విపక్షాల ‘వ్యూహాన్’ ల్యాబ్ లో కుట్రప్రయోగాల రిజల్ట్ ముందస్తు వైరస్

ఒక అబద్ధాన్ని పునాదిగా వేసి, దాని మీద అధికారపు ఆశల హర్మ్యాలను నిర్మించుకోవాలనే కుట్ర ఆలోచనలు ఫలిస్తాయా? ఏపీలో అసలు ముందస్తు ఎన్నికల అవసరం ఉన్నదా? ముందస్తుకు వెళ్లి రాజకీయ లబ్ధి పొందవలసిన దుర్భర…

ఒక అబద్ధాన్ని పునాదిగా వేసి, దాని మీద అధికారపు ఆశల హర్మ్యాలను నిర్మించుకోవాలనే కుట్ర ఆలోచనలు ఫలిస్తాయా? ఏపీలో అసలు ముందస్తు ఎన్నికల అవసరం ఉన్నదా? ముందస్తుకు వెళ్లి రాజకీయ లబ్ధి పొందవలసిన దుర్భర స్థితిలో అధికార పార్టీ ఉందా? మరి ముందస్తు గురించి ఇంతగా ఎందుకు చర్చ జరుగుతోంది?

విపక్షాల యొక్క గత్యంతరం లేని దుర్భర స్థితికి ఈ ముందస్తు ఎన్నికల ప్రచారం ఒక నిదర్శనం. ఏదో ఒక బూచిని చూపిస్తే తప్ప.. తమ తమ పార్టీల నాయకులను కాపాడుకోలేని, ఉత్తేజితం చేయలేని ప్రతిపక్షాల దౌర్భాగ్యానికి ముందస్తు ఒక ప్రతీక. విపక్షాల వ్యూహాల లేబొరేటరీలో అనేకానేక కుట్ర ప్రయోగాలు నిరంతరాయంగా చేపట్టిన ఫలితమే.. ఈ ప్రచారం! ఆ వైనం మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ముందస్తు వైరస్’!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా? ఇప్పటికిప్పుడు రెండు మూడు రోజుల దినపత్రికలు చదివితే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది. అంతకంటె లోతుగా ఏపీ రాజకీయ వ్యవహారాలను పరిశీలిస్తున్న వారికి ఏపీలో అంతటి అవసరం ఏమున్నదబ్బా అనే అభిప్రాయం కలుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి సర్కారు స్థిరమైన పాలన సాగిస్తున్నది కదా.. ప్రతిపక్షాలు ఇంతగా అదిగో ముందస్తు అంటూ గోల చేస్తున్నాయెందుకు అనిపిస్తుంది. 

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది తప్పుడు వ్యవహారమేమీ కాదు. కాకపోతే రాజకీయంగా ఒక్కో సందర్భంలో ఒక్కో రకం అవసరానికి తగినట్టుగా ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికల మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చాయనేది మనకు తెలియదు. అప్పటికేమీ సంక్షోభంగానీ, ప్రత్యేక అవసరాలు గానీ కేసీఆర్ కు లేవు. కాకపోతే.. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఒత్తిడి ఒకేసారి ఎదుర్కొనే ఆలోచన కేసీఆర్ కు లేనట్టుంది. 

చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తీరు చాలా చిత్రమైనది. 2003 అక్టోబరు ఒకటో తేదీన తిరుమల వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్ మీద నక్సలైట్లు క్లెమోర్ మైన్స్ తో దాడిచేశారు. చంద్రబాబునాయుడు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో అది చాలా పెద్ద సంచలనం అయింది. చంద్రబాబు పట్ల ప్రజల్లో జాలి వెల్లువెత్తింది. మరోవైపు అప్పటికే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి, ప్రజల్లో అనన్యమైన ఆదరణను ఏర్పరచుకుని ఉన్నారు. 

