మంచి రుచికరమైన భోజనం తినాలంటే అనాయాసంగా దక్కుతుందా? మార్కెట్ నుంచి నాణ్యమైన కాయగూరలు, దినుసులు తెచ్చుకోవాలి.. కాయగూరలు తరగాలి.. ఇతరత్రా సరుకుల్లో నాణ్యతను చెక్ చేసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి. వండడంలో తూకం, పాకం తెలియాలి. అన్ని కూరలూ తయారు కావడానికి.. ఓ గంటో రెండు గంటలో కష్టపడాలి, నిరీక్షించాలి. అంతా అయ్యాక సూపర్ రుచికరంగా ఉంటుందనే గ్యారంటీ ఏమైనా ఉన్నదా? అన్ని సందర్భాల్లోనూ ఆ గ్యారంటీ లేనప్పుడు ఏం చేయాలి? ఎంచక్కా ఏ స్విగ్గీ, ఏ జొమాటో ద్వారానో ఆర్డర్ చేసుకుంటే ఓ పనైపోతుంది. ఎంచక్కా నచ్చిన రుచులతో విందుభోజనం తినేయొచ్చు. వంట చేతకానప్పుడు ఎవరైనా చేయగలిగిన పనిఅదే మరి!
ఈ వంటింటి పురాణానికి, టాలీవుడ్ సినిమాలకు సంబంధం ఏమిటా అనుకుంటున్నారా? వంట చేతగానివాళ్ల ‘నమో స్విగ్గీ’ సిద్ధాంతానికి ఫిల్మీ ప్రతిరూపమే రీమేక్ సినిమాలు. రీ మేక్ సినిమాలు ఎందుకు తయారవుతున్నాయి? ఎలా భ్రష్టుపడుతున్నాయి? అనే అంశాల మీద సాధికారిక విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘చేతగానివాళ్లు ఎంచుకునే అడ్డదార్లు.. రీమేకులు’!
‘రీమేక్ సినిమా’ అనేది ఎందుకు తయారవుతుంది? సినిమా ప్రియులను అడిగితే.. ఇంతకంటె పిచ్చి ప్రశ్న మరొకటి ఏదీ లేనేలేదని తప్పకుండా చెబుతారు. ఒక భాషలో వచ్చిన సినిమా అక్కడ గొప్ప సినిమాగా లేదా మంచి సినిమాగా ఆదరణ తెచ్చుకుంటే.. ఆ అద్భుతాన్ని మరో భాషా ప్రేక్షకులకు కూడా అందించాలనే సదుద్దేశంతో దాని రీమేక్ హక్కులు కొంటారు. ఉద్దేశం అదొక్కటే అయితే రీమేక్ ఎందుకు.. డబ్బింగ్ సరిపోతుంది కదా? అనే ప్రశ్న ఎదురవుతుంది! ఇదొక్కటే ఉద్దేశం అయితే, డబ్బింగ్ సరిపోతుందనేది నిజమే. కానీ.. రీమేక్ ప్రయోజనం అంతటితో అయిపోలేదు.
కొత్త భాషలో ఆ పరిశ్రమకు చెందిన మరో నటుడు ఆ చిత్రాన్ని చేసినప్పుడు.. అక్కడ మరింతగా పండుతుందని అనిపించినప్పుడు రీమేక్ మాత్రమే చేయాలి. లేదా.. ఆ చిత్రంలో చెప్పదలచుకున్న విషయాన్ని, అందించదలచుకున్న వినోదాన్ని తాము మరింత ప్రభావశీలంగా చేయగలమనే నమ్మకం ఉన్నప్పుడు, మాతృకను మరింత మెరుగ్గా రూపుదిద్దగలం అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అలాంటి రీమేక్ ప్రయత్నం చేస్తుంటారు. వీటన్నింటినీ మించి.. ఒక చిత్రం ఒక భాషలో కలెక్షన్లు కుమ్మేసిన తర్వాత.. అదే కనకవర్షాన్ని తాము కూడా పొందాలనే ఉద్దేశంతో రీమేక్ చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే మాతృక పైన చెప్పుకున్న కొలబద్ధల మీద ఎంతో బాగున్నదని అనుకున్న తర్వాతనే కదా.. దానిని రీమేక్ చేస్తారు. మరి అలాంటప్పుడు రీమేక్ చిత్రాలు ఎందుకు బాక్సాఫీసు వద్ద భ్రష్టుపట్టిపోతున్నాయి.
