తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి పార్టీలో ప్రస్తుతం లూప్ లైన్లో ఉంది. తాను ఎమ్మెల్యేగా ఉండగా మరొకరిని ఇన్చార్జిగా నియమించి పార్టీ ఆమెకు ఆ లూప్ లైన్ విషయంలో చాలా స్పష్టత ఇచ్చింది. నియోజకవర్గంలో సొంత కోటరీ తప్ప.. చాలా మంది పార్టీ నాయకులు ఆమెను లెక్క చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కాస్త దూకుడుగా వ్యవహరించి చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి మరోసారి పరువు పోగొట్టుకుంది. తాడికొండ మార్కెట్ కమిటీ నియామకాల్లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవిపై అనేక రకాల ఆరోపణలున్నాయి. సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఎన్ని వెల్లువెత్తినా చూసీ చూడనట్టు వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి కూడా భరించలేనన్ని ఆరోపణలు ఆమె మీద వచ్చాయి. పేకాట క్లబ్ లు, ఇసుక దందాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా కలిసి.. పార్టీ ఆమెను లూప్ లైన్లో పెట్టింది. ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే నియోజకవర్గంలో మరో ఇన్చార్జిని నియమించారు.
తొలుత డొక్కా మాణిక్యవరప్రసాద్ ను పెట్టగా, తర్వాత అత్యంత వివాదాస్పద చర్చి ఫాదర్ కత్తెర సురేష్ కుమార్ ను జగన్ అక్కడ ఇన్చార్జి చేశారు. ఆయన తన వర్గంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో శ్రీదేవి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈనేపథ్యంలో తాడికొండ మార్కెట్ కమిటీ వ్యవహారం తెరమీదకు వచ్చింది.
కమిటీ పదవుల కోసం ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి ఒక జాబితాను, పార్టీ ఇన్చార్జి కత్తెర సురేష్ కుమార్ మరొక జాబితాను అధికార్లకు ఇచ్చి ఆజాబితాలనే ప్రకటించాలని కోరారు. ఏం జరిగిందో ఏమో గానీ.. ఉండవిల్లి శ్రీదేవి ఇచ్చిన జాబితా పేర్లను మార్కెట్ కమిటీకి ప్రకటిస్తూ అధికార్లు ఉత్తర్వులు జారీచేశారు. లూప్ లైన్లో ఉన్నప్పటికీ కూడా శ్రీదేవి తన మాట నెగ్గించుకున్నదని అంతా అనుకున్నారు.
ఈలోగా వ్యతిరేకవర్గం రెచ్చిపోయింది. ఆమె చెప్పిన పేర్లకు పదవులు ఎలా ఇస్తారని, ఇలాగైతే పార్టీని వీడిపోతాం అని ప్రకటనలు చేసింది. శ్రీదేవి చాలా జాగ్రత్తపడుతూ.. ప్రకటించిన జాబితాతో తక్షణం ప్రమాణ స్వీకారం చేయించాలంటూ అధికార్లపై ఒత్తిడి తేవడంతో మార్కెట్ యార్డు కార్యదర్శి రజని సెలవుపై వెళ్లిపోయారు. ఆమె పట్టుపట్టి మార్కెటింగ్ శాఖ ఏడీ రాజాబాబుతో ప్రమాణంచేయించేశారు. అక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు.
ఈలోగా కత్తెర సురేష్ కుమార్ చక్రం తిప్పుతూ వచ్చారు. ఉదయం ప్రమాణ స్వీకారం జరిగితే.. సాయంత్రంలోగా.. అసలు ఆ నియామకపు ఉత్తర్వులనే అబేయెన్స్ లో పెట్టించారు. శ్రీదేవి వర్గానికి చెందిన నాయకులకు పదవి దక్కిందనే ఆనందం అస్సలు లేకుండాపోయింది. అసలే లూప్ లైన్లో ఉన్న శ్రీదేవికి ఈ మార్కెట్ కమిటీ గొడవతో అదనంగా పరువుపోయింది.