రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో భువ‌నేశ్వ‌రి!

ఎన్టీఆర్ త‌న‌య‌, చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి రాజకీయాల‌కు దూరంగా వుంటారు. ఆమె ఎప్పుడూ రాజ‌కీయ సంబంధ‌మైన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌రు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడికి వెన్నుద‌న్నుగా నిలిచేందుకు…

ఎన్టీఆర్ త‌న‌య‌, చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి రాజకీయాల‌కు దూరంగా వుంటారు. ఆమె ఎప్పుడూ రాజ‌కీయ సంబంధ‌మైన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌రు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడికి వెన్నుద‌న్నుగా నిలిచేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు టీడీపీ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయాల‌ని ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో మొట్ట మొద‌ట‌గా త‌న భ‌ర్త ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచే రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. వ‌చ్చే నెల మొద‌టి వారంలో కుప్పంలో భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టిస్తార‌ని ఎమ్మెల్సీ కంచ‌ర్ల శ్రీ‌కాంత్ తెలిపారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో మొబైల్ వైద్య సేవ‌లు, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై మ‌హిళ‌ల‌తో నిర్వ‌హించే స‌మావేశాల్లో భువ‌నేశ్వ‌రి పాల్గొని చైత‌న్య‌ప‌ర‌చ‌నున్నారు. అనంత‌రం తెలుగు యువ‌త చేప‌ట్టే సైకిల్ యాత్ర‌ను ఆమె ప్రారంభిస్తారు.

త‌న తండ్రి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కార్య‌క‌లాపాల‌ను చాలా కాలంగా ఆమె ప‌ర్య‌వేక్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ద‌ఫా టీడీపీ మినీ మ‌హానాడు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, వాటిని జ‌నాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని భువ‌నేశ్వ‌రి దిశానిర్దేశం చేయనున్నారు. 

అలాగే తెలుగు యువ‌త చేప‌ట్టే సైకిల్ యాత్ర‌ను భువ‌నేశ్వ‌రి ప్రారంభించ‌డం ద్వారా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటాన‌ని పార్టీ శ్రేణుల‌కి సంకేతాలు పంపిన‌ట్టు అవుతుంది. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డం, ఈ ద‌ఫా చావో బ‌తుకో తేల్చుకోడానికి సిద్ధ‌ప‌డాల్సిన స‌మ‌యం కావ‌డంతో భువ‌నేశ్వ‌రి తాను సైతం అనే రీతిలో ముందుకొస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.