ఒక పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావాలంటే.. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. రాష్ట్రంలో సంఖ్యపరంగా ఒక పెద్దకులానికి చెందిన వాడు కావడమో, రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లగల ధన బలం ఉండడమో, వర్గబలం ఉండడమో ఏదోటి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో వెరైటీ క్వాలిఫికేషన్లు కూడా పెద్దపదవులకు దారితీస్తాయి.
ఆ రకంగా ఒకప్పట్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కీలక కుట్ర చేయడం అన్నదే ప్రధాన క్వాలిఫికేషన్ గా ఇప్పుడు ఓ నాయకుడు.. ఒక రాష్ట్రానికి భారాస అధ్యక్షుడు అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వంటి హోదాలు కూడా ఉన్నప్పటికీ.. కేసీఆర్ వెతుకుతున్న క్వాలిఫికేషన్ల పరంగా చూసినప్పుడు.. ఒకప్పట్లో బిజెపిని కూలదోసిన ఘనతే ఆయనకు అతిపెద్దదని అనుకోవాల్సి వస్తుంది.ఇదంతా ఒరిస్సాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ గురించి.
1999లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం ఉంది. అప్పట్లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అయిన గమాంగ్.. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఒరిస్సా సీఎంగా వెళ్లి అక్కడి బాధ్యతలలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 17న వాజపేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. సరిగ్గా బలాలు సమానం అయ్యాయి. ఒక్కఓటు ప్రభుత్వాన్ని నిర్ణయించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గమాంగ్ ఓటు వేయకూడదని కొందరు.. ఆయన ఇంకా ఎంపీగా రాజీనామా చేయలేదు గనుక.. ఓటు వేయచ్చునని కొందరు వాదించారు. నిర్ణయం ఆయన విచక్షణకు వదిలేశారు.
గమాంగ్ ఏమాత్రం సిగ్గుపడకుండా.. తాను ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా.. లోక్ సభకు వచ్చి వాజపేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సర్కారు కూలిపోయింది. అలా ఆయన పేరు ఒక చారిత్రాత్మక ఘట్టంలో కీలకంగా నిలిచిపోయింది.
2009లో ఓడిపోయిన తర్వాత గమాంగ్ కాంగ్రెస్ కు దూరం అయ్యారు గానీ.. తమాషాగా 2015లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిజెపిలో చేరారు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న గమాంగ్, కేసీఆర్ ను కొడుకుతో సహా కలిశారు. ఆయనను పార్టీకి ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించి సారధ్య బాధ్యతలను అప్పగించారు.
తన కొడుకుకు కూడా మంచి పదవి ఇవ్వాలంటూ.. పాపం ఈ 79 ఏళ్ల నాయకుడు కేసీఆర్ కు విన్నవించుకోవడం విశేషం. ఒకవైపు పార్టీలన్నీ యువనాయకత్వం వైపు ఉరకలు వేస్తున్నాయి. బిజెపి కూడా 75 దాటిన వారిని పార్టీ పనులకు మాత్రం పరిమితం చేయాలనుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో 79 ఏళ్ల సారధితో కేసీఆర్ ఒరిస్సాలో ఏం సాధిస్తారో చూడాలి.