Advertisement

Advertisement


Home > Politics - Opinion

వీర‌య్య ...మార‌య్యా...లేదంటే బోర‌య్యా!

వీర‌య్య ...మార‌య్యా...లేదంటే బోర‌య్యా!

వీర‌సింహారెడ్డితో క‌త్తి పోట్లు తిన్న త‌ర్వాత వాల్తేరు వీర‌య్య ద‌గ్గ‌రికెళ్లాను. ఆయ‌న తుపాకీతో ఎడాపెడా కాల్చాడు. ర‌క్త‌గాయాల‌య్యాయి. నాకే కాదు, ప్రేక్ష‌కుల‌కి కూడా! చిరంజీవిని కొత్త‌గా చూడ‌డానికి రూ.300 టికెట్ పెట్టాం కానీ పాతికేళ్ల క్రితం చిరంజీవిని చూడ్డానికి కాదు. ఈ విష‌యం చిరంజీవికి తెలియ‌క ఫ్యాన్స్ కోస‌మంటూ పాత చిరంజీవినే చూపించాడు.

పాత చిరంజీవి కావాల‌నుకుంటే యూట్యూబ్‌లో పాత సినిమాలే చూస్తాం. మ‌ళ్లీ మాకు డ‌బ్బులెందుకు దండుగ‌! ఒక ద‌శ దాటితే నాయ‌కుల‌కీ, హీరోల‌కీ భ్ర‌మ‌లు పుట్టుకొస్తాయి. వాస్త‌వం అర్థం కాదు. కేసీఆర్ దేశ వ్యాప్త పార్టీ పెట్టి గెలిచిపోతాన‌ని భ్ర‌మ‌లో ఉన్న‌ట్టు చిరంజీవి కూడా ఇంకా త‌న‌కి వీర లెవెల్‌లో ఫ్యాన్స్ వున్నార‌నే భ్ర‌మ‌లో ఉన్నాడు. అస‌లు చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఎవ‌రు?

నేను అస‌లుసిస‌లు చిరంజీవి ఫ్యాన్‌ను. పునాదిరాళ్ల‌లో గుర్తు ప‌ట్ట‌లేదు కానీ, ప్రాణం ఖ‌రీదులో ఈయ‌నెవ‌రో డిఫ‌రెంట్‌గా వున్నాడ‌నిపించింది. తాయార‌మ్మ బంగార‌య్య‌లో చిరంజీవి క‌నిపించే కొన్ని నిమిషాల కోసం రెండుసార్లు చూసాను. మ‌న‌వూరి పాండ‌వుల్లో సూదంటురాయిలా ఆకర్షించాడు. ఇది క‌థ కాదులో విల‌న్ అయినా న‌చ్చేసాడు. త‌ర్వాత చిరంజీవి ప‌రిణామ క్ర‌మం అంతా ఒక చ‌రిత్ర‌. అయితే ప్ర‌తిదానికీ ఒక టైమ్ వుంటుంది. చిరంజీవి ఇండ‌స్ట్రీని ఏలాడు. కానీ ఎప్పుడూ తానే ఏలాల‌నుకుంటే ప్ర‌కృతి ఒప్పుకోదు. కొత్త‌నీరుకి దారిచ్చి పాత‌నీరు త‌ప్పుకోవాలి. ఇది రూల్‌.

అయితే చిరంజీవి ఏం చేస్తున్నాడంటే గౌర‌వంగా త‌ప్పుకోవాల్సింది పోయి ఇంకా న‌టిస్తున్నాడు. అది సినిమా మీద ఆయ‌న‌కున్న ఆక‌ర్ష‌ణ కావ‌చ్చు, వ్యామోహం, భ‌క్తి, ప్రేమ‌, ఇష్టం ఏదైనా కావ‌చ్చు. అయితే తాను ఇంకా హీరోన‌ని అనుకోవ‌డం ఆయ‌న భ్ర‌మ‌, భ్రాంతే. అన్ని కాలాల్లోనూ యువ‌త‌ర‌మే ఎక్కువ‌గా సినిమాలు చూస్తుంది. వాళ్లంతా ఒక‌ప్పుడు చిరంజీవి కోసం చొక్కాలు చింపుకున్నారు. ఇప్ప‌టి త‌రం వాళ్ల‌కి చిరంజీవి తెలుసు, కానీ వాళ్లు ఆయ‌న ఫ్యాన్స్ కాదు. ఆయ‌న అస‌లైన అభిమానుల‌కి 50 ఏళ్లు దాటిపోయాయి. ఆయ‌న‌కి 60 దాటాయి. అయినా శ్రుతిహాస‌న్ ప‌క్క‌న స్టెప్పులేస్తుంటే జ‌నం ఈల‌లు వేయ‌డం లేదు. లేచి వెళ్లిపోతున్నారు. ఈ విష‌యం చిరంజీవికి ఎవ‌రూ చెప్ప‌రు. చుట్టూ వున్న భ‌జ‌న బృందం ఆయ‌న్ని అద్భుతం అని కీర్తిస్తూ వుంటుంది. త‌న‌ స్టెప్పుల‌కి జ‌నం ఊగిపోతున్నార‌ని ఆయ‌న న‌మ్ముతూనే వుంటాడు.

అమితాబ్‌లా ట్రెండ్ మార్చుకోండి, లేదంటే మానేయండి. ప్రేక్ష‌కులకే కాదు, మీకూ న‌ష్టం లేదు. వాల్తేరు వీర‌య్య‌లో మీరేం అద్భుతాలు, కొత్తద‌నం చూపించారు?  ముత‌క‌వాస‌న వ‌చ్చే క‌థ‌, మొహంమొత్తే డ్ర‌గ్ మాఫియా, ప్ర‌కాశ్‌రాజ్‌కే బోర్ కొట్టే విల‌నీ, అన‌వ‌స‌ర‌మైన బిల్డ‌ప్ డైలాగ్స్‌. సినిమాలో ప్రేక్ష‌కుల్ని ఇన్వాల్వ్ చేయ‌కుండా, మిమ్మ‌ల్ని వీర‌య్య‌లా గుర్తించ‌కుండా ప‌దేప‌దే మీ మెగా హిస్ట‌రీ డైలాగ్స్‌. ర‌వితేజ వ‌చ్చి ఏదో చేస్తాడనుకుంటే అది వ‌ర్కౌట్ కాలేదు.

చిరంజీవి సార్, మీకు చేత‌నైతే ఇమేజ్ నుంచి బ‌య‌టికొచ్చి కొత్త క‌థ‌లు ఎంచుకోండి. లేదంటే రిటైర్‌ అయిపోండి. మీరు సినిమాలు చేయ‌క‌పోయినా తెలుగువాళ్లు మిమ్మ‌ల్ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వీర‌య్య లాంటి రొటీన్‌, మొనాట‌ని, బోర్ సినిమాలు చేసి అంద‌రికీ దూరం కావ‌ద్దు. మీరు ఒక చ‌రిత్ర‌. కొత్త‌గా మీకు చ‌రిత్ర అక్క‌ర్లేదు. తెలుగు వాళ్లు మిమ్మ‌ల్ని నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ల‌కి శిరోభారం కావ‌ద్దు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?