Advertisement

Advertisement


Home > Politics - Opinion

తిరుపతి సౌజన్యారావు

తిరుపతి సౌజన్యారావు

కవి, రచయిత, అనువాదకులు, మంచి వక్త, గొప్ప వ్యాఖ్యాత, సాహితీ వేత్త శైలకుమార్. ఆయన చాలా మర్యాదస్తులుగా కనిపిస్తారు. పైకి ఎంతో సౌమ్యంగా అగుపిస్తారు. అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ, ఆయన అంతరంగంలో బడబాగ్నులుంటాయి, ఆగ్రహం ఉంటుంది. ఈ అసమసమాజం పట్ల, అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల ఉన్న ధర్మాగ్రహమే ఆ బడబాగ్నులు. అవి ఎప్పుడో దొర్లే మాటల్లో తప్ప, అప్పుడప్పుడూ చేసే వ్యాఖ్యానాల్లో తప్ప సహజంగా బైటపడవు. సమాజ మంచి చెడులపై ఎంతో స్పష్టత ఉన్న మనిషి.

తిరుపతిలో చదువుకునే రోజుల్లో విప్లవ విద్యార్థి, ఎమర్జెన్సీలో పజ్జెనిమిది నెలలూ ముషీరాబాద్ జైల్లో గడిపిన రాజకీయ ఖైదీ. ఎదురు దెబ్బలు తిని, వాటిని తట్టుకుని నిలబడ్డాక, తిరుపతిలో ఒక సౌజన్యారావుగా మనముందిలా నిలుచున్నారు. శైలకుమార్ మంచి చదువరి. తెలుగుతో పాటు సంస్కృతం కూడా చక్కగా చదువుకున్నారు. జీవితం తెలిసిన వ్యక్తి. అనేక నవలలు రాశారు. కవిత్వమూ రాశారు. రేణిగుంట జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేసే రోజుల్లోనే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. అప్పుడప్పుడూ కలిసేవాళ్ళం.

ఆ కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లోనే ఒక వివాదంలో చిక్కుకున్నారు. వివాదం శైలకుమార్ వల్ల వచ్చింది కాదు. ఆయన విద్వత్తుపట్ల ఇతరులకు  ఏర్పడ్డ ఈర్ష వల్ల వచ్చిన వివాదం. ఒకప్పుడు సంస్కృతంలో ఎవరైనా, ఏదైనా చెపితే అదే చివరి మాట అనుకునే వాళ్ళం. ఎందుకంటే మనకు సంస్కృతం రాదు కనుక. అలాగే ఇప్పుడు కూడా ఇంగ్లీషులో ఎవరైనా ఏమైనా చెపితే తిరస్కరించడానికి వీలులేని వాక్కుగా చెలామణి అవుతోంది. ఎందుకంటే  మనకు ఇంగ్లీషు సరిగా రాదు కనుక. మనకు తెలియని భాషలో ఎదుటి వారు దబాయిస్తారు. బుకాయిస్తారు. మనకు ఆ భాష తెలిసినా, ఆ భాష తెలియని వారి ముందు మనల్ని అధిగమించాలని చూస్తారు. మనకు నోరు లేకపోతే మనం ఓడిపోతాం. అలాంటి ఓటమిని ఎదిరించి నిలబడిన రచయిత శైలకుమార్.

రేణిగుంట జూనియర్ కాలేజీలో శైలకుమార్  లెక్చరర్  గా పనిచేసే రోజులవి. అప్పటికే రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారి రచనలు అనేక పత్రికల్లో వస్తున్నాయి. జయదేవుడి గీతగోవిందాన్ని తెలుగులో అనువాదం చేస్తే, ఉదయంలో డైలీ సీరియల్ గా వస్తోంది. శైలకుమార్ అంటే చాలా మందిలో లాగా ఒక సహ అధ్యాపకుడికి కూడా ఈర్ష్య ఏర్పడింది. శైలకుమార్ పైన కాలేజీ యజమానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడా అధ్యాపకుడు; అంతా బూతు రాస్తున్నాడని. ఆ యజమాని ఎవరో కాదు అగరాల ఈశ్వరరెడ్డి, శాసనసభ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకుడు. కాస్త చదువుకున్న వ్యక్తి, సంస్కృతం  రాదు. 

ఈశ్వరరెడ్డి శైలకుమార్ ని పిలిచి 'ఏంటి బూతులు రాస్తున్నావ్. మన కాలేజీ పరువేం కాను?” అని మందలించబోయారు. 'నేను బూతులు రాయడం లేదండి, జయదేవుడి గీత గోవిందంలో ఉన్నదే అనువాదం చేసి రాస్తున్నాను' అని గీత గోవిందాన్ని చదివి, దాని అర్థాన్ని విడమరచి చెప్పారు. 'అయినా నా కాలేజీలో పనిచేస్తూ, నా అనుమతి లేకుండా ఎలా రాస్తావు?' అని మెలికపెట్ట బోయారు. ఈశ్వరరెడ్డి సతీమణి డాక్టర్ రమణమ్మ భర్త వాదనకు అడ్డుతగిలారు. ‘శైలకుమార్ చేసిన తప్పేమిటి? గీత గోవిందంలో ఉన్నదే రాశారు కదా!' అని భర్త దగ్గర వాదించారు. భార్య వాదనకు ఈశ్వర రెడ్డి సమాధాన పడ్డారు. 'అనుమతి తీసుకుని రాయి. అనుమతి ఇస్తున్నా తీసుకో' అన్నారు. ఈ వివాదానికి కారణమైన మరో అధ్యాపకుడిని పిలిచి తిట్టి, మెమో ఇచ్చారు. ఈశ్వరరెడ్డి సతీమణి జోక్యం చేసుకోకపోతే, ఈశ్వరెడ్డి విజ్ఞత తో వ్యవహరించకపోతే చేయని తప్పుకు శైలకుమార్ కు ఉద్యోగం ఊడేదే.

