Advertisement

Advertisement


Home > Politics - Opinion

వీరసింహుడిది వాపు- వీరయ్యది బలుపు

వీరసింహుడిది వాపు- వీరయ్యది బలుపు

ఈ పండక్కి రెండు పెద్ద సినిమాలు వీర లెవెల్లో పోటీ పడ్డాయి. ఒకటి "వీర సింహా రెడ్డి", రెండు "వాల్తేర్ వీరయ్య". 

ఈ రెండు సినిమాలూ ఒకటే బ్యానర్ నుంచి రావడం, రెండింటిలోనూ హీరోయిన్, ఫైట్ మాస్టర్స్ ఒకరే కావడం విశేషం. 

ఫైట్ మాస్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకంటే రెండు సినిమాల్లోనూ అగ్రభాగం యాక్షనే ఉంది కనుక. 

అంతే కాదు కథకి సంబంధించిన గ్రాఫ్ కూడా రెండింటికీ ఒకటే ఉండడం మరొక విశేషం. 

వీరసింహలో చెల్లెలి సెంటిమెంటైతే, వీరయ్యలో తమ్ముడి సెంటిమెంట్. అక్కడ ఇస్తాన్ బుల్, ఇక్కడ మలేషియా. అక్కడ, ఇక్కడ తోబుట్టువుల చావులు. రెండింటిలోనూ బీహెడింగ్ సీన్స్. 

అయితే బాలకృష్ణ తన సహజసిద్ధమైన సీరియస్ యాక్షన్ పద్ధతిని ఎంచుకుంటే, చిరంజీవి తన ప్రత్యేకత అయిన డ్యాన్సులు మరియు సటిల్ కామెడీకి ప్రధాన్యమిచ్చి నటించడం జరిగింది. 

ఎలా లెక్కేసుకున్నా కంటెంట్ పరంగా ఒకదాని కంటే మరొకటి గొప్పదని చెప్పడం పక్షపాతమనిపించుకుంటుంది. దొందూ దొందే. 

రెండూ ఒకే తరహా సినిమాలైనప్పటికీ, ఒకే సీజన్లో వచ్చినప్పటికీ ఒకదానికే ప్రేక్షకులు ఎందుకు మొగ్గు చూపుతున్నారో చర్చించుకుందాం. దీని కోసం ముందుగా అమెరికా లెక్కలు మాట్లాడుకుందాం. 

"వీర సింహా రెడ్డి" తొలి రోజు చేసిన కలెక్షన్ $708,472 (311 లోకేషన్స్ నుంచి). రెండవ రోజున అమాంతం పడిపోయి $39,124 (144 లొకేషన్స్ నుంచి) నమోదయ్యింది. మళ్లీ మూడవ రోజు కాస్త లేచి $68,956 (257 లొకేషన్స్ నుంచి) దగ్గర ఆగింది. 

ఇక్కడ మనం గమనించాల్సింది మొదటి రోజుకి.. రెండవ, మూడవ రోజులకి అంత డ్రాప్ ఏవిటా అని. ఇక్కడే ఎన్నారై కమ్మవారి మాయాజాలం బయటపడేది. 

సినిమా పరంగా ప్రస్తుతం బాలకృష్ణ కమ్మవారి కులదైవం. తమ జాతి ఉనికిని అతని సినిమా కలెక్షన్స్ రూపంలో చూసుకుని స్వయంతృప్తి చెందే దయనీయ స్థితిలో ఎన్నేళ్లనుంచో ఉన్నారు. అందుకే మూకుమ్మడిగా దేవుడి హుండీలో డబ్బేసినట్టు రికార్డ్ నెలకొల్పడానికి తొలి రోజు బల్క్ లో టికెట్స్ బుక్ చేసి కాలర్లెత్తారు. కానీ అదంతా వాపు కాబట్టి మర్నాడు, మూడొనాడు తుస్సుమంది. వరసపెట్టి వారోత్సవాలు చేసినట్టు రోజూ బల్కులో కొనాలంటే ఎంత కులపిచ్చ ఉన్నా కష్టమే కదా. అందుకే ప్రీమియర్ కలెక్షన్స్ వరకు చాల్లే, ఫాలో అప్ ఎవడూ చేయడులే అనుకుని అక్కడితో ఆపారు. బండారం బైట పెట్టుకున్నారు. 

మొత్తానికి నాలుగో రోజు ముగింపుకి $848,668 వరకు లాగింది. కనుక ఏదో రకంగా $1 మిలియన్ చేయడానికి అంతర్గత సమావేశాలు పెట్టుకుని చందాలేసుకుని ఆ టార్గెట్ రీచవ్వడాలు జరుగుతాయి.

ఆ నెంబర్ చూపించి "ఇదిదో మా వోడు మిలియన్ కొట్టాడు" అని తొడచరుపులకే ఇదంతా! అందుకే బాలకృష్ణంటే సౌండెక్కువ విషయం తక్కువ అని యావన్మంది తెలుగు ప్రజానీకానికి తెలిసిపోతోంది. తావీజు మహిమో, చేతికి పెట్టుకున్న ఉంగరాల మహత్యమో, నమ్ముకున్న జోతిష్య ఫలితమో గానీ కమ్మవారంతా అతన్ని ఓన్ చేసుకుని ఊరేగించి, స్టిరాయడ్స్ వాడి ప్రాణాన్ని నిలబెడుతున్నట్టు డబ్బు ఖర్చు పెట్టి మరీ అతని కెరీర్ ని మోస్తున్నారు. 

