వీళ్లు కూడా ‘ఓపెన్ మైండ్’తో చూడమంటున్నారు!

టాలీవుడ్ జనాలకు ఇప్పుడో కొత్త పదం దొరికినట్టుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ ఇలా రావడమే ఆలస్యం, అలా ప్రేక్షకులకు ఉచిత సలహాలిస్తున్నారు. మొన్నటికిమొన్న కస్టడీ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు నాగచైతన్య ఓ ఉచిత…

టాలీవుడ్ జనాలకు ఇప్పుడో కొత్త పదం దొరికినట్టుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ ఇలా రావడమే ఆలస్యం, అలా ప్రేక్షకులకు ఉచిత సలహాలిస్తున్నారు. మొన్నటికిమొన్న కస్టడీ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు నాగచైతన్య ఓ ఉచిత సలహా పడేశాడు. ఓపెన్ మైండ్ తో సినిమా చూడాలని కోరాడు.

ఇప్పుడు అన్నీ మంచి శకునములే యూనిట్  కూడా ఇదే మాట చెబుతోంది. తమ సినిమాలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనని అంగీకరించిన యూనిట్.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఓపెన్ మైండ్ తో చూడమని కోరుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ సినిమాను కూడా ఓపెన్ మైండ్ తో చూడాలా?

స్టార్ హీరోల సినిమాల్ని ఓ రకమైన అంచనాలు పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే ఫ్లాప్ చేస్తారు ఆడియన్స్. చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది. అందుకే పెద్ద సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు ఓపెన్ మైండ్ తో చూడమంటారు. 'అన్నీ మంచి శకునములే' సినిమాను కూడా అంచనాలు పెట్టుకొని చూస్తారా?

సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవు. పైగా ఈ హీరో రీసెంట్ గా హిట్ కూడా కొట్టలేదు. ఎటొచ్చి స్వప్న సినిమాస్ బ్యానర్ పై నుంచి వస్తున్న మూవీ కావడంతో ఉన్నంతలో కంటెంట్ బాగుంటుందనే హోప్ చాలామందికి ఉంది. మొదటి రోజు సినిమా చూసిన వెంటనే ఆ హోప్ కూడా పోయింది.

రొటీన్ కథ, రొటీన్ నెరేషన్, రొటీన్ సన్నివేశాలు, రొటీన్ ఇంటర్వెల్ బ్లాక్, రొటీన్ క్లయిమాక్స్.. అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోడానికేం లేదు. ఇలాంటి సినిమాను కూడా ఓపెన్ మైండ్ తో చూడమని సలహా ఇస్తే ఏమనుకోవాలి? కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వాటిని అలా వదిలేయాలి, తెగేదాకా లాక్కూడదు.