అక్కడ నుంచి టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో  సబ్ ఎడిటర్ గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఎడిటర్ అయ్యారు. ఆ పత్రికకు చీఫ్ ఎడిటర్ కూడా అయ్యారు. వామపక్ష విప్లవ భావాల నుంచి వచ్చిన వ్యక్తి టీటీడీలో ఎలా పనిచేస్తారు? అని విమర్శ చేసే వారు చేశారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగమే చేయాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక్క‌డ ఉద్యోగాలన్నీ ఈ వ్యవస్థను నిలబెట్టేవిగానే ఉంటాయి. విప్లవ ఆలోచనలను వ్యాప్తి చేసే ఉద్యోగాలు ఎక్కడా ఉండవు.

మన చుట్టూ ఉన్న కుల వ్యవస్థ, అవినీతి, ఆశ్రిత పక్షపాతం పోవాలంటే సోషలిస్టు సమాజం రావాల్సిందే. అది రావాలంటే రాదు కదా! దాని కోసం కృషి చేయాలి. డిగ్రీ చదివే రోజుల్లోనే త్రిపురనేని మధుసూదన రావు ప్రసంగాలతో శైలకుమార్ ప్రభావితమై, విప్లవ రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యారు. రాష్ట్ర స్థాయిలో విప్లవ విద్యార్థి సంఘం ఏర్పాటు చేయాలనే ఆలోచన తిరుపతిలోనే మొదలైంది. మధుసూదన రావు, భూమ‌న కరుణాకర్ రెడ్డి (ప్ర‌స్తుత తిరుప‌తి ఎమ్మెల్యే), శివారెడ్డి (హైకోర్టు నాయ్యవాది) తదితరులతో పాటు, రాష్ట్రంలో మరికొందరితో కలిసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించారు. అలా ఆర్ఎస్ యు వ్యవస్థాపకుల్లో శైలకుమార్ ఒకరుగా చరిత్రలో నిలిచిపోయారు.

రాష్ట్రంలో ఎమర్జన్సీ విధించారు. కరుణాకర రె డ్డి, త్రిపురనేని మధుసూదన రావు తదితరులతోపాటు శైలకుమార్ ని కూడా అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లోపెట్టారు. చదువుకుంటున్న బిడ్డను జైల్లో పెడితే ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత క్షోభకు గురవుతుంది? ఆ క్షోభ, బాధ శైలకుమార్ ఇంట్లో కూడా వ్యక్తమైంది.

ఇదంతా గతానికి చెందింది. కరుణాకరరెడ్డి విప్లవ రాజకీయాలు స్వస్తి చెప్పినా ఆయనతో శైలకుమార్ స్నేహం కొనసాగుతునే ఉంది. వారిది శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం. కరుణాకరరెడ్డికి శైలకుమార్ నమ్మకమైన ఆంతరంగికుడు. శైలకుమార్ అంత ప్రతిభావంతుడు, నమ్మకస్తుడు, నిజాయితీ పరుడు దొరకడం కరుణాకర రెడ్డి అదృష్టం. ఆయన ఏ సాహిత్య కార్యక్రమాలు చేపట్టినా, ఏ కీర్తిని సాధించినా దాని వెనుక నీడలా శైలకుమార్ ఉంటారు.

కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజుల్లో తిరుపతిలో భాషా బ్రహ్మోత్సవాలు  అంగరంగ వైభవంగా జరిగాయి. ఒక పెద్ద పండగలా నిర్వహించారు. తెలుగులో ఉద్దండులైన సాహితీ వేత్తలను, కళాకారులను పిలిపించారు. వారి చేత ప్రసంగాలు, వారికి సన్మానాలు ఘనంగా జరిగాయి. ఆ వేదిక విజయవంతంగా నిర్వహించడంలో శైలకుమార్ పాత్ర ఎనలేనిది. గొప్పవక్తగా, మంచి ప్రయోక్తగా శైలకుమార్ గుర్తింపు పొందారు. చిన్న, పెద్ద అందరితో సౌమ్యంగా వ్యవహరించే శైలకుమార్ తిరుపతికి ఒక సౌజన్యారావు అనడంలో అతిశయోక్తి లేదు. (ఆదివారం ఉదయం 9.35 గంటలకు తిరుపతిలో శైల కుమార్ అభినందన సభలో 'మన శైల' ఆవిష్కరణ సందర్భంగా అందులోని కథనం)

-రాఘవ శర్మ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?