దేశానికి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి ఒక నినాదాన్ని డప్పేస్తోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ, అమిత్ షాలు పదేళ్ల నుంచి నినాదాలు ఇస్తూ ఉన్నారు. అయితే అదేమీ ఇప్పటి వరకూ జరగలేదు.
భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అయితే కాంగ్రెస్ గద్దె దించలేకపోతోంది కానీ, ఇప్పటికీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది. కొన్ని చోట్ల బీజేపీని దించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కూడా చేపడుతూ ఉంది. ఆ సంగతలా ఉంటే, కాంగ్రెస్ పై విపరీత ద్వేషంతో ఎదిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అచ్చంగా అదే పార్టీలో నడవడమే పెద్ద విచిత్రంగా మారుతూ ఉంది. ఒక అంశంలో అని కాదు, చాలా వ్యవహారాల్లో కాంగ్రెస్- బీజేపీ హైకమాండ్ లకు పెద్ద తేడా లేకుండా పోతోంది! ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను పరిమిత పాత్రధారులను చేసింది కమలం పార్టీ హైకమాండ్.
కర్ణాటకలో అయితే ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తులను మరీ డమ్మీలుగా చేసి బీజేపీ అందుకు ప్రతిఫలం అనుభవించింది. యడియూరప్ప దాదాపు రెండేళ్ల పాటు సీఎంగా వ్యవహరిస్తే ఆయనకు కనీసం కేబినెట్ ను పునర్వ్యస్థీకరించుకునేందుకు అవకాశం ఇవ్వలేదు! కేబినెట్ కోసం అంటూ యడియూరప్ప అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి చేయలేకపోయారు. చివరకు ఆయనను తప్పించి బొమ్మైని సీఎంగా నియమించింది బీజేపీ హైకమాండ్.
అయితే ఆయనకు కూడా ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోయింది. 80లలో కాంగ్రెస్ రాజకీయాలను గుర్తు చేసింది బీజేపీ వ్యవహారం. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తిని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ అలానే ట్రీట్ చేసింది. కొంతకాలానికి కాంగ్రెస్ అందుకు తీవ్రమైన ప్రతిఫలాలనే అనుభవించింది. మరి కాంగ్రెస్ అనుభవాల నుంచి బీజేపీ పాఠం నేర్చుకోలేదు.
ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే సంగతిని పక్కన పెట్టి అంతా మోడీ పేరు మీదే నడుస్తోంది. తడుముకోకుండా గుజరాత్ సీఎం ఎవరో చెప్పమంటే చెప్పలేని స్థాయిలో బీజేపీ రాజకీయం సాగుతూ ఉంది. ముఖ్యమంత్రులను మార్చేయడం, సీల్డ్ కవర్ సీఎంలు.. ఇదంతా ఒకప్పటి కాంగ్రెస్ సంస్కృతి, ఇప్పటి బీజేపీ సంస్కృతి!
కేవలం సీఎంల వ్యవహారమే కాదు, ఎమ్మెల్యేలను అటూ ఇటూ చేయడం కూడా కాంగ్రెస్ వైనాన్నే గుర్తు చేస్తూ ఉంది. 80లలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన పార్టీగా కాంగ్రెస్ పేరు తెచ్చుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ రెండు దశాబ్దాల్లో కూల్చిన ప్రభుత్వాల కన్నా.. ఎక్కువ ప్రభుత్వాలను ఇప్పటికే బీజేపీ దించేసింది. తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని బీజేపీ తన రాజకీయ శక్తిగా భావిస్తూ ఉంది. ఇప్పటికే అరడజనుకు పైగా రాష్ట్రాల్లో తమ వ్యతిరేక ప్రభుత్వాలను బీజేపీ కూల్చింది. అలా కూల్చి తన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంది. వాటిని అక్కడక్కడ ప్రజలు కూలుస్తున్నారు కూడా!
అయినా కూడా బీజేపీ ధోరణి ఏమీ మారడం లేదు. ప్రత్యర్థి పార్టీలను చీల్చడం, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకోవడం, తద్వారా తమ ప్రభుత్వాలను బలోపేతం చేసుకోవడం అనే వ్యూహాలను బీజేపీ కొనసాగిస్తూ ఉంది. కర్ణాటకలో ఇదే ధోరణి ఎదురు తన్నింది. మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే దీని ఫలితంగా అదనపు వ్యతిరేకతను రేపటి ఎన్నికల్లో ఎదుర్కొనాల్సి ఉంటుంది ఆ పార్టీ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మహారాష్ట్రలో అయితే ఇప్పటికే శివసేనను చీల్చిన బీజేపీ ఎన్సీపీని కూడా చీల్చింది. ఎమ్మెల్యేలను కలిపేసుకుని తను మరింతగా బలపడుతున్నట్టుగా బీజేపీ భావిస్తూ ఉన్నట్టుగా ఉంది. అయితే ప్రజలు ఎన్నుకోకపోయినా అధికారంలోకి రావడమే కాకుండా, ఇలా ప్రత్యర్థి పార్టీలన్నింటినీ చీల్చిచెండాడుతుంటే దాని వల్ల అదనపు వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు రావడంలో ఈ అంశం కూడా ఉంది. రేపు మధ్యప్రదేశ్ లో అయినా, ఆ తర్వాత మహారాష్ట్రలో అయినా బీజేపీకి ప్రజలే ఈ విషయాన్ని పాఠంగా చెప్పే అవకాశాలున్నాయి.