విజయనగరం జిల్లా తెలుగుదేశానికి ఒకనాడు కంచుకోట. అలాంటి జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లను వైసీపీ 2019 ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఆ దెబ్బతో టీడీపీ కునారిల్లిపోయింది.
ఓడి నాలుగేళ్లు అవుతున్నా ఎత్తిగిల్లడంలేదు. ఇక టీడీపీలో విభేదాలు కూడా తారస్ధాయిలో ఉన్నాయని అంటున్నారు. జిల్లాను ఏకత్రాటి మీద నడిపించాల్సిన పెద్దలు సైతం కాడె వదిలేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాటే శాసనంగా ఒకపుడు జిల్లా టీడీపీ అంతా పాటించేది. ఆయన 2014లో ఎంపీ కావడంతో జిల్లా రాజకీయాల మీద ఆయన పట్టు జారింది. ఆ తరువాత 2019 నాటికి తన కుమార్తెకు టిక్కెట్ ఇప్పించుకోవడం ద్వారా ఆయన అక్కడికే పరిమితం అయ్యారని అంటున్నారు.
దాంతో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలను ఏక మాట మీద నిలిపే నాయకత్వం కరవు అయిందని అంటున్నారు. విజయనగరం జిల్లా అధ్యక్షునిగా యువకుడైన కిమిడి నాగార్జునను నియమించినా ఆయన ఎంతసేపూ చీపురుపల్లి మీదనే చూపు సారిస్తున్నారని అంటున్నారు.
ఇక అశోక్ విజయనగరంలో తన గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేసుకునే పనిలో ఉన్నారు. దాంతో ఈసారి జిల్లాను అంతా గెలిపించే సమర్ధ నాయకత్వం లేమితో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది అని అంటున్నారు.