Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ జిల్లా వైసీపీలో ముస‌లం...అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర‌!

ఆ జిల్లా వైసీపీలో ముస‌లం...అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర‌!

వైసీపీకి ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా కంచుకోట‌. ఇది 2019కి ముందు మాట‌. ఇప్పుడు ఆ జిల్లా వైసీపీలో ముస‌లం పుట్టింది. వైసీపీ అత్యంత బ‌లంగా ఉన్న చోట కాపాడుకోడానికి అధిష్టానం ఏ మాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేదు. సొంత పార్టీ నేత‌లు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. 

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో నెల్లూరు న‌గ‌రం, గూడూరు, సూళ్లూరుపేట‌, వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు తీవ్ర‌స్థాయికి చేరాయి. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పార్టీ నుంచి దూర‌మైన మ‌రుక్ష‌ణ‌మే, అక్క‌డి పార్టీ బాధ్య‌త‌ల్ని ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు.

నెల్లూరు రూర‌ల్‌లో కోటంరెడ్డి పోయిన‌ప్ప‌టికీ , నష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో అధిష్టానం వేగంగా స్పందించింది. కానీ మిగిలిన చోట్ల ఇలా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైసీపీ దిగువ‌శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీలో బాబాయ్‌, అబ్బాయ్ అని ముద్దుగా పిలుచుకునే డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి.

రూప్‌కుమార్ యాద‌వ్ వ‌ర్గంలో ఉండ‌డం వ‌ల్లే మైనార్టీ నాయ‌కుడైన త‌న‌పై ఎమ్మెల్యే అనిల్ దాడి చేయించార‌ని వైసీపీ నాయ‌కుడు ఆరోపించాడు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పుట్టుపూర్వోత్త‌రాలు త‌న‌కు తెలుస‌ని, నోరు తెరిస్తే బ‌తుకు బ‌జారున ప‌డుతుంద‌ని, కావున త‌న జోలికి రావ‌ద్ద‌ని రూప్‌కుమార్ యాద‌వ్ బ‌హిరంగంగానే హెచ్చ‌రించారు. ఇందుకు ఎమ్మెల్యే అనిల్ త‌న‌దైన రీతిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.

త‌న‌పై అవాకులు చెవాకులు పేలితే చ‌ర్మం తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. రూప్‌కుమార్ ఓ అంత‌ర్జాతీయ దొంగ అంటూ మండిప‌డ్డారు. వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రుగుతుంటే ప్ర‌తిప‌క్షాలు ఎంజాయ్ చేస్తున్నాయి. నెల్లూరు సిటీ వైసీపీలో ఇలాగే గొడ‌వ‌లు కొన‌సాగితే మాత్రం గెలుపును మ‌రిచిపోవాల్సిందే. ఇదే రీతిలో ఉద‌య‌గిరి వైసీపీలో కూడా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం వుంది.

గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వ‌ర‌ప్ర‌సాద్‌, సంజీవ‌య్య వ్య‌వ‌హారాల‌తో వైసీపీలోని కొన్ని వ‌ర్గాలు హ‌ర్ట్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మార్చాల‌ని, లేదంటే ఓడిస్తామ‌ని అధిష్టానానికి ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల అధికార ద్వితీయ శ్రేణి నాయ‌కులు వార్నింగ్ ఇచ్చారు. 

ఇక వెంక‌ట‌గిరిలో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ శ్రేణుల్ని క‌లుపుకుని పోవ‌డంలో నిర్లక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. రామ్‌కుమార్ మార‌క‌పోతే మాత్రం, అక్క‌డ వైసీపీకి డ్యామేజీ త‌ప్పేలా లేదు. వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో పార్టీ వాస్త‌వ ప‌రిస్థితులు ఇవీ. ఇప్ప‌టికైనా చ‌క్క‌దిద్దే చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే మాత్రం ఓట‌మి కాచుకుని కూచుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?