Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఆంధ్రాపై మోడీకీ ఓ 'విజన్'!

ఆంధ్రాపై మోడీకీ ఓ 'విజన్'!

'విజన్' అనే పదం వినపడగానే, చంద్రబాబు నాయుడి పేరు గుర్తుకు వస్తుంది. ఆయన పేరుతో ఆ పదం అంతగా మమేకమై పోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలవడంతో ఆ పదం బాగా మసకబారి పోయింది. ఇప్పుడు ఎన్నికల సీజన్‌లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడంతో, మళ్ళీ 'విజన్' అనే పదం బాగా వాడుకలోకి వస్తున్నది. అయితే, చంద్రబాబు నాయుడికి మాత్రమే కాదు, ప్రధాని మోడీకి కూడా ఆంధ్రప్రదేశ్ పై ఒక 'విజన్' ఉంది.

దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ, నరేంద్ర మోడీకి రెండు రాష్ట్రాల పైనే 'విజన్' ఉంది. ఒకటి- గుజరాత్, రెండు- ఆంధ్రప్రదేశ్. అందుకే- ప్రధాని హోదాలో గుజరాత్ వెళ్ళినన్ని సార్లు ఏ రాష్ట్రం వెళ్లి ఉండరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చినన్ని సార్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇచ్చి ఉండరు. అందుకే, గుజరాత్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల ప్రధాని మోడీకి అంత అభిమానం.

గుజరాత్‌లో మోజేపీ (మోడీ నేతృత్వంలోని బీజేపీ)నేతృత్వంలోనే ప్రభుత్వ నిర్వహణ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లేదు. అదొక్కటే తేడా. దేశంలో ఎక్కడైనా ముస్లిం వాయిస్ గట్టిగా ఉంటేనే బీజేపీకి ఉనికి ఉంటుంది . తెలంగాణలో "ఇది" గట్టిగానే ఉంది. అందుకే అక్కడ బీజేపీ ఉంది. గుజరాత్ లో రెండువేల మంది ముస్లింలను సొరకాయలు కోసినట్టు ఊచకోత కోశారు. అందువల్ల అక్కడ బీజేపీ ఉంది. బలంగా ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లింల నుంచి హిందువులకు భయం ఉంది. అందుకని అక్కడ బీజేపీ ఉంది. అస్సాం లో, బెంగాల్ లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో .... వగైరా రాష్ట్రాల్లో ముస్లిం ప్రభావం బలంగా ఉండడం వల్ల బీజేపీ ప్రభావం కూడా గట్టిగా ఉంటుంది.

తెలంగాణలో ఎంఐఎం ఉంది. అందుకని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. ఆంధ్ర సమాజంలో ముస్లిం ప్రభావం హిందువులు భయపడాల్సినంతగా లేదు. హిందువులు - ముస్లింలు భాయి - భాయి అనుకుంటూ పాలు - తేనెలా కలిసిపోయి జీవిస్తుంటారు. అందుకని ఆంధ్రలో బీజేపీకి ఆదరణ లేదు. ఉండదు కూడా. అటువంటి ఆంధ్రలో బీజేపీ అధ్యక్ష పదవికి కామరాజు అయితే ఏమిటి.. సోమరాజు అయితే ఏమిటి అన్నట్టుగా ఆ పార్టీ కేంద్ర నాయకులు వ్యవహరిస్తుంటారు.

అందుకే సోము వీర్రాజును తీసేసి పురందేశ్వరిని బెట్టారు. ఆవిడనూ రేపో.. మాపో తీసేసి మరొకరిని పెట్టినా ఆశ్చర్యం ఏమీ లేదు. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీకి ఆవిడ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అందువల్ల, ఆవిడను తీసేసి, వైసీపీకి నొప్పి కలగకుండా సన్నాయి నొక్కుల లాటి విమర్శలతో కాలక్షేపం చేసే వారిని బీజేపీ అధ్యక్షులుగా నియమించినా ఆశ్చర్యం ఏమీ లేదు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏకైక లక్ష్యం మూడోసారి ప్రధాన మంత్రి కావడం అనడంలో ఎవరికీ సందేహం లేదు. ఆ దిశగానే ఆయన ఆలోచనలు, చర్యలు, పర్యటనలు, ప్రసంగాలు ఉంటున్నాయి. రెండు సార్లు ప్రధాన మంత్రి కావడంలో పెద్ద "కిక్ " ఏమీ లేదు. రాజకీయాలలో తాడు, బొంగరం కూడా లేదని రాజకీయ వర్గాల వారిలో అధికులు భావించే మన్మోహన్ సింగ్ కూడా రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యారు. అందువల్ల, మూడోసారి ప్రధాని కావడమే నరేంద్ర మోడీ ఏకైక లక్ష్యం.

