నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ నోరు మంచిది కాకపోతే లేనిపోని తిప్పలు కొని తెచ్చుకోవాలి. సరిగ్గా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాగే నోరు చేసుకుని ఇబ్బంది పడ్డారు పవన్ కల్యాణ్. మేనల్లుడి సినిమాని కూడా ఇబ్బంది పెట్టారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే పవన్ కల్యాణ్, నాని సినిమా అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఆయన తన నోటికి తానే తాళం వేసుకున్నారు. సినిమాలు తప్ప రాజకీయాలు మాట్లాడలేదు. అందులో కూడా చాలా పొదుపు పాటించారు. పరువు కాపాడుకున్నారు.
అవును, పవన్ కల్యాణ్ నిజంగానే తన పరువు కాపాడుకున్నారు. మొన్నటివరకు ఎక్కడేం మాట్లాడాలో తెలిసేది కాదు, కానీ ఈసారి కాస్త తెలివి తెచ్చుకున్నారు. సినీ వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదని గ్రహించారు. అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయాలు అస్సలు మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అలా ఆయన తన పరువు నిలుపుకున్నారనే చెప్పాలి.
ఈ స్పష్టత అప్పుడేమైంది పవనూ!
తన ప్రసంగంలో భాగంగా సినిమాలు, రాజకీయాలు వేరనే స్పష్టత తనకుందంటూ ప్రకటించుకున్నారు పవన్. మరి ఇదే స్పష్టత అప్పుడు ఏమైంది? రిపబ్లిక్ సినిమా వేదికపైన రాజకీయాలు మాట్లాడారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నారు. అప్పుడు మొదలైన గొడవ ఇప్పటివరకూ ఆగలేదు.
ఆ తర్వాత చిరంజీవి కూడా ఈ వ్యవహారంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనే కాకుండా, తనతోపాటు చాలామంది నోటికి పని కల్పించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు జ్ఞానోదయం అయిందని ప్రకటించుకున్నారు.
గ్రేస్ మార్కులతో ఫెయిలయ్యారు..
గ్రేస్ మార్కులతో టెన్త్ స్టూడెంట్స్ ని పాస్ చేయించండి అంటూ ఓ తెలివి తక్కువ స్టేట్ మెంట్ ఇచ్చి ఫెయిలయ్యారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద రాద్ధాంతం నడుస్తోంది. ఈ దశలో మరోసారి రాజకీయం మాట్లాడితే వైరి వర్గం కౌంటర్లు తట్టుకోవడం చాలా కష్టం. అందులోనూ నానీ కూడా ఆమధ్య సినిమా టికెట్ల వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గాడు.
పవన్ ఇప్పుడీ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడితే అది 'సుందరానికి' ఎసరు పెట్టినట్టే అవుతుంది. అందుకే ఇలా సైడైపోయారు. ఆవేశం చంపుకుని మరీ నిబ్బరం తెచ్చుకున్నారు. తగ్గేదే లేదంటూ ఇటీవల ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన పవన్, ఇలా తగ్గిపోయారు.