Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాజీవ్‌గాంధీ ఒక జ్ఞాప‌కం

రాజీవ్‌గాంధీ ఒక జ్ఞాప‌కం

1974లో రాయ‌దుర్గం ఉప ఎన్నిక వ‌చ్చింది.అప్ప‌టి ఎమ్మెల్యే తిప్పేస్వామి గుండెపోటుతో చ‌నిపోయారు. ప‌య్యావుల వెంక‌ట‌నారాయ‌ణ (కేశ‌వ్ తండ్రి) కాంగ్రెస్ అభ్య‌ర్థిగా, రంగ‌ప్ప ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆవు దూడ‌లు సుల‌భం కాబ‌ట్టి కాంగ్రెస్ వాళ్లు వంద‌ల్లో తెచ్చి ప్ర‌ద‌ర్శ‌న చేశారు. రంగ‌ప్ప గుర్తు ఏనుగు. అయినా ప‌ట్టుద‌ల‌తో రెండు ఏనుగులు మైసూర్ నుంచి తెప్పించాడు. మాలాంటి చిన్న పిల్ల‌ల‌కు ఒక‌టే స‌ర‌దా. అప్ప‌టి యువ‌కులంతా యూత్ కాంగ్రెస్‌లో చేరి ప్ర‌చారం చేసేవాళ్లు. వాళ్ల‌కి రోజూ 10 రూపాయ‌లు, ల‌క్ష్మీవిలాస్ హోట‌ల్ టిఫెన్‌, భోజ‌నం కూప‌న్లు ఇచ్చేవాళ్లు. ఇందిరాగాంధీకి ఇద్ద‌రు కొడుకులున్నార‌ని, ఒక‌రు సంజ‌య్‌, ఇంకొక‌రు రాజీవ్ అని సాధార‌ణ జ‌నానికి తెలిసింది అప్పుడే.

1980లో ఇంట‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఉద‌యాన్నే రేడియో వార్త‌లు విని షాక్‌. సంజ‌య్ విమాన ప్ర‌మాదంలో పోయాడు. మ‌నం సైకిల్‌లో వెళ్లినంత ఈజీగా, ఆయ‌న విమానం న‌డుపుతూ వెళ్తాడ‌ని తెలిసింది. న‌ల్ల‌టి గ్లాసెస్‌తో ఇందిరాగాంధీ కొడుకు శ‌వం ద‌గ్గ‌ర నిబ్బ‌రంగా నిల‌బ‌డ‌డం, అన్ని ప‌త్రిక‌ల్లో ఫ‌స్ట్ పేజీ ఫొటో. మొద‌టిసారి రాజీవ్‌గాంధీ ఫొటో మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించింది. అమేథిలో 2 ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీతో గెల‌వ‌డం నాలాంటి కుర్రాళ్ల‌కి సంతోషం క‌లిగించింది.

1984లో అనంత‌పురం త్రివేణి టాకీస్‌లో మార్నింగ్ షో చూసి మధ్యాహ్నం ఇంటికి వ‌స్తూ వుంటే టౌన్ అంతా గంద‌ర‌గోళంగా వుంది. ఇందిరాగాంధీని హ‌త్య చేశారు. మామూలు జ‌నానికి టీవీలు అందుబాటులో లేని కాలం. మెయిన్ సెంట‌ర్ల‌లో టీవీలు పెట్టి అంత్య‌క్రియ‌లు చూపించారు. వేలాది జ‌నం క‌ళ్లు తుడుచుకున్నారు. నిబ్బ‌రంగా నిల‌బ‌డి వున్న రాజీవ్‌గాంధీని చూసి ఈ  దేశాన్ని ముందు ముందు ఆయ‌నే పాలిస్తాడ‌ని అంద‌రికీ అర్థ‌మైంది. యువ ప్ర‌ధాని అంత‌కు ముందు లేడు, ఇప్ప‌టికీ లేడు.