ఒక సినిమా రీమేక్ అవుతున్నదంటే.. అందుకు కారణం కాగలవని పైన చెప్పుకున్న అసలు కారణాలన్నీ పక్కదారిపట్టిపోతున్నాయి. అసలు కారణాలు వేరే ఉంటున్నాయి.
‘సేఫ్ జోన్’ అనే ముసుగు..
ఎవరెన్ని చెప్పినా.. మౌలికంగా సినిమా అంటే వ్యాపారం. డబ్బు పెట్టుబడి పెట్టడం- లాభం ఆర్జించడం అనేది అందరి ప్రయారిటీ ఇక్కడ. ‘సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షలకు అందిస్తున్నాం’ అనే పనికిరాని మాటలు అనేకం చెబుతూ ఉంటారు. అలాగని ఏ సందేశాత్మక, ఉద్యమ/పోరాటాల నేపథ్యం ఉన్న సినిమాలను రీమేక్ చేయరు. కమర్షియల్ గా విజయం సాధించగలవని నమ్మిన వాటిని మాత్రమే చేస్తుంటారు. మన వాళ్లకు ‘టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్’ సబ్జెక్టులు కావాలి. ఒక భాషలో ఆ సబ్జెక్టు మీద ఆ సినిమా విజయవంతం అయింది కాబట్టి.. దాని మీద నమ్మకం. సేఫ్ జోన్ లో ఉంటామని భావిస్తుంటారు. రిస్క్ ఎందుకు అనే ఆలోచన కూడా ఇతర భాషల నుంచి చిత్రాల్ని తెచ్చుకోవడానికి ప్రేరేపిస్తుంది.
ఇప్పుడంటే పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తో అందరు హీరోలు అన్ని భాషల్లో చేసేస్తున్నారు గానీ.. గతంలో రీమేక్ ల మీద వేలం వెర్రి ఇంకా చిత్రంగా ఉండేది. సంక్రాంతి (తమిళనాట పొంగల్) పండుగ వచ్చిందంటే చాలు! మన హీరోలు, నిర్మాతలు, దర్శకుల తరఫున ఏజంట్లు, వారి మేనేజర్లు పనిగట్టుకుని వెళ్లి మదరాసులో వాలేవారు. సినిమాలకు అది సీజన్ గనుక.. విడుదలైన అన్ని సినిమాలను చూసేవారు. సినిమా బాగున్నదని అనిపిస్తే చాలు.. హిట్ టాక్ స్ప్రెడ్ కాకముందే తమిళ నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చేసి రీమేక్ కు కర్చీఫ్ వేసేవాళ్లు. ఆ సినిమాను వీళ్లు తీస్తారా లేదా అనేది ఆ తర్వాత ఎప్పటికో డిసైడ్ అయ్యేది. అంత వెర్రి ఉండేది. కానీ సేఫ్ జోన్ అనే మాటతో రీమేక్ లను ఆశ్రయించడం అనేది చాలా సందర్భాల్లో ఒక మాయ, బూటకం!
రీమేక్ పిచ్చి.. నిలువెత్తు చేతగానితనం..
కొంచెం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే.. ఇప్పటితరంలో చాలా సందర్భాల్లో రీమేక్ ల కోసం ఎగబడడం అనేది సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకుల చేతగానితనానికి నిలువెత్తు రూపం అని చెప్పుకోవాలి. ప్రతి సినిమా ఇంతే అని అనలేం. అయితే.. గరిష్టంగా, రీమేక్ అనేది చేతగానివాళ్లు ఎంచుకునే అడ్డదారిగా మారిపోయింది.
