కృష్ణకి 80 ఏళ్లు. గుర్రం మీద రెండు చేతులతో గన్స్ కాల్చుతూ తిరిగే కౌబాయ్ పెద్దాయన అయిపోయాడు. మా కాలం హీరో. ఆయన సినిమాలకి తెల్లారి 7 గంటల నుంచి క్యూల్లో నిలబడ్డాం (అప్పట్లో ఉదయం 8 గంటలకే షో). తోసుకున్నాం, బ్లాక్‌లో కొన్నాం. కృష్ణ ఎడమ చేత్తో ఫైట్ చేస్తూ వుంటే విజిల్స్ వేశాం. సినిమాల్లో పెద్దగా నవ్వించింది లేదు, ఏడిపించింది లేదు. అయినా కృష్ణని అభిమానించాం. ఎంతలా అంటే ప్రతి ఏడాది జ్యోతిచిత్ర వీక్లీ పోటీలో ఆయనే సూపర్‌స్టార్‌గా గెలిచేంత.
నాకు ఊహ వచ్చే సరికి (1970) స్కూల్లో సింగిల్ పార్టీ . NTR పార్టీ. గండికోట రహస్యం, భలేతమ్ముడు రాజ్యమేలుతున్న కాలం. కత్తియుద్ధం తప్ప ప్రేమ, ఎమోషన్ తెలియదు కాబట్టి ANR పైన పెద్ద దృష్టి లేదు. అయితే కృష్ణ కనిపిస్తే ఏదో ఉత్సాహం. ఆయన వుంటే ఫైట్ గ్యారెంటీ. అది చాలు మాకు. తమ్ముడు వేషాల్లో రఫ్ ఎంగ్‌బాయ్‌గా వుండేవాడు. హీరోగా కూడా కనిపించేవాడు. అల్లుడే మేనల్లుడు, సాక్షి ఇలా ఏవేవో వచ్చేవి కానీ నచ్చేవాడు కాదు. మహాబలుడు, ఇద్దరు మొనగాళ్లు ఇలాంటివి నచ్చేవి.
కృష్ణ విశ్వరూపం మోసగాళ్లకు మోసగాడులో కనిపించింది. ఇంట్లో వాళ్లతో కాకుండా సొంతంగా చూసిన సినిమా. ఫ్రెండ్స్ వాళ్ల అన్నయ్యలతో వెళ్లాను. సిగరెట్ల పొగలో, నేలపై ఒకరి మీద ఇంకొకరు కూచొని చూశాం. గుర్రం, గన్, రంగురంగుల డ్రస్, టోపీ, కృష్ణ మాస్టర్ పీస్ అది. అప్పటి వరకూ ఏడుపులు, చేంతాడు డైలాగ్‌లు, వెంకటేశ్వరుని వేడుతూ దేవిక పాటలు, అంజలీదేవి , సావిత్రి మెలోడ్రామా ఇవన్నీ చూసి విసిగిపోయిన నాలాంటి చిన్నపిల్లలకి ఎడారి, మంచుదిబ్బలపై పాటలు, ఎర్రకొండల్లో క్లైమాక్స్ ఇవన్నీ చూసి మైండ్ పోయింది.
ఆ తర్వాత వచ్చిన కృష్ణ సినిమాలన్నీ వరుసగా చూశాను. కౌబాయ్, జేమ్స్‌బాండ్‌లు కుప్పలుతెప్పలొచ్చాయి. నాసిరకం ఎక్కువ. కృష్ణ కొట్టక ముందే రౌడీలు పల్టీలు కొట్టేవాళ్లు. దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ చాలా స్టైలిష్‌గా వుంటాడు. అల్లూరిసీతారామరాజు మరిచిపోలేని జ్ఞాపకం. చిన్న వూళ్లలో దీని కోసం తెరలు వెడల్పు చేశారు (స్కోప్).
కొంచెం పెద్దాడినై ఎంటర్ ది డ్రాగన్ చూసేసరికి కృష్ణ చేసేవి అసలు ఫైట్స్ కాదని అర్థమైంది. అయినా కృష్ణ సినిమాలు చూడడం మానలేదు. అదో వ్యసనం. అనంతపురం రఘువీర టాకీస్‌లో మొదటి రోజు కృష్ణ సినిమా చూడడానికి పెద్ద క్యూలో నిలబడేవాన్ని. పరమ బోర్ సినిమాలు కూడా భరించేవాన్ని.
అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ సంచలనం సృష్టించింది “సింహాసనం”తో. షూటింగ్ ప్రారంభానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివెళ్లారు. అయితే అనుకున్నంత హిట్ కాలేదు. SPతో విభేదాల వల్ల అంత పెద్ద సినిమాకి రాజ్ సీతారాం అనే కొత్త గాయకుడితో కృష్ణ పాడించాడు. ధైర్యవంతుడు.
రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచాడు. NTRకి వ్యతిరేకంగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు.
వ్యక్తిగా కూడా కృష్ణ గొప్పవాడు. నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకునే వాడు. షూటింగ్‌లు ఆగిపోయి, ఇబ్బందుల్లో వున్న సినిమాలకి ఏదో రకంగా సాయం చేసేవాడు. కృష్ణ విజయనిర్మల దంపతులది ఆదరణ స్వభావం.
చిన్నప్పుడు సినిమా పిచ్చితో ఇల్లు వదిలి పారిపోయిన శ్రావణ్ అనే మిత్రున్ని చాలా కాలం ఇంట్లో పెట్టుకుని ఆదరించారు. అప్పుడు ఆయన వయసు 10 ఏళ్లు. జ్ఞాపకంగా తన పిల్లలకి కృష్ణ అనే పేరు ఉండేలా పెట్టుకున్నాడు. డిజెటిల్లు దర్శకుడు విమల్‌కృష్ణ, శ్రావణ్ కుమారుడే. విమల్ కృష్ణ సక్సెస్ వెనుక కృష్ణ దంపతుల ఆశీర్వాదాలున్నాయి. ఆ రోజు శ్రావణ్‌ని వాళ్లు ఆదరించకపోతే మద్రాస్ మహానగరంలో ఏమయ్యో వాడో?
రోజుకి 3 షిప్టులు పని చేసి వందల సినిమాల్లో నటించాడు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. మహేశ్ కూడా సినిమాల సంఖ్యని పెంచాలి. పెద్ద సినిమాల వల్ల చాలా మంది బతుకుతారు.
కొత్త తరానికి కృష్ణ ఒక చరిత్ర, నాలాంటి వాళ్లకి జ్ఞాపకం. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గుణం ధైర్యం.
జీఆర్ మహర్షి