ఒక వ్యాపారంలో విజయం చూడగానే ఇక ఆ రంగం మొత్తాన్ని మింగేలాయన్న ఆతృత కొందరిలో కలుగుతుంది. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోవాలని, ప్రపంచ కుబేరుల సరసన నిలబడాలని ఇలా ఏవేవో కోరికలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి ఆలోచనలో తప్పు కనపడకపోయినా ఒక రకంగా ఇది మానసిక రుగ్మత. దీనికేదైనా పేరు పెట్టాలంటే “అలగ్జాండర్ సిండ్రోం” అని పెట్టుకోవచ్చు.
ఒక్క రాజ్యాన్ని గెలవగానే అసలు మొత్తం ప్రపంచాన్నే గెలిచేస్తే ఎలా ఉంటుందనుకుని బయలుదేరాడు అలగ్జాండర్. ఎందరో చావుకి కారణమయ్యాడు, చివరికి తానూ ఏమీ అనుభవించకుండానే పోయాడు.
ఏంబిషన్ ఉండొచ్చు కానీ దానికీ ఒక లెక్కుండాలి. వ్యాపారమన్నాక రిస్క్ తీసుకోవాలి కానీ మరీ నేల విడిచి సాముగారడీ చేయకూడదు. అలా చేసి దెబ్బ తిన్నవాళ్లు ఎందరో. ఆ లిష్టులో ఇప్పుడు కొత్తగా చేరిన వ్యక్తి బైజూస్ రవీంద్రన్.
బైజూస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే రవీంద్రన్ గురించి చెప్పుకుందాం.
రవీంద్రన్ ది కేరళ. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి లెక్కల గురువైతే, తండ్రి ఫిజిక్స్ మాష్టారు. దానివల్ల సహజంగా అతనిలో టీచింగ్ జీన్స్ వచ్చాయి. స్కూల్లో పెద్దగా చదవకపోయినా ఇంట్లోనే తన గురువులుండేసరికి అలా అలా చదివి ఇంజనీరైపోయాడు. కానీ తనలోని నేచురల్ జీన్స్ అతనిని టీచింగ్ వైపు నడిపాయి.
నెమ్మదిగా ఉద్యోగాన్ని పక్కనపెట్టి పోటీ పరీక్షలకి ప్రిపెరయ్యే విద్యార్ధులకి ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. తన పాఠాలతో విద్యార్థుల్ని ఆకర్షించగలిగాడు. వాళ్లకి మంచి రిజల్ట్ కూడా ఇప్పించగలిగాడు. ఇంతింతై అంతంతై అన్నట్టుగా చాలా బిజీ అయిపోయాడు. తన క్లాసులు నడపడానికి చోటు చాలక ఏకంగా స్పోర్ట్స్ స్టేడియం ని అద్దెకు తీసుకుని నడిపేవాడు. పెద్ద పెద్ద స్క్రీన్స్ పైన పాఠాలు చెప్పేవాడు.
దేశంలోనే మంచి పేరు రావడంతో తన విద్యార్థులనే ఉపాధ్యాలుగా మార్చి 41 కోచింగ్ సెంటర్స్ పెట్టాడు. లెక్కలు, ఫిజిక్స్ లాంటివి దాదాపు ప్రతి కాంపిటీటివ్ ఎగ్జాంస్ కి అవసరం. వాటితో పాటు ఇతర సబ్జెక్ట్స్ కూడా తన కోచింగ్ సెంటర్స్ లో చెప్పబడేవి. అక్కడికే కోట్లల్లో సంపాదన ఉంది.
2011లో దివ్య అనే బయోటెక్ ఇంజనీర్ తో కలిసి “థింక్ అండ్ లర్న్” (బైజూస్ కి మాతృ సంస్థ) అనే కంపెనీ తెరిచాడు. ఆమెను తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. 2015లో తన వ్యాపారాన్ని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లి లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ బోధించడం మొదలుపెట్టాడు.
రవీంద్రన్ ఎదుగుదల చూసి సికోయా క్యాపిటల్ అనే కంపెనీ రూ 480 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలా డబ్బొస్తుండడంతో రవీంద్రన్ లో నెమ్మదిగా పైన చెప్పుకున్న అలెగ్జాండర్ సిండ్రోం మొదలయ్యింది. తన కంపెనీని పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్లి మరింత ఎక్కువ డబ్బు చూడాలనుకున్నాడు. 2020లో కరోనా లాక్డౌన్ కాలం అతని వ్యాపారానికి కలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోం, స్టడీ ఫ్రం హోం నేపథ్యంలో బైజూస్ చాలా పాపులర్ అయ్యింది. సుమారు రూ 4000 కోట్ల ఫండ్ రైజింగ్ చెయ్యాలనుకున్నాడు 2021లో. కానీ బ్లాక్స్టోన్, ఫిడిలిటీ, జీఐసీ లాంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ దాదాపు రూ 9000 కోట్లు దాకా గుమ్మరించారు. ఆ దశలో కంపెనీ విలువని ఏకంగా 1లక్షా60వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనాలు వేసారు.
