గులకరాళ్లు శబ్దం చేస్తున్నప్పుడు పర్వతం మౌనం వహిస్తుంది. మార్క్స్ చెప్పిన శ్రమ దోపిడీ గురించి తేనెటీగలకి ఎప్పుడో తెలుసు. నీళ్లలో నివసించే చేపకి పడవలో జాలరి పొంచి వున్నాడని తెలియదు.
యవ్వనం ఒక కల. వృద్ధాప్యం పీడకల. రెండూ అనివార్యం. నువ్వెంత గొప్ప విద్వాంసుడైనా తీగ తెగిన వీణని మీటలేవు.
కాలం అనే రైలులో ప్రయాణించే ప్రతివాడు ఏదో ఒక స్టేషన్‌లో దిగక తప్పదు. ఎలుకల మహాసభకి పిల్లి ముఖ్య అతిథిగా వస్తే అదే ప్రజాస్వామ్యం.
చిలుకకి నిజంగా శాస్త్రం తెలిస్తే బందీఖానాలో చిక్కుకోదు. చినుకులున్నాయి, కాగితం పడవులున్నాయి. కానీ బాల్యమే లేదు. ముఖం మీది ముడతలు ఆగవు. ప్రతి పొరలోనూ ఒక కథ వుంటుంది.
అందరినీ అనుమానించకు. అగాథంలో జారిపోతున్నప్పుడు తాడు విసిరేవాడు ఒకడుండాలి. ఒక్కోసారి ఆ తాడు పాము రూపంలో కూడా ఉండొచ్చు.
మార్కెటింగ్‌తో సక్సెస్ రాదు. ఫైటింగ్‌తోనే వస్తుంది. దేవుడికి కూడా శఠగోపం పెట్టే భక్తులొస్తున్నారు. పూజారులూ జాగ్రత్త. నైవేద్యం పెట్టినంత మాత్రాన దేవుడు మన పక్షాన వుండడు.
బలహీనున్ని తిను, బలవంతుడికి ఆహారంగా మారిపో. అడవుల్లోని సూత్రం నాగరికతగా మారింది. తోడేళ్లు ఊరిలోకి రావడం లేదు. ఊరే తోడేళ్ల దగ్గరికి వెళుతోంది. పల్లెటూళ్లు నగరానికి యాత్రిస్తున్నట్టు.
సౌందర్యం వున్న చోట ప్రళయం కూడా వుంటుంది. మాటే కదా అని దానం చేయకు, వామనుడి పాదం చాలా పెద్దది. శకుని జూద లక్ష్యం కురు వంశ అంతం.
మన పిల్లలంతా అభిమన్యులే. బతకడం కోసం వెళ్లి, పద్య వ్యూహం నుంచి తిరిగి రారు. ఆధునిక భారతంలో సైంధవుడే గెలుస్తాడు, అర్జునుడు ఓడుతాడు.
ఎప్పటికీ ముగియని జీవితం అతిపెద్ద నరకం. అశ్వత్థామ అతిపెద్ద శాపగ్రస్తుడు.
ఆకలితో ఉన్న రైతు, ఆక్సిజన్ అందని గాలి మర. ఆకులు , పువ్వులు, కాయలు అన్నీ చెట్టు కనే కలలు. గొడ్డలి తీయకు. ఆకాశం కన్నీళ్లు గడ్డకట్టి పోతాయి. బరువు మోసేవాడెప్పుడూ మట్టిలోనే వుంటాడు. వృక్షం వేళ్లు అందుకే కనపడవు.
చిన్న టిఫెన్ బాక్స్‌తో, పెద్ద కళ్లతో సర్వీస్ ఆటోలో ఇరుక్కుని వెళుతున్న అమ్మాయిని చూడు. ఆకాశమంత కలలో వుంది.
కాళ్లు లాగుతున్నా నిలబడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా మనిషే, స్తంభం కాదు. రాజుల కోటలన్నీ కూలీల చెమట చుక్కలే. సంగీతం ప్రవహించే చోట మనుషులంతా దేవతలే. జలపాతం పాటకి శ్రోతలు అవసరం లేదు.
ఏరు తీసే కూనిరాగమే, నదిని చేరితే గర్జన. ఒంటరి పడవలో వెళ్లిన తండ్రి కోసం ఒడ్డుపై చిన్నబిడ్డ ఎదురు చూపులు.
అధికారం కత్తిలాంటిది. ఒడుపుగా తిప్పకపోతే నీ తలనే కోస్తుంది. నక్షత్రాలు అందుకోవాలంటే చీకటి రహస్యం తెలియాలి.
శాస్త్రమైనా శంకరుడి భాష్యమైనా చెప్పేదొకటే, జీవించు, మరణిస్తూ జీవించకు.
నిజంగానే జీవిస్తున్నామా? కమురు వాసన వస్తే అది నీ తప్పే.
జీఆర్ మహర్షి
mottam article lo highlights…’అర్జునుడు ఓడుతాడు’ & ‘గొడ్డలి తీయకు’ ‘అధికారం కత్తిలాంటిది. ఒడుపుగా తిప్పకపోతే నీ తలనే కోస్తుంది.’ ‘మార్కెటింగ్‌తో సక్సెస్ రాదు. ఫైటింగ్‌తోనే వస్తుంది’ 🙂
కలానికి కన్నం పడితే అక్షరాలు జారు కాలానికి కన్నం పడితే అగాధంలోకి జారు, ఈ రాత చూసి నా గుండె బేజారు.
Thank you 👍