Advertisement

Advertisement


Home > Politics - Opinion

వెంటాడే మ‌మ్ముట్టి న‌ట‌న‌-2

వెంటాడే మ‌మ్ముట్టి న‌ట‌న‌-2

నాన్ పాక‌ల్ నేర‌తు మ‌య‌క్క‌మ్ సినిమా గురించి ఇంకా ఏదో రాయాల్సింది వుందనిపించింది. నేను ఆత్మ‌ల్ని న‌మ్మేవాడిని కాదు. మృత్యువు భ‌య‌ప‌డ‌త‌గింది కాదు అని నీషే అన్నాడు. నేను ఆయ‌న అభిమానిని.

తిరుప‌తి సాక్షిలో ఉద్యోగం చేస్తున్న‌ప్పుడు, హైద‌రాబాద్‌కి మీటింగ్‌ల‌కని త‌ర‌చూ రావాల్సి వ‌చ్చేది. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణం. క‌డ‌ప‌లో భోజ‌నం చేసి నిద్ర‌పోయేవాన్ని. గాఢ నిద్ర‌లో హ‌ఠాత్తుగా ఎవ‌రో త‌ట్టి లేపిన‌ట్టు మెల‌కువ వ‌చ్చేది. కిటికీలోంచి చూస్తే తాడిప‌త్రి ప‌రిస‌రాల్లో ఉండేది రైలు. ఆ నేల‌లో మా తాత‌ముత్తాత‌లు తిరిగారు. వాళ్ల ఆత్మ‌లు న‌న్ను పిలుస్తున్న‌ట్టు వుండేది. అది నా భ్ర‌మ అని తెలుసు. క‌ర్నూలు వ‌ర‌కూ నిద్ర ప‌ట్టేది కాదు.

40 ఏళ్ల క్రితం ఒక సంఘ‌ట‌న జ‌రిగింది. ఒక మిత్రుడు ధ‌ర్మ‌వ‌రం నుంచి అనంత‌పురానికి ప్ర‌తిరోజూ రైల్లో కాలేజీకి వ‌చ్చేవాడు. ఒక రోజు అత‌న్ని డ్రాప్ చేయ‌డానికి స్టేష‌న్‌కి వెళ్తూ వుండ‌గా అత‌ను చాలా గంద‌ర‌గోళంగా ప్ర‌వ‌ర్తించాడు. అది అత‌ని క్యారెక్ట‌ర్ కాదు. స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లి రైలు ఎక్క‌లేదు. టీ స్టాల్ ద‌గ్గ‌ర త‌ల ప‌ట్టుకు కూచున్నాడు. ఎందుకో పిచ్చిపిచ్చిగా వుంద‌ని అంటున్నాడు. విచిత్రం ఏమంటే ఈ ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్న స‌మ‌యంలో అత‌ని తండ్రి తిరుమ‌ల‌లో గుండె పోటు వ‌చ్చి చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్నాడు. ఇది కేవ‌లం యాదృచ్ఛిక‌మా? తండ్రి బాధ‌ని ఇత‌ను ఫీల్ అవుతున్నాడా...నాకు తెలియ‌దు.

అనంత‌పురంలో ఒక మిత్రుడున్నాడు. ఇప్పుడు పెద్ద అధికారి. ఆయ‌న ఇంట్లో వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదీన ఇద్ద‌రు సోద‌రులు చ‌నిపోయారు. ఆ తేదీ అంటే అత‌నికి భ‌యం. ఇంట్లో నుంచి ఎక్క‌డికీ వెళ్ల‌డు. కానీ ఒక ఏడాది మ‌రిచిపోయాడు. అదే రోజు ఆయ‌న భార్య కొడుకుతో క‌లిసి కారులో బెంగ‌ళూరు బ‌య‌ల్దేరింది. వాళ్లు వెళ్లిన ఒక గంట త‌ర్వాత అత‌నికి ఆ తేదీ గుర్తొచ్చింది. వెన‌క్కి ర‌మ్మ‌ని చెప్ప‌డానికి ఫోన్ చేశాడు. అప్ప‌టికే రోడ్డు ప్ర‌మాదంలో వాళ్లు చ‌నిపోయారు. ఇదంతా కోఇన్సిడెంట్‌ అనుకోవాలంటే అనుకోవ‌చ్చు. కానీ మైండ్‌లో ఒక ప‌జిల్ అలాగే వుండిపోయింది.

