తెలుగుదేశం పార్టీలో అందగత్తెలు ఇమడలేకపోతున్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్లు జయప్రద, జయసుధ, రోజా, కవితలను పలువురు ఉదహరిస్తున్నారు. టీడీపీలో మహిళలు ఇమడలేకపోతున్నారని తాజాగా సీనియర్ నటి, ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన ఆరోపణలతో మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా హీరోయిన్ల కంటే అందమైన యామినీశర్మ ఉదంతాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా యామినీశర్మ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ కార్యక్రమాలకు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఢిల్లీ వేదికగా మోదీ సర్కార్‌పై సమరభేరి మోగిస్తే, ఆ కార్యక్రమంలో తెలుగు తల్లిగా యామినీ శర్మ వేషం ధరించి, టీడీపీకి సేవలందించారు.
టీడీపీపై జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యతిరేక ప్రచారాన్ని చేపడితే, ఆ పార్టీపై యామినీ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగించింది. మల్లెపూలు నలపడానికి తప్ప, పవన్‌కల్యాన్ ఎందుకూ పనికిరారని ఘాటు విమర్శలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ తర్వాత ఓ టీవీ డిబేట్లో జనసేన అధికార ప్రతినిధి దెబ్బకు, ఏకంగా ఆ చర్చను యామినీ బహిష్కరించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
టీడీపీ అంటే ప్రాణంగా ప్రేమించే యామిని …చివరికి ఆ పార్టీలోని కొందరి దుశ్చర్యలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని వాపోయారు. తనకూ భర్త, పిల్లలు, అత్తింటి వైపు, పుట్టింటి వైపు సభ్యులున్నారని, సోషల్ మీడియాలో సొంత పార్టీ వాళ్లే దుష్ప్రచారం చేయడం ఏంటని పలు ఇంటర్వ్యూల్లో వాపోయిన సంగతి తెలిసిందే. తనకు జరిగిన అన్యాయంపై అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు స్వయంగా ఆమె చెప్పారు.
లోకేశ్ పేరు చెబితే తీవ్రస్థాయిలో మండిపడే స్థాయికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా దివ్యవాణి తెరపైకి వచ్చారు. పార్టీలో కొందరు దుష్టశక్తులున్నారని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. గతంలో కవిత, రోజా, జయసుధ, జయప్రద తదితరులకు న్యాయం జరగలేదని, ఇప్పుడు వారి పరిస్థితే తనకు వచ్చిందని దివ్యవాణి సంచలన కామెంట్స్ చేశారు.
ఇలా టీడీపీలో బయటికి చెప్పుకోలేని మహిళా నేతలు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదో పార్టీ పెద్దలు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను పార్టీ నుంచి వెళ్లిపోయిన మహిళల ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అంటే గౌరవంగా చెబుతారు.
ఆ తర్వాత స్థాయి నేతలతోనే అసలు ఇబ్బంది అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతుండడం విశేషం. యామినీ శర్మ, దివ్యవాణి బయటికి చెప్పుకున్నారని, తాము చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నామనే మహిళా నేతలు లేకపోలేదు. రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే అనేక అవరోధాలను దాటుకోవాల్సి వుంటుంది.
ఒకవైపు మహిళలంటే ఎంతో గౌరవంగా చెప్పుకునే పార్టీలోనే, కొంత మంది నేతల చేష్టలు టీడీపీకి అప్రతిష్ట తెచ్చేలా వున్నాయి. ఇలాంటి ధోరణులపై పార్టీ పెద్దలు దృష్టి సారించాల్సి వుంది.