దానికోసం ఏ రాష్ట్రంలో అయినా ఎన్ని సార్లయినా పర్యటించడానికి ఆయన సిద్ధం. ఏ వేదిక మీద ఎవరిని ఆలింగనం చేసుకోడానికైనా ఆయన సిద్ధం. ఆంధ్రలో మాత్రం టీడీపీని ఆలింగనం చేసుకోడానికి మాత్రం సిద్ధం గా లేరు. కనీసం ఒక వేదిక ను పంచుకోడానికి కూడా ప్రధాని మోడీ సుముఖంగా లేరు. ఏపీ పై మోడీ 'విజన్' కు, చంద్రబాబు 'విజన్' భిన్నం గా ఉండడం తో మోడీకి కుదరడం లేదు. 

మోడీ, తన విజన్ ను నేరుగా అమలు చేయలేరు కదా! దానిని జగన్మోహన్ రెడ్డి సారధ్య ప్రభుత్వం అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సారధులు దానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మోడీ "ఎజెండా"," విజన్" ఇంకా అసంపూర్ణంగా ఉండి ఉంటే, మరో అయిదేళ్లపాటు జగన్ సారధ్య ప్రభుత్వం ద్వారా - మోడీ తన ఎజెండాను అమలు చేయించాలని అభిలషిస్తూ ఉండి ఉండవచ్చు కూడా.

అయితే బీజేపీకి 'మిత్ర' పక్షం గా వ్యవహరిస్తున్న  పవన్ కళ్యాణ్ (అంటే జన సేన) మాత్రం టీడీపీ వైపు వెళ్లకుండా మోడీ ఆపలేకపోయారు. పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్లకుండా ఉంటే, ఆయనకు ఇంకా బాగుండేది. టీడీపీ పొడ గిట్టని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్లకుండా ఎందుకు నిలువరించలేక పోయారనే విషయం మాత్రం అర్ధం కాదు. ఒక వేళ, పవన్ కళ్యాణ్ ద్వారా జగన్ పార్టీ కి చెక్ పెట్టాలని భావించి, ఆ కంటితో జగన్‌ను, ఈ కంటితో పవన్‌ను ప్రోత్సహిస్తున్నారేమో తెలియదు.

"ఆంధ్ర లో మోడీ అభిమతాన్ని కాదని బయట తిరిగినా.. మాకేమీ ఇబ్బంది లేదు.." అంటూ తెలంగాణ మోజీపీ.. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంది.

తెలంగాణలో ఉన్నదో.. లేదో తెలియని పవన్ రాజకీయ బలాన్ని నమ్ముకుని 8 సీట్లు వదిలిపెట్టిన బీజేపీ.. మరి, తెలంగాణలో గణనీయమైన బలం కలిగివున్నప్పటికీ, టీడీపీని మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు. తెలంగాణలో స్నేహ హస్తం అందిస్తే, రేపు ఆంధ్రలో కూడా టీడీపీతో జత కట్టాల్సి వస్తుందేమో నన్న అనుమానంలో బీజేపీ పడిపోయి ఉంటుంది.

టీడీపీతో బహిరంగంగా జత కడితే జగన్ సారధ్య ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి కన్ను గీటడం కుదరదు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చి టీడీపీని అభినందించడం, జగన్ ను విమర్శించడం కుదరదు. మోజేపీ అనేది ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్షమూ కాదు, ప్రధాన రాజకీయ పార్టీ కూడా కాదు. టీడీపీ  పొలిటికల్ ఫ్రెండ్ కు.. జస్ట్ ఓ పొలిటికల్ ఫ్రెండు.

అందుకే, ఆంధ్రలో వైసీపీని కాదని టీడీపీ వైపు మోజీపీ చూడడం లేదు. తెలంగాణలో రావడానికి అవకాశం ఉన్న రాజకీయ ప్రయోజనాన్ని కూడా అది వదిలేసుకుంది. తెలంగాణలో టీడీపీని మోజీపీ వదిలేసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు.. ఏమిటి అనే విషయం రేపు డిసెంబర్ 3న తెలుస్తుంది. ఆ తరువాత ఆంధ్రలో మోడీ -షా వ్యూహం మారితే మార వచ్చు.

మరి, ఆంధ్రలో టీడీపీ పొడ కూడా గిట్టని మోజీపీ, చంద్రబాబు కుటుంబానికే చెందిన పురందేశ్వరికి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఎందుకు అప్పగించిందో తెలియదు.

జగన్ ప్రభుత్వాన్ని ఆమె డైలీ బేసిస్లో తూర్పార బడుతున్నారు. జగన్ ప్రభుత్వం నిర్వాకాలపై సీబీఐ, ఈడీ విచారణలకు ఆమె పట్టుబడుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు.  టీడీపీ నేతల విమర్శలకు మించి మరీ ఆమె వైసీపీని విమర్శిస్తున్నారు. విమర్శలే కాదు. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కూడా.

జగన్ రాజకీయానికి "ఇరుసు " లాటి విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కూడా ఆమె అదే పనిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకులు ఆమెతో గొంతు కలపడం లేదు కానీ, పురందేశ్వరి ప్రకటనలను, భావాలను, దూకుడును ఖండించడం కూడా లేదు.

