ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ తదితర విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. వచ్చీరాగానే మళ్లీ ఢిల్లీ టూర్‌కు షెడ్యూల్ ఖరారైనట్టు సమాచారం. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మల తదితర ప్రముఖులను ముఖ్యమంత్రి జగన్ కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్టు సొంత మీడియా వెల్లడించింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు షెడ్యూల్ ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారు.
లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీకి భారీ మెజార్టీ వుంది. అత్యధిక పార్లమెంట్ సభ్యులున్న ఐదో పార్టీగా వైసీపీకి గుర్తింపు వుంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర అధికార పార్టీగా బీజేపీకి ఉన్న బలం చాలదు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సాయం అవసరం.
ఇదే సందర్భంలో తన ప్రభుత్వం ఆర్థికంగా మనుగడ సాగించాలంటే కేంద్రప్రభుత్వ సాయం జగన్‌కు ఎంతో అవసరం. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు చేసుకోడానికి కేంద్ర సహాయ నిరాకరణ నేపథ్యంలో తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి. ఇదే ఏపీ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు లాంఛనమే అని అందరికీ తెలుసు. అయితే పోలవరం, ఇతరత్రా ముఖ్యమైన ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సాయాన్ని కోరేందుకు ఇదే తగిన సమయంగా ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి, తగిన సాయం పొందడానికి ఢిల్లీ టూర్ ఉపయోగపడుతుందని వైసీపీ ఆశాభావంతో ఉంది.