కాంగ్రెస్ పార్టీ తరఫున భావి ప్రధాని అయ్యే నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఆయన చాలా బాగా పాదయాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలు కూడా చుట్టివచ్చారు. దేశంలో వివిధ వర్గాల వృత్తి ఉద్యోగా కార్మికులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా గ్రాఫ్ బాగానే ఉంది.
కానీ, ఇంకో ఆరేళ్ల దాకా మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టగలరా? లేదా? అనేదే చాలా పెద్ద సందేహంగా ఉంది. రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో కోల్పోయిన తన లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పొందగలరా? లేదా, సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోగా కనీసం ఎంపీగా పోటీచేయడానికి అర్హతనైనా నిలబెట్టుకోగలరా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
రాహుల్ గాంధీ ఎంపీ పదవిని రద్దు చేసినందుకు నిరసనగా కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా.. ఈనెల 12వ తేదీన పెద్దస్థాయిలో సత్యాగ్రహాలు నిర్వహించబోతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద మౌన సత్యాగ్రహాలు చేపడతారు. ఈ వైనం చూస్తోంటే.. ఆయన అనర్హత వేటుకు సంబంధించి పార్టీ వర్గాల్లో కంగారు, భయం తారస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది.
మోడీ అనే ఇంటి పేరుకు సంబంధించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తక్షణం ఆయన పదవి పోయింది, క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. కొన్ని వారాల పాటు అప్పీలుకు కూడా వెళ్లకుండా రాహుల్ లైట్ తీసుకున్నారు. ఈలోగా అన్ని విపక్ష పార్టీలతో తనకు అనుకూల ప్రకటనలు ఇప్పించుకున్నారు. పదవిని రద్దు చేసి రాహుల్ ను వేధిస్తున్నారనే విమర్శలు చేయించారు.
అంతా జరిగింది గానీ.. ప్రభుత్వం దిగిరాలేదు. తర్వాత గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేసుకోగా.. తాజాగా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే.. ఆయన రెండేళ్ల జైలుశిక్షను కోర్టు హోల్డ్ చేయడంతో ప్రస్తుతానికి జైలుకు వెళ్లవలసిన అవసరం లేకుండా రాహుల్ బయట తిరుగుతున్నారు.
గుజరాత్ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించాలని అనుకుంటోంది. కానీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే ఆశ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ ఇవాళ కాకపోతే రేపు అయినా రెండేళ్ల పాటు జైలుకు వెళ్లని అగత్యం ఏర్పడుతోంది.
కాంగ్రెసు పార్టీలో, రాహుల్ బృందంలో అసలు భయం ఇప్పుడే మొదలవుతోంది. అందుకే వారు ఆ కంగారులో.. దేశవ్యాప్త సత్యాగ్రహాలు గట్రా ప్లాన్ చేస్తున్నారు. కానీ వాటివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏదో తమ నాయకుడిని కేంద్రప్రభుత్వం వేధిస్తున్నట్టుగా రోడ్లమీద అరచి యాగీ చేయగలరు తప్ప.. రాహుల్ గాంధీ జైలుకు వెళ్లకుండా ఆపడం సాధ్యం కాకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.