కథలొద్దు…మీటింగ్ కు ఓకె

అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నాడట వెనకటికి యమ ధర్మరాజు సతీసావిత్రితో. అలాగ్గా వుంది టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ వ్యవహారం. Advertisement అనగనగా ఓ డైరక్టర్. మంచి కమర్షియల్ డైరక్టర్ గా…

అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నాడట వెనకటికి యమ ధర్మరాజు సతీసావిత్రితో. అలాగ్గా వుంది టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ వ్యవహారం.

అనగనగా ఓ డైరక్టర్. మంచి కమర్షియల్ డైరక్టర్ గా కాస్త పేరుంది. రీమేకులు మేకుల్లా కాకుండా సూదుల్లా సక్సెస్ ఫుల్ గా తీయగలడని గుర్తింపు వుంది. కానీ ఏం ప్రయోజ‌నం చిరకాలంగా చేతిలోకి సినిమా రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏదో కిందా మీదా పడుతూ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

అదే ప్రయత్నాల్లో భాగంగా ఓ యంగ్ హీరో డేట్ లు ఖాళీగా వున్నాయని, తనతో సినిమా తీస్తారని నమ్మకం వున్న నిర్మాత దగ్గర సదరు హీరో డేట్ లు కూడా వున్నాయని అటో రాయి వేయాలనుకున్నాడని బోగట్టా. ఆలోచన వచ్చిందే తడవుగా హాయ్ మెసేజ్ తో పాటు సూటిగా, సుత్తి లేకుండా ఓ స్టోరీ నెరేట్ చేద్దాం అనే ఆలోచన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసాడట.

అంతవరకు బాగానే వుంది. కానీ అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఇంకా బాగుంది. కలవడానికి రావచ్చు..మాట్లాడుకోవడానికి రావచ్చు. కానీ కథ గురించి అయితే ప్రస్తుతానికి వద్దు…అని సమాధానం వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంత నిర్మొహమాటంగా సమాధానం వచ్చేసరికి కంగుతినడం డైరక్టర్ వంతయిందట. ఏమిటో పాపం..టైమ్ బాగా లేకపోతే ఇలాగే వుంటుందేమో?