జూన్ ఒకటి ప్రపంచ పాల దినోత్సవం. పాలు ప్రాముఖ్యతను గుర్తిస్తూ, పాడిపరిశ్రమ అభివృద్ధిని కోరుతూ ప్రపంచమంతా అనేక ఈవెంట్స్ జరుగుతాయి. ఇప్పుడైతే పాల ప్యాకెట్లు ఇంటికొస్తాయి, లేదంటే ఎప్పుడు కావాలన్నా పక్కన కిరాణా కొట్టులో దొరుకుతాయి. ఒకప్పుడు పాల కోసం కటకట.
50 ఏళ్ల క్రితం డెయిరీలు లేవు. పల్లెల్లో పాలు ఎంత దండిగా ఉన్నా పట్టణాలకి చేరే మార్కెటింగ్ సౌకర్యం లేదు. టౌన్లలో గేదెల పెంపకం తక్కువ కాబట్టి, సరిపోయేవి కావు. చుట్టూ పల్లెల నుంచి వందల మంది సైకిళ్లలో పాల క్యాన్లతో వచ్చేవాళ్లు. నీళ్లు కలిపే తెచ్చేవాళ్లు. వీళ్లలో ఇళ్లకి పోసే వాళ్ల కంటే హోటళ్లకి పోసేవాళ్లే ఎక్కువ.
పాలకి ఎంత డిమాండ్ అంటే హోటళ్ల వాళ్లు పాల వ్యాపారస్తులకి ముందుగా అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు. దాంతో పాలని ప్రతిరోజూ ఖచ్చితంగా పోయాలని షరతు. అయితే అడ్వాన్స్ తీసుకున్న వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి కనబడకుండా పోయేవారు. డబ్బుల వసూల్‌కి హోటల్ ఓనర్లు పల్లెలకు వెళ్లి పంచాయితీలు పెట్టేవాళ్లు. పండుగలు, పబ్బాలు వస్తే టౌన్లలో కాఫీ దొరికేది కాదు, ఎందుకంటే పాల వ్యాపారులు రారు కాబట్టి.
గుండమ్మ కథలో రమణారెడ్డి పాల వ్యాపారి. కుళాయి కింద క్యాన్ పెట్టి నీళ్లు కలుపుతాడు. పాలల్లో నీళ్లు ఎక్కువయ్యాయంటే మా గేదె నీళ్లు ఎక్కువ తాగింది అంటాడు.
టౌన్లలో నీళ్లు కలపని పాలకి డిమాండ్ ఎక్కువ. రేట్ కూడా ఎక్కువే. దీంట్లో మళ్లీ రెండు రకాలు. పాల వాళ్ల ఇంటికి చెంబు తీసుకుని వెళితే మన ముందే పితుకుతారు. లేదంటే గేదెని మన ఇంటి ముందుకు తెచ్చి పితికి ఇస్తారు. గేదెలకి ఇంజక్షన్లు వేయని కాలం.
మెల్లిగా ప్రభుత్వ డెయిరీలు వచ్చాయి. పాల బాటిళ్లు మొదలయ్యాయి. బాటిల్‌కి డబ్బు లు డిపాజిట్ చేస్తే ఇస్తారు. మనమే ఉదయాన్నే వెళ్లి ఖాళీ బాటిల్ ఇచ్చి పాల బాటిల్ తెచ్చుకోవాలి. నిద్ర లేవకపోతే పాలుండవు. బాటిల్స్ ప్లేస్‌లో పాకెట్లు వచ్చాయి. ప్రైవేట్ డెయిరీలు వచ్చాయి. పల్లెల నుంచి పాల క్యాన్ల వ్యాపారస్తులు తగ్గిపోయారు. ఇపుడు పల్లెల్లోనే పాలు దొరకవు. పట్టణాల్లో 24 గంటలూ దొరుకుతాయి. అయితే అవి పాలో, రసాయనాలో తెలియదు.
జీఆర్ మహర్షి