ప్ర‌ధానిగా రాజీవ్ మొద‌టి వైఫ‌ల్యం, సిక్కుల ఊచ‌కోత‌ని ఆప‌లేక పోవ‌డం. ఫ‌లితంగా దాదాపు 17 వేల మంది చ‌నిపోయారు. త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో 411 సీట్లు గెల‌వ‌డం ఓ రికార్డు. ఎస్కే యూనివ‌ర్సిటీ ఆడిటోరియంలో ఏదో ప్రోగ్రామ్ జ‌రుగుతున్న‌ప్పుడు రాజీవ్ నాయ‌క‌త్వంలో ఈ అపూర్వ విజ‌యం ద‌క్కింద‌ని వేదిక మీద ప్ర‌క‌టిస్తే అంద‌రూ లేచి చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం ఓ జ్ఞాప‌కం.

ప్ర‌ధానిగా ఆయ‌న చాలా చేశారు. ట్రంకాల్‌గా గ‌ట్టిగా కేక‌లు పెట్టి అరిచే కాలం నుంచి ఎస్టీడీలో హాయిగా మాట్లాడే స్థాయికి దేశాన్ని తెచ్చింది ఆయ‌నే. పార్టీ ఫిరాయింపు బిల్లు కూడా ఆయ‌న చ‌లువే. కంప్యూట‌ర్ టెక్నాల‌జీని అనుభ‌విస్తున్నామంటే రాజీవ్ వేసిన పునాదే. భోఫోర్స్ స్కాండ‌ల్ ఒక మ‌చ్చ‌. శ్రీ‌లంక సివిల్ వార్‌లో ఇరుక్కుపోవ‌డం ఆయ‌న దుర‌దృష్టం. ఆహారం, మందులు పంపిన‌ప్పుడు అభినందించిన వాళ్లే, పీస్ కీపింగ్ ఫోర్స్‌తో శ‌త్రువుల‌య్యారు. లెక్క‌లోకి రాని కొన్ని వేల మంది మ‌న సైనికుల త్యాగం ఎందుకూ ప‌నికి రాకుండా పోయింది.

1991, మే 21 రాత్రి 9 గంట‌లు

ఆ రోజు తిరుప‌తి గంగ జాత‌ర‌. స్థానికుల‌కి చాలా పెద్ద పండుగ‌. ఎప్ప‌టిలాగే స్నేహితుల‌తో క‌లిసి జాత‌ర‌కి వెళ్లాను. డ‌ప్పుల మోత‌, వేషాల సంద‌డితో కోలాహ‌లంగా వుంది. ఉత్సాహంతో తిరుగుతూ వుంటే రాత్రి 11 గంట‌ల‌కి ఎవ‌రికి వాళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. దుకాణాలు మూత ప‌డుతున్నాయి. ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఒక జ‌ర్న‌లిస్టు మిత్రుడొచ్చి రాజీవ్ హ‌త్య జ‌రిగింద‌ని చెప్పాడు. న‌మ్మ‌శ‌క్యం కాలేదు. జాత‌ర‌లో జ‌న‌మంతా భ‌యంతో ప‌రుగులు తీస్తున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగా ఏడుస్తున్నారు. ఇల్లు చేరాలంటే చాలా దూరం.

రోడ్ల మీద టైర్లు కాలుస్తున్నారు. వాహ‌నాలు తిర‌గ‌నియ్య‌డం లేదు. భ‌యంభ‌యంగా అష్ట‌క‌ష్టాలు ప‌డి ఇల్లు చేరాను.

మ‌రుస‌టి రోజు ఆంధ్ర‌జ్యోతి ఆఫీస్‌కు వెళ్ల‌డానికి ఎన్నో ఇబ్బందులు. ఐదారు కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లాల్సిన స్థితి. నాలుగు రోజులు ఊరంతా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం.

కాలం చాలా దూరం ప్ర‌వ‌హించింది. రాజీవ్ ఉన్న‌ది కొంత కాల‌మే అయినా, ఆయ‌న ముద్ర మ‌నకి క‌నిపిస్తూనే వుంది. ఫోన్‌లోనే ప్ర‌పంచాన్ని చూసేస్తున్న నేటి త‌రానికి ఈ దేశం మారుమూల ప‌ల్లెల‌కి ఫోన్లు తెచ్చింది రాజీవ్‌గాంధీ అని తెలియ‌క‌పోవ‌చ్చు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?