నక్సలైట్ల క్లెమోర్ మైన్స్ దాడినుంచి తప్పించుకున్న చంద్రబాబునాయుడు, ప్రజల్లో పుట్టిన జాలిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. ఉన్నపళంగా ఆయన అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కేవలం సానుభూతిని ఓట్లుగా మలచుకోవాలని అనుకున్న పిరికితనంతో ఎంచుకున్న మార్గం అది. అయినా సరే.. ప్రజలు ఆయన కుయుక్తులను సఫలం కానివ్వలేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కిరీటధారణ చేశారు.

దీనిద్వారా మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. ముందస్తు ఎన్నికలు అనేవి విజయానికి షార్ట్ కట్ మార్గం ఎంతమాత్రమూ కాదు. అన్నివేళలా ముందస్తులో గెలుపు దక్కుతుందని అనుకోవడం పొరబాటు. 

విపక్షాల దుష్ప్రచారం ఇదీ..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విషపు ఆలోచనల లేబొరేటరీలో పుట్టిన వైరస్ లాంటిది. నిజానికి ఆయన ఏడాది కంటె ముందునుంచే ముందస్తు పాట పాడడం ప్రారంభించారు. ఆయన వందిమాగధులు అందరూ అప్పటినుంచీ దానికి వంత పాడుతూనే ఉన్నారు. ఎందుకంటే.. అలాంటి అబద్ధపు ప్రచారం చంద్రబాబుకు అత్యవసరం అయిపోయింది. తన పార్టీని కట్టుబాటులో ఉంచుకోవడానికి, తన పార్టీ శ్రేణులు గాడితప్పిపోకుండా కాపాడుకోడానికి ఆయనకు ఆ ప్రచారాన్ని మించిన మార్గం కనిపించలేదు. 

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు మీద నమ్మకం పోయింది. అదే సమయంలో చంద్రబాబు ఇప్పటినుంచే  భావి ముఖ్యమంత్రిగా తన కొడుకును ప్రొజెక్టు చేయడం మీద వ్యతిరేకత కూడా ఉంది. పార్టీ ఉద్ధారకుడిలాగా లోకేష్ సాగిస్తున్న పాదయాత్ర పట్లకూడా ఉడికిపోతున్న సీనియర్ నాయకులు ఉన్నారు. చాలా చోట్ల పార్టీ విభేదాలతో కొట్టమిట్టాడుతోంది. చీలికల ప్రమాదం ఉంది. ఎవరికి వారు.. తమ సొంత దారి చూసుకుని.. పార్టీని వీడిపోతారనే భయం కూడా చంద్రబాబులో ఉంది. 

అందువల్ల వారు బయటకు వెళ్లకుండా.. అప్పటికప్పుడు బయటకు వెళితే.. ఇతర పార్టీలలో అవకాశాలు దక్కవని, ఎన్నికలు వచ్చేస్తుండగా.. వారు కొత్త పార్టీ ట్యాగ్ లైన్ తో ప్రజల్లో కుదురుకోవడం కష్టమని బెదిరించడానికి చంద్రబాబు ముందస్తు అస్త్రాన్ని ప్రయోగిస్తూ వచ్చారు. ఆ పాచిక పారింది. గత ఏడాదిగా చంద్రబాబు ప్రచారాన్ని నమ్మిన వారు.. ఇష్టంలేకపోయినా ఆ పార్టీలో కొనసాగుతున్నారు.ఇప్పుడు ఎన్నికలు ఇంకో ఏడాది దూరంలో ఉండగా కూడా.. వారిని అలాగే కట్టడి చేయడానికి చంద్రబాబు అదొక్కటే మంత్రం పఠిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు అదిగో వచ్చేస్తున్నాయి… అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం డూడూ బసవన్నల్లాగా అదే పాట పాడుతున్నారు. 

విపక్షాలు ఎంతగా దిగజారిపోతున్నాయంటే.. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా.. అదే పాట ఎత్తుకున్నారు. తన సభల్లో డిసెంబరులోనే, అంతకంటె ముందుగానే ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని పాట పాడుతున్నారు. చివరికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిస్తే కూడా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనుమతి తీసుకోవడానికే వెళ్లారని నిందలు వేసేంతగా దిగజారిపోయారు. 

