టీడీపీకి జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే వున్నాయి. అందుకే పొత్తు విషయంలో టీడీపీ ధైర్యంగా ముందుకెళ్లలేక పోతోంది. పవన్ మనస్తత్వం తెలిసి కూడా, అతనితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడం అంటే అంతకు మించి అజ్ఞానం మరొకటి లేదనే భావన టీడీపీలో ఉంది. 2014-19 మధ్య అనేక సందర్భాల్లో టీడీపీకి అధికారం తన భిక్షే అని పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీని మానసికంగా తీవ్రంగా బాధించాయి. ఆ బాధ, ఆవేదన ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
పవన్‌కల్యాణ్‌ను తీవ్రంగా ద్వేషించే పార్టీ ఏదైనా వుందంటే…. అది ఒక్క టీడీపీనే. కానీ తనను జగన్, వైసీపీ నేతలు తీవ్రంగా దూషిస్తూ, ద్వేషిస్తున్నారని పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పవన్ అభిప్రాయాన్ని కాదనలేం. అలాగని అదే నిజమని చెప్పలేం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని గౌరవించాల్సిందే. అభిప్రాయాలతో విభేదించే హక్కు మాత్రం ఎవరికైనా వుంటుంది.
జగన్‌ను అకారణంగా పవన్ ద్వేషిస్తూ, తమ ఓటమి కోరుకుంటున్నారనే కోపం వైసీపీలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పవన్ టార్గెట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇదే పవన్‌కల్యాణ్‌ను కరివేపాకులా వాడుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ మాత్రం పవన్‌కు బాగా దగ్గరి వాళ్లు అయ్యారా? అనే నిలదీత వైసీపీ నుంచి వస్తోంది. ఎందుకిలా జరుగుతోందని వైసీపీ ప్రశ్నిస్తోంది.
అంతెందుకు ఇటీవల వన్‌సైడ్ లవ్ అంటూ రెచ్చగొట్టి, తీరా పవన్ సానుకూలంగా స్పందించిన తర్వాత టీడీపీ మౌనం పాటించడాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. అయితే టీడీపీ వాదన మరోలా వుంది. రహస్యాల్ని రహస్యంగా ఉంచే అలవాటు పవన్‌కు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన వాటిని, తనకు అనుకూలమైన సందర్భాల్లో బయటపెడుతూ ఎదుటి వాళ్లను ఇబ్బందిపెడుతుంటారని టీడీపీ నేతలు వాపోతున్నారు.
2014లో పవన్ తమకు మద్దతుగా ప్రచారం చేశారని, దాన్నే సాకుగా తీసుకుని ఆ ఐదేళ్లు తన వల్లే అధికారం చెలాయించారని పదేపదే ప్రకటించడాన్ని టీడీపీ అవమానంగా భావిస్తోంది. ముఖ్యంగా లోకేశ్, ఆ పార్టీలోని యువతరం జీర్ణించుకోలేకపోతోంది. ఒకవేళ అతనితో పొత్తు పెట్టుకుంటే మరోసారి అదే అవమానం రిపీట్ అవుతుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
పవన్ వల్ల అధికారం దక్కిందని తాము చెబితే ఆయనకు గౌరవం వుండేదని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం అంటే నాలుగు దశాబ్దాల పార్టీని చిన్నచూపు చూడడమే అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పెట్టుకోడానికి పాత గాయాలే అడ్డంకిగా మారాయనే అభిప్రాయం బలంగా ఉంది.