మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు రావెల కిశోర్‌బాబు వైసీపీలో చేరనున్నారా? అంటే ఔననే సమాధానం అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు కేబినెట్‌లో రావెల కిశోర్‌బాబు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కిశోర్‌ను తప్పించారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన, బీజేపీలలో చేరి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉనికిలో లేని బీఆర్ఎస్‌లో రావెల కిశోర్ చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా ఆయన స్తబ్ధంగా ఉన్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఇంటికే పరిమితమైన నేతలు టికెట్ ఇచ్చే పార్టీల కోసం వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. గతంలో ఇక్కడి నుంచి రావెల టీడీపీ తరపున గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఈ దఫా మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఆయన వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రత్తిపాడు నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ దఫా అక్కడి నుంచి ఆమె పోటీ చేయరనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
దీంతో ఒక రాయి వేస్తే పోయేదేమీ లేదని రావెల కిశోర్ వైసీపీలో చేరి టికెట్ దక్కించుకోడానికి యత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణ అధికార పార్టీ నాయకుల నుంచి సిఫార్సు చేయించుకుని ప్రత్తిపాడు టికెట్ దక్కించుకుంటారా? అనే చర్చ కూడా లేకపోలేదు.