మొన్ననే ది వారియర్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు రామ్. ఇంకా డబ్బింగ్, ప్రమోషన్.. ఇలా చాలా తతంగం ఉంది. కానీ అంతలోనే మరో సినిమా లాంఛ్ చేశాడు ఈ హీరో. ఈరోజు బోయపాటి దర్శకత్వంలో రామ్ చేయాల్సిన కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ తో బోయపాటి సినిమా ఎనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా ఈరోజు లాంఛ్ అయింది. స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా, ఎప్పట్లానే తొలి షాట్ కు దర్శకుడు బోయపాటి దర్శకత్వం వహించారు. దర్శకులు లింగుసామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.
రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. అంతేకాదు, రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. పక్కా కమర్షియల్, మాస్ హంగులతో ఈ సినిమా రాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
తన ప్రతి సినిమాలో హీరోల్ని కొత్తగా చూపించే బోయపాటి, రామ్ మేకోవర్ పై ఆల్రెడీ దృష్టి పెట్టాడు. వారియర్ పనులన్నీ పూర్తయిన వెంటనే మేకోవర్ మొదలవుతుంది. సినిమాలో హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.