ఎందుకిలా అయిందంటే.. అందుకు సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఒక రచయిత వచ్చి.. ఒక కథ తయారుచేసుకుని చెబితే ఆ కథ విని, దాని మంచి చెడులను పరిశీలించి, ఆ కథను తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తుందా లేదా అని జడ్జ్ చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు టాలీవుడ్ లో తగ్గిపోయారు. కథ విని ఎస్ ఆర్ నో చెప్పగల నిర్మాత లేడు. కథ విని తనకు అది నప్పుతుందా? లేదా? అని చెప్పగల హీరో లేడు! కటువుగా అనిపించినా అది నిజం. అందరూ ఒక మార్కెట్ మాయలో పడి బతుకుతూ ఉంటారు.
ఒక కొత్త కథతో ముందుకు వెళ్లడానికి ఖర్మగాలి నిర్మాత, హీరో సిద్ధపడ్డారంటే.. ఆ కథను మంచిగా తెరకెక్కించగల దర్శకుడు ఎవరనే విషయంలో వారికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ మధ్యకాలంలో ఒక అగ్రహీరో చారిత్రక నేపథ్యం ఉన్న ఒక కథను ఎంచుకుని, కథ వినగానే దర్శకుడిని వాటేసుకుని మరీ అభినందించి.. తీరా షూటింగ్ మొదలైన తర్వాత.. దర్శకుడిని మార్చేసి వేరేవారితో పనిచేయాలని ఆరాటపడడం వారి అపరిపక్వ తీరుకు నిదర్శనం. దర్శకుడికి నిజంగానే చేతకాకపోయి ఉండవచ్చు.. కానీ.. ఆ కథను ఆ దర్శకుడు చేయగలడా లేదా బేరీజు వేయలేకపోవడం దశాబ్దాల అనుభవం ఉన్న సదరు హీరో చేతగాని తనమే అవుతుంది కదా!
హీరోలకు కొత్త కథలు ఒప్పుకోవాలంటే భయం. దర్శకుల టేలెంట్ మీద అనుమానం. ఆ కథ మంచిదో కాదో చెప్పగల చేవ వారికి ఉండదు. ఇన్ని బలహీనతలు తమవే అయినప్పటికీ.. వాటిని మాయ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మాతృక మంచి చిత్రమే గానీ.. దానిని మరింత మెరుగైన మార్పులతో మన ప్రేక్షకులకు అందిస్తున్నాం.. అనే వంచనాత్మకమైన మాటలు చెబుతుంటారు. తమ తమ పిచ్చికొద్దీ ఆ మార్పులను ప్రారంభించి.. సర్వనాశనంచేసేస్తుంటారు. ఎన్ని ఇలా నాశనం అవుతున్నాయో అన్నింటినీ జాబితా కట్టలేం కాబట్టి.. ఇటీవలి భోళాశంకర్, బ్రో వంటి మరికొన్ని చిత్రాల పరాజయాలనే ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించారు. లూసిఫర్ విషయం మరీ చిత్రం. ఆ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో సమస్త తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత.. మెగాస్టార్ మొదలెట్టారు. మాతృకలో లేని కమర్షియల్ ప్యాడింగ్ కోసం సల్మాన్ ఖాన్ ను తీసుకువచ్చారు. ఈ టక్కు టమారాలు పనిచేయలేదు. సినిమా నాశనం అయిపోయింది. పవన్ కల్యాణ్ చేసిన వకీల్ సాబ్ సంగతి తీసుకుంటే.. తెలుగు సినిమా బాగానే ఆడింది. కానీ.. మాతృక ‘పింక్’తో పోలిస్తే.. ‘ఏదో మిస్సయిపోయిందనే’ బాధ కలుగుతుంది. రీమేక్ తీయడం చేతకానివాళ్లంతా చెప్పే మాట మరొకటి కూడా ఉంటుంది. ‘దీనిని ఒరిజినల్ తో పోల్చి చూడొద్దు.. వేరే సినిమాలాగానే చూడండి..’ అని!
