పవన్ కళ్యాణ్ జాతకం సాధారణమైనది కాదు… అది మహర్జాతకం. ఎక్కడో కోట్లల్లో ఒకడికి కూడా ఆ జాతకముండదు. అంతెందుకు..పవన్ జాతకం ముందు ఆయన సోదరుడు చిరంజీవి జాతకం కూడా దిగదుడుపే.
నిజమే మరి. చిరంజీవి ఏకపత్నీవ్రతుడు మాత్రమే. ఒక పార్టీ పెట్టి భంగపడి మూసేసాడు కూడా. నలుగురూ అనే మాటలు పడుతూ రాజకీయ బురదలో ఉండడం కంటే సినిమాలే నయమనుకుని వెనక్కొచ్చేసాడు.
మరి పవన్ కళ్యాణ్ అలా కాదు కదా! నచ్చకపోతే చొక్కా మార్చినట్టు భార్యల్ని మార్చేయలగడు. తన మూడు పెళ్లిళ్లు చూసి చాలామంది మగాళ్లకి అసూయ అని అనగలిగాడంటే నిజమే మరి. ఛీ కొడుతుంటే అది అసూయపడుతున్నట్టు కనిపిస్తోందంటే మహర్జాతక బలమే కదా!.
పెట్టిన పార్టీతో తాను అసెంబ్లీకి బోణీ కొట్టకపోయినా వెనక వెర్రి ఈలలు వేసే అభిమానులను పొందడం కూడా మహర్జాతకమే. నిత్యానంద వీడియోల్లో ఒక విషయం గమనించొచ్చు. అతను వాగుతున్న దాంట్లో ఆవగింజంత విషయం లేకపోయినా వెనకాల అభిమానులు డప్పులు కొడుతూ జేజేలు పలుకుతుంటారు. ఈ పవన్ అభిమానులూ అంతే. తమ నాయకుడికి డొక్కలో అరముక్క జ్ఞానం కూడా లేకపోయినా వాళ్లంతా ఒకానొక పిచ్చలో బతుకుతూ అతనికి బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి అమాయక అభిమానుల్ని పొందడం కూడా మాహర్జాతకమే.
అసలిదంతా కాదు. తాను ఏం చదివాడో తనకే తెలీదు. ఇంటర్లో తన గ్రూప్ సీ.ఈ.సీ అని ఒకసారి, ఎంపీసీ అని ఒక మరోసారి, ఎం.ఈ.సీ వేరేసారి చెప్పాడు. ఇతని కన్నా బీకాం లో ఫిసిక్సుంటుందని చెప్పిన జలీల్ ఖాన్ చాలా నయం. ఒక్కసారికే తన అజ్ఞానాన్ని బయటపెట్టి ఊరుకున్నాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మాదిరిగా ముచ్చటగా మూడు సార్లు తన ఇంటర్ గ్రూపుల్ని వేరు వేరుగా చెప్పి కమెడియన్ అనిపించుకున్నాడు.
ఇక్కడ మరొక కామెడీ కూడా ఉంది. తన తండ్రి కానిస్టేబుల్ అని పలు సార్లు చెప్పుకున్నాడు. చాలామంది పోలీస్ కానిస్టేబులేమో అనుకుంటారు. కానీ కాదు. ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పని చేసారు. పవన్ ఏ ఊళ్లో పర్యటించి మైకందుకున్నా తన తండ్రి ఆ ఊళ్ళో పని చేసారని చెబుతాడు. కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ని రాష్ట్రమంతా తిప్పరు. ఉన్న జిల్లాలోనే పనుంటుందంతే. వేరే జిల్లాలకు బదిలీలుండవు. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతుంటే ఏమనాలి? అందుకే పేర్ని నాని ఈ టాపిక్ ఎత్తి వాతలు పెట్టాడు.
ఇక సినిమాల విషయానికొస్తే కథ వినడం కూడా రాని మహర్జాతకుడు మనవాడు. వెనకాల త్రివిక్రం ఉండి అన్నీ చూసుకోవాలి. రాజకీయాల్లో తనకి, ఫండర్స్ కి మధ్య నాదెండ్ల ఉండాలి. నిజంగా పవన్ అజ్ఞానాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుని జీవితంలో సెటిలవుతున్నవాళ్లు ఈ ఇద్దరేనేమో. మిగిలిన ఫ్యాన్సంతా గొర్రెలే. ఇతనేదో రాజకీయంగా ఉపయోగపదతాడని ఫండింగిచ్చేవాళ్లు అందరీకంటే పెద్ద గొర్రెలు.
తాజాగా విశాఖలో హైడ్రామా వెనకాల కూడా హాస్యానికి అవధుల్లేవు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అభాసుపాలు చేయడానికి ఎవరో పంపితే విశాఖలో దిగిపోయి జనవాణి అన్నాడు పవన్ కళ్యాణ్. తానొస్తే తన ఫ్యాన్స్ కి, వైకాపా జనానికి మధ్య గొడవలు జరుగుతాయని తెలిసి, జరగాలని కోరుకుని చేసిన పని అది. సింపుల్ గా చెప్పాలంటే యాగాన్ని చెడగొట్టడానికి వచ్చిన మారీచ-సుబాహుల్లాగ దిగిపోయారు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్. వైకాపా మంత్రుల మీద రాళ్లు కూడా వేయించారు. అదేంటని అడిగితే భారతరాజ్యంగం ప్రకారం రాళ్ళేయడం భౌతికదాడి కిందకు రాదని సెలవిచ్చాడు ఈ అత్తాపూర్ బాబా. మరి తన మీద విసిరినా దాడి కాదనే అంటాడేమో. తన సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తేనే ప్రాణం పోయినట్టు గిలగిల తన్నేసుకున్న ఈ మహర్జాతకుడు తన వాళ్లు వేరే వాళ్ల మీద రాళ్ళేస్తే అది దాడి కాదంటాడు!!
