏకాకి కంచిగరుడ సేవ ఏరికి కావలె’’ అని అనుకున్నాడు సుయోధనుడు.

ఎందుకో.. కల్వకుంట్ల తారకరామారావు చెప్పిన సంగతి వింటోంటే.. దానవీరశూరకర్ణలోని ఈర ఘట్టం గుర్తుకు వచ్చింది. 

కేటీఆర్ చెబుతున్న ప్రకారం.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను స్వయంగా ఎంపీగా పోటీచేయరట! తన పార్టీ బీఆర్ఎస్‌ను మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలో మోహరిస్తారట. ఇందులో ఏదో ట్విస్టు కనిపిస్తోంది. కృష్ణుడి చాతుర్యం కనిపిస్తోంది. బలగాలు అన్నింటినీ యుద్ధరంగంలోకి దించేసి.. తానూరక ప్రచారము మాత్రము సేయువాడ.. అని ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. 

కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద స్కెచ్ వేశారు. కేసీఆర్ కు ఢిల్లీ రాజకీయాల మీద మోజు పుట్టింది.. ఆయన తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ తగ్గించేశారు.. రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం మానేశారు.. అని ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు చేయడానికి ఆయన అవకాశం ఇవ్వదలచుకోలేదు. అసలు తాను ఎంపీ బరిలో పోటీచేయనే చేయను అని ఆయన అంటున్నారు. రాష్ట్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అని ఇటీవల బిఆర్ఎస్ ప్రకటన సందర్భంగానే కేసీఆర్ సెలవిచ్చారు. 

అంటే.. 2023లొ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీచేస్తారు. బిజెపి కోరిక ఫలించకపోతే, అంటే గులాబీదళం మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు.. ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎంపీ ఎన్నికల సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతా బిఆర్ఎస్ అభ్యర్థులను మోహరించి వారి తరఫున ప్రచారం, అనగా శంఖారావం మాత్రం చేస్తారు. తాను అభిమానించే అన్నగారు.. కురుక్షేత్రంలో మోగించిన పాంచజన్యం మాత్రం పూరిస్తారు. 

ఇందులో ఎత్తుగడ స్పష్టం. బిఆర్ఎస్‌కు ప్రజల దీవెన ఎలా ఉంటుందో తెలియదు. 17 సీట్లున్న తెలంగాణలో ప్రస్తుతం ఆయనకున్న బలం కేవలం 9 మంది ఎంపీలు మాత్రమే. బిజెపి, కాంగ్రెస్ లు ఎంపీ ఎన్నికల మీద మరింత గట్టిగా ఫోకస్ పెడతాయి కాబట్టి.. వచ్చే ఎన్నికల నాటికి.. ఈ బలం ఇంకో మెట్టు తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. జాతీయ రాజకీయాల్లో తన స్థానం పదిలంగా ఉండడానికి.. ఇతర ప్రాంతాల్లో కూడా పోటీచేసి కొన్ని సీట్లు గెలుచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పెట్టారు. అయితే ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరిని ఎంపిక చేసి పోటీచేయించడం వరకు కేసీఆర్ చేతిలో ఉంటుంది. గెలవడం ఓడిపోవడం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. 

అందుకే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ కూడా ఎంపీ బరిలోకి దిగితే గెలుస్తారు గానీ.. మిగిలిన దేశవ్యాప్త ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. నరేంద్రమోడీ మళ్లీ ఢంకా బజాయించి మూడోసారి అధికారంలోకి వచ్చే మెజారిటీ సాధిస్తే.. కేసీఆర్ ఎంపీగా ఆయన ఎదుట పార్లమెంటులో కూర్చోడానికి కూడా అవమానం ఫీలవుతారు. అసలు తన బిఆర్ఎస్ కు ఎన్ని సీట్లు దక్కుతాయో.. విపక్ష కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడినా కూడా.. తమ పార్టీ సాధించే సీట్ల అవసరం వారికి ఏ మాత్రం ఉంటుందో.. ఎంత మేరకు బార్గెయినింగ్ చేయవచ్చునో… అన్నీ అప్పటికి గానీ లెక్కతేలవు. అవన్నీ లెక్క తేలకుండా ముందే ఎంపీగా పోటీచేస్తే.. అభాసుపాలు కావాల్సి వస్తుంది. 

అందుకే.. తాను ప్రచారం మాత్రం చేస్తానని.. దేశమంతా తిరుగుతానని, మోడీ ఓటమి తప్ప హస్తిన అధికారంపై మమకారం లేదని, తెలంగాణ తన అగ్రప్రాధాన్యం అని మాటలు చెప్పి.. ఎంపీగా బరిలో దిగరు. ఒకవేళ విపక్ష కూటమి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడి.. అందులో బిఆర్ఎస్ సాధించే సీట్ల సంఖ్య అవసరం కీలకం అయితే గనుక.. అప్పుడు హఠాత్తుగా ఢిల్లీ గద్దెమీదికి దూకేస్తారు. ‘‘దేశఅవసరాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా’’ ఈ నిర్ణయం తీసుకున్నాననే పడికట్టు పదాల గారడీ ఎటూ అండగా ఉండనే ఉంటుంది. అందుకే.. కేసీఆర్ ఎంపీగా పోటీచేయబోరని, కేటీఆర్ ప్రకటించగానే.. వారి వ్యూహం మొత్తం తేటతెల్లం అయిపోతోంది.