అన్నీ బానే ఉన్నాయి. కానీ 2022లో ప్రమాదం మీద పడింది. అలెగ్జాండర్ ఎలాగైతే యుద్ధం యావలో పడి తన సైన్యం ఆరోగ్యాన్ని ఎలా పట్టించుకోలేదో, రాబోయే బలమైన శత్రువుని ఎలా అంచనావెయ్యలేక చావుదెబ్బతిన్నాడో.. బైజూస్ రవీంద్రన్ కూడా డబ్బు యావలో పడి తన కంపెనీ ఫైనన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది పట్టించుకోలేదు, లీగల్ గా ఏ ప్రమాదం ఎదురుపడుతుందో అని అంచనా వెయ్యలేదు.
విదేశాలనుండి డబ్బు తెస్తున్నప్పుడు ఫారిన్ ఫండ్స్ రెగ్యులేషన్ యాక్ట్ కి లోబడి తీసుకోవాల్సిన కొన్ని అనుమతులు, కట్టాల్సిన కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని సమయానికి ఫైల్ చెయ్యలేదు. అంతే కాదు, తన బ్రాండ్ కి ఉన్న హైప్ ని మ్యాగ్జిమం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనే ఉద్దేశ్యమో ఏమో విదేశాల నుంచి మరింత పెట్టుబడులు తెచ్చుకోవాడానికి ఉవ్విళ్లూరాడు. లేని లాభాలు చూపించాడు. అలా తనకి తెలియకుండానే డబ్బు యావలో పడి చాలా తప్పులు చేసేసాడు.
వీటితో పాటూ ఆన్లైన్ లో నడుస్తున్న తన బిజినెస్ కి ఆఫ్లైన్లో కూడా ఉనికి ఉండాలనుకుని ఎక్కడ పడితే అక్కడ బైజూస్ సెంటర్స్ తెరిచాడు. అమెరికాలో కుమాన్ తెలియని వాళ్లుండరు. అక్కడ తమ పిల్లల్ని కుమాన్ ట్యూషన్స్ కి పంపని భారతీయులు ఇంచుమించు ఉండేవారు కాదు. సరిగ్గా అలాంటి ఇమేజ్ సంపాదించడానికన్నట్టుగా ఆఫ్లైన్లో బైజూస్ సెంటర్స్ తెరవడం, భారీ జీతాలిచ్చి ఫ్యాకల్టీని పెట్టుకోవడం….ఇవన్నీ తడిసి మోపెడయ్యాయి.
ఆశ పెద్దదైతే రిస్క్ పెద్దదౌతుంది. రిస్క్ పెద్దదైతే ప్రమాదమూ పెద్దగానే ఉంటుంది.
బైజూస్ హడావిడి చూసి అనుమానాలొచ్చిన ప్రభుత్వ సంస్థలు కొన్ని లొసుగులు లాగగానే ఆర్ధికపరమైన తప్పులు చాలా జరిగినట్టు గుర్తించారు. ఆ వెంటనే రైడ్ చేసారు. బండారం బైట పెట్టారు. ఒక్కసారిగా బైజూస్ పతనమయ్యింది. విదేశీ ఇన్వెష్టర్స్ భయపడి వెనక్కి తగ్గారు. ఇప్పుడు డబ్బు లేనిదే వ్యాపారం నడపలేని పరిస్థితి. దానికి తోడు ఆర్ధికనేరగాడిగా ముద్ర. చెదిరిన తన కల. రవీంద్రన్ కన్నీటిపర్యంతమయ్యాడు.
ఉద్దేశ్యపూర్వకంగా తాను తప్పు చెయ్యాలని దిగకపోయినా, కేవలం అత్యాశవల్ల బుద్ధి మారిపోయి అతని చేత తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని తప్పులు చేయించింది.
బైజూస్ రవీంద్రన్ స్టూడెంట్స్ కి పరీక్షల్లో ఎలా నెగ్గుకురావాలో పాఠాలు చెప్పాడు. అలాగే అత్యాశతో ఎలా ఓడిపొకూడదో తన జీవితంతో గుణపాఠం కూడా చెప్పాడు.
– పద్మజ అవిర్నేని