అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని కోరుకునే వారి యాత్ర ఇప్పుడు భీమవరం దాకా చేరుకుంది. మరోరకంగా చెప్పాలంటే.. ఆ యాత్రకు హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టే. ఇప్పటిదాకా గుంటూరు నుంచి విజయవాడ మీదుగా వెస్ట్ గోదావరి వరకే వారి యాత్ర సాగుతోంది. ఇంత వరకు రాజకీయంగా అనుకూలంగా మాట్లాడేవారు, వ్యతిరేకించేవారి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతం వరకు సాధారణ ప్రజల్లో ఈ యాత్ర పట్ల ప్రతికూల వ్యక్తం కావడం జరగకపోవచ్చు. ఎందుకంటే.. గుంటూరు, విశాఖలలో ఎక్కడున్నా వారికి పెద్ద తేడా పడదు. విజయవాడ వారికి గుంటూరే దగ్గర. కాబట్టి ప్రతికూలతలు తక్కువే వచ్చి ఉండొచ్చు.
కానీ ముందు ముందు సీన్ మారుతుంది. యాత్రలో హీట్ పెరుగుతుంది. ఈస్ట్ గోదావరి, విశాఖలోకి ఎంటరయ్యే సమయానికి స్థానిక ప్రజల నుంచి కూడా ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటనలు ఎదురుకావడం సహజం. రాజకీయ నాయకులు వాటిని ప్రేరేపించాల్సిన అవసరం కూడా లేదు. గుడివాడ వంటి చోట్ల యాత్ర చేస్తున్న వాళ్లే.. వైసీపీ కార్యాలయాల వద్ద.. కాస్త ఓవరాక్షన్ చేసి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. కానీ.. ముందుముందు.. రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించే వాతావరణం వస్తుంది.
ఎందుకంటే.. విశాఖలో రాజధాని అనే మాట వినిపించిన నాటినుంచి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ మురిసిపోతున్నాయి. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని కలగంటున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి ఆ ప్రాంతాల వారందరికీ విశాఖ చాలా దగ్గర కూడా అవుతుంది. అవకాశం ఉంటే.. రాజధాని తమకు దగ్గరగా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు? ఈ కారణాల చేత, యాత్రకు సాధారణ ప్రజల ప్రతిఘటనలే మొదలు కావొచ్చు. దారమ్మట ప్రతి పల్లెలోనూ ప్రజలు విశాఖ రాజధాని భావనతో ఉన్నవారు.. ఈ యాత్రను ఈసడించుకోవచ్చు.
దీనికి అదనంగా రాజకీయ నాయకులు కూడా యాత్ర గురించి చేస్తున్న వ్యాఖ్యల్లో హీట్ పెంచుతున్నారు. చితక్కొట్టాలి.. శ్రీకాకుళంలో అడుగుపెట్టనివ్వం వంటి పదాలు వాడుతున్నారు. వారి మాటలను.. కార్యకర్తలు, అనుచరులు మరోలా అర్థం చేసుకుని రెచ్చిపోతే శాంతి భద్రతలు అదుపుతప్పుతాయి. తొలినుంచి కూడా ఈ యాత్ర శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుందని పోలీసులు భయపడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా పోలీసులు ఎంతో జాగ్రత్తగా యాత్రకు భద్రత కల్పిస్తూ వస్తున్నారు. ప్రజలే స్వయంగా వ్యతిరేకించడంతో పాటు, రాజకీయ ప్రేరేపిత శక్తులు కూడా కలిస్తే అదుపుతప్పుతుంది. ఆ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అవుతున్నారు.
ఎంత జాగ్రత్తగా ఈ యాత్రను చివరిదాకా తీసుకువెళతారో.. లేదా, చేయిదాటిపోయే వాతావరణం కనిపిస్తే మధ్యలోనే అనుమతులు నిరాకరించి వెనక్కి పంపుతారో వేచిచూడాలి.