ఆ సినిమాలో హీరో హ‌ఠాత్తుగా ఎందుక‌లా ప్ర‌వ‌ర్తించాడు? నాట‌క కంపెనీ న‌డుపుతున్నాడు కాబ‌ట్టి ఊరికే అలా నాట‌కం ఆడాడా? కేవ‌లం ఇదంతా అత‌ని క‌లా? ఇది బుర్ర తిరిగే కాంప్లికేటెడ్ క‌థ అని మిత్రులు అన‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

కుక్క‌లు ఆత్మ‌ల్ని ప‌సిగ‌డ‌తాయ‌ని అంటారు. సినిమా చివ‌ర్లో య‌జ‌మాని కోసం కుక్క ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంది. విచిత్రం ఏమంటే టీవీలో వినిపించే డైలాగ్‌లు కూడా మామూలివి కాదు. అవి క‌థ‌కి లీడ్స్ ఇస్తుంటాయి.

క‌థ‌లో జేమ్స్‌కి త‌మిళ పాట‌లు, త‌మిళ ఫుడ్ ఇష్టం వుండ‌దు. అయితే అత‌ను పూర్తి త‌మిళియ‌న్‌గా మారిపోతాడు. చ‌క్కెర ఎక్కువ వేసుకోని జేమ్స్, చ‌క్కెర‌ని ఇష్ట‌ప‌డే సుంద‌ర్‌గా మారిపోతాడు. డ్రైవ‌ర్ క‌మీష‌న్ కొట్టేస్తాడ‌ని అనుమానించే పిసినారి జేమ్స్‌, ఊరి వాళ్ల‌కి చేతనైన సాయం చేసే సుంద‌ర్‌గా ప్ర‌వేశిస్తాడు. ప్ర‌తి మ‌నిషిలో విరుద్ధ‌మైన భావ‌న‌లు, స్పిట్ ప‌ర్స‌నాలిటీ వుంటాయి.

సొసైటీలో లోన్ వ‌స్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని సుంద‌ర్ ఆశ‌. బ‌తికి వుండ‌గా రాలేదు. ఆ డ‌బ్బులు వ‌స్తే బ‌తికేవాడేమో! జేమ్స్‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత కూడా ఆశ చంపుకోలేక అప్లికేష‌న్ ఇస్తాడు. ఫోర్జ‌రీ అని గెంటేస్తారు. క్రితం రోజు తాను ఆ వూరి వాడిన‌ని అంద‌రితో గొడ‌వ ప‌డిన అత‌ను , సొసైటీ అధికారి గెంటేస్తుంటే మౌనంగా వెళ్లిపోతాడు. ఎందుకంటే పాలు త‌న‌తో ఎవ‌రూ పోయించుకోవ‌డం లేద‌ని అర్థ‌మ‌య్యే స‌రికి, త‌న‌మీద త‌న‌కే అనుమానం స్టార్ట్ అయ్యింది.

ప‌ల్లెటూళ్లు ఎంత మారిపోయినా, మంచిత‌నం మార‌లేదు. ఆ వూరి పెద్ద ఏమంటాడంటే క‌ష్టం అంద‌రికీ వ‌స్తుంది. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే క‌దా, మ‌నం మ‌నుషుల్లా ప్ర‌వ‌ర్తించాలి అంటాడు. ఎవ‌రో తెలియ‌ని అంత‌మంది అప‌రిచితుల్ని ఆ వూరు ఒక రాత్రి ఆద‌రిస్తుంది, అన్నం పెడుతుంది.

ఒక వ్య‌క్తి వ‌చ్చి అంద‌ర్నీ నిద్ర‌లేపుతూ వుండ‌గా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అంద‌రూ నిద్ర‌లేచి ప్ర‌యాణం అవుతూ వుండ‌గా సినిమా ముగుస్తుంది.

చ‌నిపోయిన వారి ఆత్మ‌లు కాకి రూపంలో వ‌చ్చి పిండం తిని వెళ్తాయ‌ని న‌మ్మ‌కం. సుంద‌ర్ భోజ‌నం చేసిన త‌ర్వాత కాకి ఎగిరి వెళ్ల‌డం సింబాలిక్ షాట్ కావ‌చ్చు.

ఈ మొత్తం నాట‌కంలో డ్రైవ‌ర్ పాత్ర చాలా ప్ర‌త్యేక‌మైంది. టెన్ష‌న్ లేకుండా ఒక క్వార్ట‌ర్ మందు తాగి ఈ ప్ర‌పంచ‌మే ఒక నాట‌క రంగం అంటాడు. అదే నిజం.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?