మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇతరుల బెడ్రూంలోకి చొరబడినట్టు ఎల్లో బ్యాచ్ తెగ బాధపడి పోతోంది. వాళ్లద్దరూ వెళ్లకూడని చోటికి వెళ్లినట్టు, చూడకూడనదేదో చూసినట్టు ఎల్లో మీడియా, తెలుగు తమ్ముళ్ల గురువారం మధ్యాహ్నం నుంచి చిందులు తొక్కుతున్నారు. వల్లభనేని వంశీ మాటల్లో చెప్పాలంటే తమ నాయకుడిలో సరుకు లేదనే వాస్తవం బయట పడే ప్రమాదం ముంచుకొచ్చిందనే ఆందోళన ఎల్లో బ్యాచ్‌లో కనిపించింది.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు, తల్లిదండ్రులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి లాగిన్ వివరాలు బహిరంగంగా ప్రకటించారు. కేవలం టీడీపీ టెన్త్ బాధితులకే అనే నిబంధన పెట్టి వుంటే సమస్యే లేకపోయేది.
ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా జాయిన్ అయ్యారు. తన మేనకోడలు తరపున మాట్లాడ్డానికి వెళ్లానని కొడాలి నాని చెప్పారు. అలాగే వల్లభనేని వంశీ కూడా తన వాళ్ల తరపున మాట్లాడేందుకు వెళ్లారు. ఇందులో తప్పేంటి? ఫలానా వాళ్లకు జూమ్ ప్రవేశం నిషిద్ధమని ఎక్కడైనా రాశారా? కొడాలి నాని, వల్లభనేని వంశీలంటే లోకేశ్‌కు, టీడీపీ నేతలకు ఎందుకంత భయం?
వీడియో కాన్ఫరెన్స్‌లో కొడాలి నాని, వంశీలను చూడగానే లోకేశ్ భయంతో బిత్తరపోయారు. తనకేమవుతుందోననే భయం ఆయన చూపుల్లో కనిపించింది. టీడీపీకి భవిష్యత్ రథసారథి అయిన లోకేశ్ ఎందుకంతగా భయపడిపోయారో అర్థం కాదు. నిజానికి ఆహ్వానించకుండా లైవ్‌లోకి వచ్చిన వైసీపీ నేతలకు ….టెన్త్ ఫెయిల్‌తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉందో చక్కగా వివరించి వుంటే, లోకేశ్ ఇమేజ్ పెరిగేది. ఆ పని చేయకుండా చొరబడ్డారని వాపోవడం వల్ల ఒరిగిందేమీ లేదు. పైగా తమ భయాన్ని, నిస్సహాయతను ప్రదర్శించుకున్నట్టైంది.
నాయకుడి సమర్థత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైన ఆధారపడి వుంటుంది. బంగారం లాంటి అవకాశాన్ని లోకేశ్ చేజేతులా జారవిడుచుకున్నారు. వల్లభనేని, కొడాలిని ఎదుర్కోడానికి బదులు, పలాయనం చిత్తగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు.
‘ ఇక్కడకు వచ్చి నాపై యుద్ధం చేసేందుకు సిద్ధపడుతున్నారు. జూమ్‌లో కాదు… నేరుగా వచ్చినా మీరేమీ చేయలేరు. పదో తరగతి ఫెయిలైన వైసీపీ కుక్కల్ని పంపడం కాదు! జగన్ రెడ్డీ… స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి చానల్లోనే చర్చించుకుందాం’ అని లోకేశ్ సవాల్ విసిరారు.
చర్చించేందుకే కదా కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ కాన్ఫరెన్స్ సమావేశంలోకి వచ్చింది. ఆ విషయాన్ని లోకేశ్ విస్మరిస్తే ఎలా? మాట్లాడుకునేందుకైతే డైరెక్ట్‌గా రావడమెందుకు? కొట్టుకోవాలనే ఆలోచన వుంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసరొచ్చు. అయినా ఎన్నికల్లో ఫెయిల్ అయిన తనతో జగన్ చర్చించడానికి రావాలని లోకేశ్ కోరుకోవడం అత్యాశ కాదా! జూమ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని రావడంతో ఒక్కసారిగా లోకేశ్‌కు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందన్న ఆందోళన టీడీపీలో కనిపించింది.
ఎల్లో మీడియా గగ్గోలు, తెలుగుదేశం నాయకుల విమర్శలపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “నాని, వంశీ బెడ్రూమ్లోకి చొరబడ్డట్టు …పచ్చ బ్యాచ్ నానాయాగీ చేస్తోంది. ఆపండ్రా బాబూ మీ ఓవర్ యాక్షన్” అని నెటిజన్లు హితవు చెప్పడం విశేషం.
సొదుం రమణ