ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భోగి పండుగను కూడా రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. తెలుగు సంప్రదాయం ప్రకారం భోగి మంటలు వేసి, సంబరాలు చేసుకుంటారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పీకలదాకా అక్కసుతో వున్న టీడీపీ, భోగిని రాజకీయం కోసం వాడుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల్లో జీవో నంబర్-1 ప్రతుల్ని కాలుస్తూ, తమ నిరసనను ప్రకటించడం గమనార్హం.
ఇటీవల కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాటల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో పట్టణాలు, నగరాల్లోని రోడ్లు, ఇరుకు సంధుల్లో సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు కఠిన నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. తన సభలకు జనం వెల్లువెత్తుతుండడం వల్లే అడ్డుకోడానికి జగన్ సర్కార్ జీవో నంబర్-1 తీసుకొచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ జీవోపై చంద్రబాబు వీరాభిమాని రామకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఈ నెల 23వ తేదీ వరకూ దాన్ని సస్పెండ్ చేయడం తెలిసిందే.
ఇంకా హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జీవో ప్రతుల్ని తగులబెట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో భోగిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం చర్చకు దారి తీసింది. కాదేదీ రాజకీయానికి అనర్హమని టీడీపీ నిరూపించిం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భోగి రోజు అదో తుత్తి అని అధికార పార్టీ సెటైర్స్ విసురుతోంది. మొత్తానికి ఏపీలో ప్రతిదీ రాజకీయంగా వాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.