అంటే.. ఆమె మాటలను వారు వింటూ.. చూస్తూ ఊరుకుంటున్నారు. దీనితో, కేంద్ర బీజేపీ నేతల మనసులలో ఏమి ఉందో అనే సందేహాలు కలగడం సహజం. కేంద్ర బీజేపీ నాయకులకేమో టీడీపీ అంటే పడదు అనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారిపోయింది. అదే పార్టీ రాష్ట్ర నాయకత్వానికేమో వైసీపీ అంటే పడదు. అలాగే, ఎన్డీఏ లో సభ్యుడిని అని చెప్పే పవన్ కళ్యాణ్ కేమో వైసీపీ అంటే పడదు. ఆయనను రాజకీయంగా  కౌగిలించుకుంటూ తిరిగే మోజీపీ కేమో టీడీపీ వాసన పడదు.

పోనీ పవన్ కళ్యాణ్, ఆంధ్ర మోజీపీ  మాత్రమే కలిసి ఎన్నికలకు వెళితే ఏమవుతుందో పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టంగా చెప్పారు. ఆ విషయం తెలిసినప్పటికీ తమకు నష్టం ఏముంది కొత్తగా అనేది బీజేపీ పాయింట్.  కానీ, తాము స్నేహ హస్తం అందిస్తే, టీడీపీ - జనసేన కూటమి ఎక్కడ బలపడి పోతుందో అన్న బెదురులో ఢిల్లీ పెద్దలు ఉన్నారేమో తెలియదు.

లేకపోతే, సొంతంగా పోటీ చేస్తే.. ఒక్క స్థానంలోనూ డిపాజిట్ రాక, అటు వైసీపీతోనూ బహిరంగంగా కలవలేక, ఇటు టీడీపీకీ మద్దతు ప్రకటించలేక.. ఆంధ్ర రాజకీయాల్లో నరేంద్రమోడీ సారధ్య బీజేపీ ఎటువంటి పాత్ర పోషిస్తున్నట్టు? ఒక రాజకీయ పార్టీ అన్న తరువాత, అధికార పార్టీ వైపు అయినా నిలబడాలి. లేదా ప్రతిపక్షం వైపు అయినా నిలబడాలి. ఈ రెండింటి లో బీజేపీ ఏదీ ఓపెన్ గా చేయడం లేదు.

వైసీపీతో బహిరంగంగా పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళితే, బీజేపీకి ఇంతకంటే వచ్చే నష్టం ఏమిటి? వస్తే... గిస్తే... లాభమే గానీ, నష్టం అనే ప్రశ్నే లేదు. వైసీపీకి కేంద్రం నుంచి నైతిక మద్దతు లభించినట్టు ఉంటుంది. బీజేపీ నాయకులకు వైసీపీ నుంచి సమస్త వనరులూ సమకూరడానికి ఇబ్బంది ఉండదు కూడా. బోడి గుండుకు కొత్తగా ఊడిపోయేది ఏముంటుంది? వస్తే నాలుగెంట్రుకలు  మొలవాలి గానీ.

మరి, వైసీపీ ప్రభుత్వం పై ఒంటి కాలితో లేస్తున్న అంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ని ఆ పదవి నుంచి  ఇందుకోసం తప్పిస్తారా? ఈశాన్య రాష్ట్రాల్లో దేనికో దానికి గవర్నర్ గా పంపేసి, వైసీపీకి తలనొప్పి లేకుండా చేస్తారా? లేకపోతే పాండిచ్చేరికి కూడా గవర్నర్ లేకుండానే నడుస్తుంది. ఆవిడ " అక్కడ " ఉన్నంత కాలం వైసీపీతో అధికారికంగా సయోధ్య  కుదరదు అనేదే పరిశీలకుల భావన.

మరి పవన్ కళ్యాణ్ ను ఏం చేస్తారు? వదిలేస్తారా?

తెలంగాణలో ఆయనకు ఇచ్చిన 8 సీట్లలో ఆయన బలమెంతో చూశాకే, ఆంధ్రలో ఆయనతో ఎలా డీల్ చెయ్యాలనే విషయంలో  బీజేపీ కేంద్ర పెద్దలు ఒక అంచనాకు వస్తారేమో. మొత్తం మీద ఆంధ్రలో రాజకీయానికి ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. ఒక పధ్ధతి అంటూ కూడా ఏమీ ఉన్నట్టు లేదు.

మ్యూజికల్ చైర్స్.. కేంద్ర బీజేపీకి టీడీపీ పొడ గిట్టదు. బీజేపీ రాష్ట్ర శాఖకు వైసీపీ పొడ గిట్టదు. వైసీపీకి పవన్ కళ్యాణ్ పొడ గిట్టదు.

జనసేనను వీపుపై గట్టిగా కట్టుకుని టీడీపీ.. కేంద్రం చూపించే అభిమానంతో వైసీపీ - 'అధికారం' అనే మ్యూజికల్ చైర్ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ "పిలక తిరుగుడు " రాజకీయాలకు చెక్ పెట్టవలసింది ఓటర్లే.

భోగాది వేంకట్రాయుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?