ముఖ్యమంత్రుల పేర్లు చెప్పడం లేదు. గత ఎనిమిదేళ్లుగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లినా అక్కడ ముఖ్యమంత్రుల పేర్లను ఉచ్ఛరించడం లేదు. తమకు రాష్ట్రంలో అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారు, ఎంతటి నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు.. అనే మాటలేవీ చెప్పడం లేదు! జస్ట్ మోడీని చూసి ఓటేయండి, డబుల్ ఇంజన్ సర్కార్ అని మాత్రమే అంటోంది. ఇలా ఎనిమిదేళ్లు గడిచిపోతున్నాయి. ఈ ఎనిమిదేళ్లలో చాలా రాష్ట్రాలు రెండ్రెండు సార్లు కూడా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఇప్పటి వరకూ జరిగిందే కాదు, ఇకపై కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహం మోడీ నామస్మరణే తప్ప మరోటి ఉండదని స్పష్టం అవుతోంది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపు మరొక కీలకమైన రాష్ట్రంలో ఎన్నికలున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ మొన్నటి వరకూ యడియూరప్ప రూపంలో బీజేపీకి చెప్పుకునేందుకు ఒక పెద్ద పేరు అయినా ఉండేది. సొంతంగా ఛరిష్మా ఉన్న నేతగా యడియూరప్ప ఉండే వారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి పక్కన పెట్టింది. అదే సామాజికవర్గానికి చెందిన వాడంటూ బసవరాజ్ బొమ్మైను సీఎంగా చేశారు కానీ, ఆయనకు అంత సీన్ లేదని స్పష్టం అవుతోంది. ఎంతగా అంటే.. బొమ్మైని తప్పించి మరొకరిని కర్ణాటక సీఎంగా చేయాలంటూ బీజేపీకి ఆ పార్టీ వీరాభిమానులే సూచిస్తున్నారు. తీవ్రమైన హిందుత్వ అజెండాను పాలనలో అమలు చేయాలని బొమ్మై ప్రయత్నిస్తున్నా.. ఈయన ఎందుకో బీజేపీ వీర భక్తులకే నచ్చడం లేదు. బలమైన నేతను సీఎంగా చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు!
అయినా బలమైన నేత అంటే? ఎక్కడ నుంచి వస్తారు! ఉన్నట్టుండి పుట్టుకురారు కదా బలమైన నేతలు ఎంతసేపూ మోడీ పేరు చెబుతూ ఎన్నికలకు వెళ్తుంటే, మీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో చూడొద్దు, మీ వార్డు మెంబర్ ఎవరో చూడొద్దు, మీ స్థానిక నేత ఎవరో చూడొద్దు, మీ మంత్రి ఎవరో తెలుసుకోవద్దు, మీ ముఖ్యమంత్రి ఎవరో పట్టించుకోవద్దు.. దేన్నీ చూడొద్దు, దేన్నీ పట్టించుకోవద్దు.. కేవలం మోడీని చూసి ఓటేయాలనేది బీజేపీ స్థిరపరుచుకున్న నినాదం! ఎనిమిదేళ్ల నుంచి ఇదే తీరు. మోడీ నామస్మరణ తప్ప బీజేపీకి మరో మార్గం లేదు. అతిగా హిందుత్వ అజెండాను అమలు చేసిన చోట కూడా మళ్లీ మోడీ పేరే చెప్పాలి. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవడం లేదు, చేయగల పనులను ప్రస్తావించడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఒక గుడ్డి నినాదం, ప్రజలను మోసం చేసే నినాదాన్ని ఇస్తారు. అంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ సర్కారు ఉంటేనే ఏదైనా చేస్తాం తప్ప, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది ఈ నినాదం తీరు!
ఇక కర్ణాటక ఎన్నికల్లో అయినా, వచ్చే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీ మోడీ పేరే చెప్పాలి, చెబుతుంది, అంతకు మించిన మార్గమూ లేదు. అయితే ఇలాంటి తరహా రాజకీయంతోనే జాతీయ పార్టీలు దెబ్బతింటాయని బీజేపీ వాళ్లు ఎప్పటికి గ్రహిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇలాంటి రాజకీయాలు దేశం చూడనివి కావు. ఇందిరగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అంటూ చెప్పుకుంది. భారతీయులు కూడా దశాబ్దాల పాటు ఇందిరను చూసి ఓటేశారు. అయితే ఇందిర నిష్క్రమణంతో కాంగ్రెస్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ కు బలహీన నేతలు ఇందిర నిష్క్రమణ తర్వాత పార్టీని కాపాడటంలో ఫెయిలయ్యారు. ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. స్థానిక నినాదాలతో, స్థానిక సమస్యల ప్రస్తావన, కుల పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని అనేక ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి ఇందిర అనంతరం. అవన్నీ చూపిన ప్రభావం కాంగ్రెస్ ను రాష్ట్రాల నుంచి ఖాళీ చేయించడమే!
ఇందిర తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినా, ఆ స్థాయి నాయకుడు కాలేకపోయారు. రాజీవ్ హయాం ముగిసే నాటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒంటికాలితో కుంటుతున్నట్టుగా మారింది. జాతీయ స్థాయిలో విపక్షం తయారైంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రబల శక్తులుగా మారాయి. రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ కు ఎక్కడైతే బలమైన నాయకత్వం లేదో .. అక్కడ వైరి పక్షాలు పునాదులు పరుచుకున్నాయి. అప్పటి నుంచినే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కొన్ని చోట్ల ఉనికే మాయమైంది. 2004లో కాంగ్రెస్ అధికారాన్ని అందుకున్నా.. వచ్చింది 145 సీట్లు. అవి కూడా ప్రధానంగా కొన్ని రాష్ట్రాల నుంచి దక్కినవే. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వివిధ రాష్ట్రాల్లో పవర్ ను సంపాదించుకున్న వారి మద్దతుతోనే 2004, 2009లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా కోల్పోయిన ఉనికిని మాత్రం కాంగ్రెస్ సంపాదించుకోలేదు.
మరి కాంగ్రెస్ కు జరిగినది బీజేపీకి ఎందుకు జరగకూడదు? వాస్తవాలను పరిశీలిస్తే కాంగ్రెస్ హయాంలో అయినా ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలుండేవారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదు! ఇప్పటికీ ఏదో ఎమోషనల్ ఓటు బ్యాంకుతోనే బీజేపీ ఈజీగా బంపర్ మెజారిటీలు సాధిస్తోంది. ఇదే ఎమోషన్స్ ప్రతిసారీ వర్కవుట్ అవుతాయనుకోవడం కూడా భ్రమే!
ఇలాంటి అధికారం ఉన్నప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ఏ పార్టీ అయిన బలపడాలి. రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలు తయారవ్వాలి. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీలకు బీజేపీ అధినాయకత్వం స్వేచ్ఛను ఇవ్వడం లేదు. ఎంతసేపూ మోడీ పేరే చెప్పాలనేది బీజేపీకి ఉన్న మార్గమే కాదు, ఇంతకు మించి మార్గాలను పట్టుకోవడం కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి పెద్దగా ఇష్టం లేనిదిగా ఉన్నట్టుంది! మరి మోడీ పేరుతో ఎన్నేళ్లు, ఎన్ని ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొంటూ వెళ్తుందనేది రాజకీయంగా ఆసక్తిదాయకమైన అంశం.
హిమ