ఇక నొవొటెల్ హోటల్ పై-అంతస్తు రూములోంచి చేసిన కామెడీ అయితే నభూతో నభవిష్యతి. అద్దాల గదిలోంచి చెయ్యి ఊపుతూ, కెమెరాకి సజెషన్లో కనిపించడానికి దండం పోసు పెట్టి సినిమా ఎఫెక్టులో ఫోటోలు, వీడియోలు దిగాడు. అసలా గదిలోంచి కిందకి ఎవ్వడికీ కనపడని ఈ మహర్జాతకుడు కేవలం తన ట్విటర్లో పెట్టుకోవడానికి నాలుగు క్లిక్కులు క్లిక్కించుకున్నాడు. అయితే అక్కడే చిన్న పొరపాటు చేసాడు. కాస్త కంగారు ఆపుకుని ముందు ఆ వీడియోనో, ఫోటోనో త్రివిక్రముడికి పంపుండాల్సింది. ఆయన దానికి కాస్త గ్రాఫిక్స్ కలిపి విశాఖ సముద్రమంతా జనమే ఉన్నట్టు మార్ఫింగ్ చేసి పంపేవాడు. అప్పుడు ఈ వార్త దేశమంతా మారుమోగేది. మోదీ కూడా తన కుర్చీని గట్టిగా పట్టుకుని వణికిపోయేవాడు. పాపం వదిలిన వీడియోల్లో కింద చూస్తే పట్టుమని 100మంది కూడా ఉన్నట్టు కనిపించలేదు.
పవన్ నిజంగా దమ్మున్నవాడైతే, నిఖార్సన నాయకుడైతే తన అనుచరుల్ని పోలీసులనుంచి విడిపించుకోవడానికి ధర్నా చెయ్యాలి. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాలి. కానీ ఆ గోలేదీ పెట్టుకోకుండా విలాసంగా హోటల్లో కూర్చున్నాడు. నోవోటెల్ వాళ్లు కూడా ఈ మహర్జాతకుడి వల్ల తమ జాతకం దరిద్రంగా మారుతోందని, వ్యాపారం దెబ్బతింటోందని తెలిసి ఎప్పుడు పోతాడా అని వేచి చూస్తూనే ఉన్నారు.
పోనీ అంతా ముగిసాక ఇతగాడు తిన్నగా హైద్రాబాదుకి వెళ్లాడా? లేదు..విజయవాడలో తెదేపాకి ఇచ్చిన 3 రోజుల కాల్షీట్స్ ఖర్చు చేయడానికి అక్కడ దిగాడు. ఒకవేళ ఆ పార్టీవాళ్లు మరో మూడు రోజులకి డబ్బులిస్తే అక్కడే ఉంటాడు హైద్రాబాదులో షూటింగ్ పనులు పక్కనపెట్టి. దానివల్ల నష్టం తనకేముంటుంది? నిర్మాతకేగా? వాడి చావేదో వాడు చస్తాడు. మహర్జాతకుడితో సినిమా తీయడమంటే ఆ మాత్రం నేల నాకొద్దూ!!
నిజమెంతో తెలియదు కానీ ఆ నోటా ఈ నోటా వినపడిందేంటంటే ఒక నిర్మాత ఇతనికి, చంద్రబాబుకి మధ్యలో సంధానకర్తగా ఉండేవాడట. దత్తపుత్రుడు, తన తండ్రి నేరుగా కొన్ని విషయాలు మాట్లాడుకోరట. మధ్యవర్తులు విషయాల్ని చేరుస్తారట. ఎవరికి కావాల్సినవి వాళ్లకి ఆయా సమయాలకి అందుతాయట. ఇప్పుడూ అంతే. వ్యక్తులు మారతారు కానీ తంతు ఇదే. ఏమిటో అంతా మహర్జాతకబలం.
ఇక ఈ ప్రబుద్ధుడు అడిగిన మరొక తెలివైన ప్రశ్న- ప్రభుత్వం గర్జన చేయడమేంటని. ఏం? ఇదే ప్రశ్న చంద్రబాబుని అడక్కపోయాడా? నల్ల చొక్కాలేసుకుని ఢిల్లీలో ధర్నా చెయ్యలేదూ!
ఇదంతా ఒకెత్తైతే అసలు విషయమొకటుంది. పాపం ఈ మహర్జాతకుడి దృష్టికి వచ్చిందో లేదో మరి. తన ఫ్యాన్స్ చేసిన రాళ్ల రువ్వుడో, వైకాపా వాళ్లు చేసిన ప్రతిదాడో మొత్తానికి జనసేనకి కాస్త మైలేజీ వస్తోందనగానే పచ్చ మీడియా కవరేజ్ ఆపేసింది. వాళ్ల పత్రికల్లో కూడా పవన్ వార్తని జామకాయంత రాసి, చంద్రబాబు మద్దతుని మాత్రం తాటికాయంత రాసారు. అంటే ఇక్కడ ఒకటే సారాంశం. పచ్చ మీడియా లెక్కల్లో చంద్రబాబు వెనుక బంట్రోతులా పవన్ ఉండాలి కానీ, పవన్ ముందుకొచ్చి తన ఇండిపెండెంట్ పవర్ ని ప్రకటించుకోకూడదు.
ఇది తెలిసినా పవన్లోనూ, అతని వెనుకున్న పిచ్చజనంలోనూ అణువంత మార్పు కూడా రాదు. ఏంటంటే..అంతా మహర్జాతక మహత్యం!
హరగోపాల్ సూరపనేని