ఒక రాష్ట్రప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఆ ముఖ్యమంత్రికి , ప్రధాని అవసరం లేదని ప్రజలకు కూడా తెలుసు. కానీ.. విపక్షాల బురదచల్లుడు రాజకీయ ప్రహసనంలో ఇలాంటి విమర్శలు పుడుతున్నాయి. లాజిక్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రజలు నమ్ముతారో లేదో కూడా వారికి అక్కర్లేదు. తాము చల్లదలచుకున్న బురదను, ప్రజలు నమ్మేదాకా అదేపనిగా చల్లుతూ ఉండడమే పనిగా విపక్షాలు చెలరేగుతున్నాయి. అంతే వేగంగా ఈ విషప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. 

జగన్ కనుగొనాల్సిన వ్యాక్సిన్ ఇదీ..

చంద్రబాబునాయుడు గోబెల్స్ ప్రచార సరళిలో సిద్ధహస్తుడు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా.. అదేతీరులో పదిమందితో చెప్పించడం ద్వారా.. చంద్రబాబు ఆవును తీసుకువచ్చి మేక అని నమ్మించగలరు. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు వస్తుందని ప్రజలను నమ్మించే పనిలో ఉన్నారు. కొవిడ్ 19 కంటె ప్రమాదకరమైన వైరస్ గా ఆయన ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే సంగతిని ప్రచారంలో పెడుతున్నారు. జగన్ ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. 

సాధారణంగా ప్రతిపార్టీ ఎన్నికలకు సిద్ధం అయ్యే క్రమంలో తీసుకునే అనేకానేక నిర్ణయాల మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. కొన్ని నెలలుగా అమలవుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’  దగ్గరినుంచి ప్రజలతో పార్టీని, నాయకులను మమేకం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అనేక పథకాలకు ఎన్నికలకు సన్నద్ధం చేసేవే. 

అలాగే ఒకవైపు యాత్ర 2 సినిమాను కూడా రూపొందిస్తున్నారు. ‘యాత్ర’ సినిమా వైఎస్సార్ జీవితంతో పాటు ఆయన పాదయాత్ర తీరును ఆవిష్కరించింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన అతి సుదీర్ఘమైన పాదయాత్రను ఆవిష్కరిస్తూ ఇప్పుడు యాత్ర 2 రూపొందుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సామాన్య ప్రజలను కలవడం లేదని, ఆయన వస్తోంటే బారికేడ్లు కట్టి ప్రజలను దూరం ఉంచుతుంటారని విపక్షాలు కువిమర్శలు చేస్తుంటాయి. 

కానీ, అదే జగన్ సీఎం కావడానికి ముందు ఎంత దారుణంగా కష్టపడ్డారో.. సామాన్య పేద ప్రజానీకంతో తానూ ఒకడిగా ఎంతలా కలిసిపోయారో.. ఆయన పాదయాత్ర నాటి ఉదంతాలు వెల్లడిస్తాయి. ఆయన పాదయాత్ర గురించిన సంగతులు తెలియని వారికి ఆయన ఎంతటి కష్టజీవి అనే సంగతి కూడా తెలియదు. ముఖ్యమంత్రిగా అనేకానేక ప్రోటోకాల్, భద్రత చర్యల్లో భాగంగా ఒక పరిమితితో ప్రజల్లో మెలగవలసి ఉంటుందే తప్ప..  జగన్ వాస్తవమైన తీరు ఎలాంటిదో ఆయన పాదయాత్రను చూసిన వారికి తెలుసు. 

అలాంటప్పుడు.. జగన్ పాదయాత్ర గురించిన చిత్రం రూపొందడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా ఎడ్వాంటేజీ అవుతుంది. ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరిలో ఆ చిత్రం రావడం అంటేనే.. ‘ఆలోగా ఎన్నికలు జరగవు’ అనే ఒక అప్రకటిత సంకేతంలాగా భావించాల్సి ఉంటుంది. 

