న‌డ్డి విరిచేందుకే వ‌స్తున్నారా?

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌పై ఉత్కంఠ నెల‌కొంది. న‌డ్డా ప‌ర్య‌ట‌న కీల‌క రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌నే చ‌ర్చ బీజేపీలో జ‌రుగుతోంది. ఏపీలో బీజేపీ బ‌లంగా లేని మాట వాస్త‌వం. అయితే…

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌పై ఉత్కంఠ నెల‌కొంది. న‌డ్డా ప‌ర్య‌ట‌న కీల‌క రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌నే చ‌ర్చ బీజేపీలో జ‌రుగుతోంది. ఏపీలో బీజేపీ బ‌లంగా లేని మాట వాస్త‌వం. అయితే బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌ను న‌డ్డి విరిచే స‌త్తా ఆ పార్టీకి ఉంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తుండ‌డ‌మే ఆ పార్టీకున్న ఏకైక బ‌లం.

ఏ మాత్రం తోక తిప్పినా క‌త్తెరించే ద‌ర్యాప్తు సంస్థ‌లైన సీబీఐ, ఈడీల‌ను మోదీ స‌ర్కార్ ఉసిగొల్పుతుంద‌నే భ‌యం ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఉంది. ఏపీలో జ‌న‌సేన‌తో బీజేపీకి పొత్తు వుంది. అయితే క్షేత్ర‌స్థాయిలో ఆ రెండు పార్టీలు సంయుక్తంగా చేస్తున్న కార్య‌క్ర‌మాలు ఏవీ లేవు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప‌ర్య‌ట‌న‌లో న‌డ్డాతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ కానున్నారు.

గ‌త మార్చిలో పార్టీ వార్షికోత్స‌వ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌నివ్వ‌న‌ని, అలాగే ముఖ్య‌మంత్రిని గ‌ద్దె దించేందుకు రోడ్‌మ్యాప్ ఇవ్వాల‌ని బీజేపీని ప‌వ‌న్ కోరారు. 

ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ ఎలాంటి రోడ్‌మ్యాప్ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తు వుండ‌ద‌ని బీజేపీ తేల్చి చెప్పింది. 2024లో జ‌న‌సేన‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేలా మెజార్టీ సీట్లు ద‌క్కించుకుంటామ‌ని బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్నారు.

ఈ నెల విజ‌య‌వాడ‌లో జాతీయ బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డాతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ కానున్నారు. బీజేపీ నేత‌ల‌తో న‌డ్డా అదే రోజు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై ఏపీలో బ‌ల‌ప‌డేందుకు మార్గ‌నిర్దేశం చేయ‌నున్నారు. సొంత పార్టీతో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా న‌డ్డా మార్గ‌నిర్దేశం చేయ‌నున్నార‌ని స‌మాచారం. టీడీపీతో సంబంధం లేకుండా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు అవలంబించాల్సిన వ్యూహం గురించి ప‌వ‌న్‌కు న‌డ్డా చెప్పే అవ‌కాశాలున్నాయి. 

ఇదే సంద‌ర్భంలో త‌న ఫీలింగ్స్‌ని న‌డ్డా ఎదుట ఆవిష్క‌రించ‌నున్నారు. మొత్తానికి రోడ్ మ్యాప్‌పై త్వ‌ర‌లో బీజేపీ క్లారిటీ ఇవ్వ‌నుంది. ఈ రోడ్ మ్యాప్ మాత్రం ఏపీ అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఏదో ఒక‌దాని న‌డ్డి విరిచే అవ‌కాశాలున్నాయి. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి రానున్న రెండేళ్ల‌లో బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.