ఇంతగా పరభాషా చిత్రాల మీద ఆధారపడాల్సిన అగత్యం చిరంజీవికి ఏమిటి? ఆయన కోసం కథలు తయారు చేయగలవారు తెలుగు ఇండస్ట్రీలో లేనే లేరా? అనేవి సందేహాలు. చిరంజీవి మీద నిందకోసం అంటున్న మాటలు కావివి. టాలీవుడ్ మెగాస్టార్ గనుక.. ఆయన పేరు ద్వారా.. యావత్ పరిశ్రమను అంటున్న మాటలు. వరుసగా రీమేక్ లు మాత్రమే చేయడం అంటే.. తెలుగు టెక్నీషియన్స్ ని అవమానించినట్లు అవుతుందనే స్పృహ ఇంత పెద్ద స్టార్ కు లేకుండాపోయిందా?
ఎందుకు భ్రష్టు పడుతున్నాయి?
మనకు మాత్రమే కాదు.. సినిమాకు కూడా ఒక ఆత్మ ఉంటుంది. మన ఆత్మలాగానే అది కూడా కనిపించదు. రీమేక్ చేసే వాడు ఆ ఆత్మను పట్టుకోగలగాలి. అది మనవారిలో మిస్సవుతోంది. అమితాబ్ చేసిన ‘పింక్’ సినిమాను తీసుకుని.. పవన్ భ్రష్టుపట్టించిన సంగతి అదే. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మన హీరోలకు ఫస్ట్ ప్రయారిటీ సినిమా కాదు. సినిమా మీద వారికి ప్రేమ ఉండదు. సినిమాకు ఉండే ‘ఆత్మ’ మీద వారికి గౌరవం ఉండదు.
సినిమా ద్వారా తాము నెరవేర్చుకోవాలని అనుకుంటున్న వక్ర ప్రయోజనాలు సవాలక్ష ఉంటాయి. వాటన్నింటినీ.. తాము చేసే ప్రతి సినిమాలోనూ చొప్పించడానికి ప్రయత్నిస్తారు. ‘వకీల్ సాబ్’ సైడ్ ట్రాక్ పట్టిపోయి దీనజనోద్ధారక యాక్షన్ ఎపిసోడ్ వేషాలు వేసినా.. ‘బోళా శంకర్’ చవకబారు శైలిలో ఖుషిలోని అర్థం పర్థంలేని ఎపిసోడ్‌ను రీక్రియేట్ చేసినా.. అవన్నీ కూడా సినిమాలో ఉండే ఆత్మను చంపేసే భ్రష్టాచారానికి నిదర్శనాలే.
ఈ హీరోలకు తమ మీద తమకు నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. ఇలాంటి భయంతో చిన్న హీరోలు, అప్పుడే ఎంట్రీ ఇస్తున్న వారు రీమేక్ మీద ఆధారపడడం సహజం. ఎందుకంటే.. తమకంటూ ఒక నేపథ్యం, ఇమేజి ఏదీ ఉండదు గనుక.. మరోచోట హిట్టయిన చిత్రాన్ని తెచ్చుకుని.. దాని ద్వారా తమకు ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం వారిలో ఉంటుంది. అలాంటి వారు లోబడ్జెట్ మంచి చిత్రాలనే ఎంచుకుని, జాగ్రత్తగా రూపొందించుకుని తమ అవసరం తీర్చుకుంటారు. కానీ దశాబ్దాల అనుభవం ఉన్నవారికి ఇలాంటి ఖర్మ ఎందుకు?
నటులు, నిర్మాతలు కథలను విని వాటిని జడ్జ్ చేయగల శక్తిని సంపాదించుకోవాలి. దర్శకుడి మేకింగ్ సామర్థ్యాలను బేరీజు వేయగల శక్తి వారికి ఉండాలి. అది లేనంత వరకు ఎంత పెద్దవాళ్లయినా.. ‘రిస్క్ ఎందుకు’ అనే ముసుగు వేసుకుని.. రీమేక్ ల మీదనే ఆధారపడుతుంటారు. మంచివి అనుకున్న చిత్రాలను కూడా భ్రష్టు పట్టించేసి.. మేకింగ్ లో నాశనం చేయగల ప్రతిభావంతులు తాము అని టాలీవుడ్ పరువు తీసేస్తుంటారు.
..ఎల్. విజయలక్ష్మి