అయినా సరే ప్రతిపక్షాలు వ్యాపింపజేస్తున్న ముందస్తు వైరస్ మరింత వేగంగా ఆంద్రప్రదేశ్ లో విస్తరిస్తోంది. నిజానికి అలాంటి ప్రచారానికి యాత్ర -2 కూడా ఒక విరుగుడు కావాలి. కానీ దానిని మించి విపక్షాల ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కూడా అమలయ్యే పార్టీ కార్యక్రమాల కార్యచరణ ప్రణాళికను జగన్ ఇప్పుడే ప్రకటించాలి. దాని వలన.. పార్టీ అప్పటిదాకా ఎన్నికలకు సిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నదని ప్రజలకు అర్థమవుతుంది. ముందస్తు వైరస్ వ్యాప్తికి అడ్డుగోడ పడుతుంది. ముందస్తు వస్తున్నదని తెదేపా– జనసేన ల్లో పార్టీ నాయకులందరూ ఒకే తీరుగా ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో.. అదే తరహాలో వైసీపీలో కూడా ప్రతి దశలోని వారూ.. ఆ ప్రచారాల్ని సమిష్టిగా తిప్పికొట్టాలి. 

దేశంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ విధించిన తీరుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ముందస్తు వ్యతిరేక ప్రచారం నిర్వహించాలి. పార్టీ సోషల్ మీడియా దళాలు కూడా యాక్టివ్ గా పనిచేయాలి. విపక్షాలు ‘ముందస్తు వచ్చేస్తున్నదంటూ’ ఒక విషబీజాల్ని నాటడానికి ప్రయత్నించడం, అటు ముఖ్యమంత్రిగానీ, ఇటు సజ్జల రామకృష్ణా రెడ్డి గానీ.. ఆ వ్యాఖ్యలను ఖండించడం మాత్రమే జరుగుతూ వస్తోంది. కానీ వైరస్ వ్యాప్తికి ఇది సరిపోదు. 

కోవిడ్ వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి కొవ్వొత్తులు వెలిగించడం, పళ్లేలు కొడుతూ చప్పుడు చేయడం వంటి కార్యక్రమాలకు మోడీ పిలుపు ఇచ్చినట్టుగానే.. పార్టీ శ్రేణులు అందరికీ పిలుపు ఇవ్వాలి. ముందస్తు ప్రచారాలను.. పైస్థాయి నుంచి.. కిందిస్థాయి కార్యకర్తల వరకు తిప్పికొట్టాలి. సోషల్ వేదికలమీద, మీమ్ లు, సందేశాలు, డిజిటల్ పోస్టర్లు తదితరు అన్ని ఫార్మాట్లలో అందరి ద్వారా.. ముందస్తురావడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి పంపాలి. అప్పుడు వారికి బాగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది.

కేంద్రం కూడా ముందస్తుకు వెళితే..]

ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడానికి ఒకే ఒక్క సంభావ్యత ఉంది. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. విపక్షాలు ఏకమవుతున్న తీరుకు చెక్ పెట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా పార్లమెంటును రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి మోడీ సర్కారు సాగుతున్న వాతావరణంలో వారికి కూడా ముందస్తు అవసరం ఉందని అనిపించదు. కానీ.. ప్రతిపక్షాల ఐక్యగానాలాపన ఇప్పుడే ప్రారంభం అవుతున్న తరుణంలో.. వారు ఏకం కావడానికి కూడా వ్యవధి ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని మోడీ భావిస్తే గనుక.. ముందస్తుకు వెళ్లవచ్చు. 

ఒకవేళ అలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడితే.. ఏపీ సర్కారు కూడా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది. దానిని సహజ నిర్ణయంగా పరిగణించడానికి వీల్లేదు. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి, పార్లమెంటుతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి వీలుగా.. జగన్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప.. మరో పరిస్థితుల్లో జగన్ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. 

‘ముందస్తు వస్తుంది’ అని చెప్పుకుంటూ ఆ విష ప్రచారంలోనే తమ మనుగడను వెతుక్కునే వాళ్లు పిరికివాళ్లు. అన్యధా జగన్ సర్కారును బద్నాం చేయడానికి కూడా వారికి మార్గాలు తోచవు. కాబట్టి.. ఇలాంటి ప్రచారాల పట్ల పార్టీ మాత్రమే కాదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. 

.. ఎల్. విజయలక్ష్మి