ఈ డబ్బు ఖర్చుపెట్టడమనే ఆలోచన, తెగింపు కమ్మవారితో పోలిస్తే కాపులకి చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే క్యాస్ట్ ఫీలింగుతో గుండెలనిండా అభిమానంతో చిరంజీవిని జీవితాంతం మొస్తారు తప్ప కమ్మవారిలాగ డబ్బు ఖర్చుపెట్టి పర్సెప్షన్ గేం ఆడలేరు. ఎందుకు అని అడిగితే వివరంగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆ చర్చ అనవసరం. చరిత్రలో కనిపిస్తున్నది మాత్రం ఇదే. 

అందుకే "వాల్తేర్ వీరయ్య" కి తొలి రోజు $679,036 (316 లొకేషన్స్ నుంచి) నమోదైతే రెండవ రోజు $308,911 (322 లొకేషన్స్ నుంచి) నమోదయ్యింది. ఇదీ బలుపంటే. మొదటి రోజుకి రెండవ రోజుకి సగం తేడా ఉండడం సహజం. అది నిజమైన బలానికి సంకేతం. ఇది కాపులు డబ్బిచ్చి కొంటే వచ్చింది కాదు. ఒకటి కాపులకంత శక్తి, కుయుక్తి లేవు..రెండోది కాపులొక్కరే చిరంజీవి అభిమానులు కారు. నేచరల్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వచ్చిన కలెక్షన్ అది. బాలకృష్ణకి కమ్మేతర ఫ్యాన్స్ చిరంజీవికున్న కాపేతర ఫ్యాన్స్ తో పోలిస్తే చాలా తక్కువ. 1కి 100కి ఉన్నంత తేడా ఉండొచ్చు. 

అందుకే బాలకృష్ణ 10కోట్ల హీరోగా మిగిలాడు. చిరంజీవి 50కోట్ల హీరోగా కొనసాగుతున్నాడు.

మొత్తానికి రెండో రోజు ముగింపుకే $991,771 చేసేసి దాదాపు $1 మిలియన్ మార్క్ కి చేరువైపోయింది "వాల్తేరు వీరయ్య". ఏ స్టిరాయడు అవసరం లేకుండా నేచరల్ పవర్ తో బాక్సాఫీసుని దున్నుతోంది. 

ఇంతకీ బాలకృష్ణ సినిమాలకంటే చిరంజీవి సినిమాలు బెటర్ గా ఎందుకాడతాయి? 

దీనికి సమాధానాన్ని సైకలాజికల్ కోణంలో చెప్పుకోవాలి. 

ప్రధానంగా నటుడనేవాడు వివాదరహితంగా, అందరివాడుగా, వినయంగా ఉండాలి. ఆ గుణాలు లేని వాడు (కనీసం ప్రదర్శించని వాడు) ఎంత నేపథ్యమున్నవాడైనా ప్రేక్షకులు ఉఫ్ అని ఊదేస్తారు. వాళ్ళకంత పవరుంది. 

వేదికలమీద పొగరు, బలుపు ప్రదర్శించే నటులు గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పగలిగే పద్మశ్రీలైనా సరే జనం ట్రోల్స్ చేసి వెక్కిరిస్తారు తప్ప గౌరవించరు, అభిమానించరు. 

అదే వినయంగా ఉంటూ, వివాదమంటే భయపడుతూ ప్రేమగా మాట్లాడే వాడిని తెలియకుండానే ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆ గుణాలకి తోడు కాస్తంత ట్యాలెంటున్నా చాలు భుజాల మీద మోస్తారు. అదే మెగాస్టారుకున్నంత ట్యాలెంటుంటే గుండెల్లో మోస్తారు. 

పైన చెప్పుకున్నట్టు బాలకృష్ణని రాజకీయ, సామాజిక, అస్థిత్వ అవసరాల వల్ల కమ్మకులం మోయడం వల్ల ఆ మాత్రం దీపం వెలుగుతోంది తప్ప లేకపోతే ఎప్పుడో దబిడి దిబిడి అయ్యుండేది. 

చిరంజీవి విషయం అలా కాదు. గతంలో వ్యక్తిగతమైన ఇబ్బందులొచ్చినా, రాజకీయపరమైన అపజయాలు ఎదుర్కున్నా మౌనంగా బాధపడ్డాడే తప్ప మైకందుకుని ఎవర్నీ తూలనాడలేదు. కాలక్రమంలో మళ్లీ ఆయన వెండితెరమీదకొస్తే అందరూ అక్కున చేర్చున్నారు తప్ప హృదయంలో చోటు ఇవ్వకపోవడానికి కారణాలెవరికీ కనపడలేదు. 

ప్రజల సబ్ కాన్షియస్ మైండులో ఆయనకున్న స్థానాన్ని పోగొట్టుకోలేదు. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు. చిరంజీవి వ్యక్తిత్వం వల్ల జరిగిందంతే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. 

ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. ఎప్పుడైతే బోయపాటి దయవల్ల "బ్లడ్-బ్రీడ్" డైలాగులు చెప్పడం మొదలుపెట్టాడో..అప్పటి నుంచి నేడు మలినేని పాపమా అని "బై బర్త్ నా డి.ఎన్.ఏ కేపొగరెక్కువ" అన్నాడో...అధికశాతం మంది తక్కిన కులాల వాళ్లు "ఏడిసావులే" అనుకుని మొహం చాటేస్తున్నారు. గతంలో బాలకృష్ణ ఇంతిలా ఒక కులానికి కార్నరై ఉండేవాడు కాదు. భైరవద్వీపం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రోజుల్లో ఆయన్ని కూడా అందరూ అక్కున పెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే కమ్మ మీడియా వెర్రి తలలు వేసిందో, ఎప్పుడైతే కమ్మ ఎన్నారైలు బాలకృష్ణని అతిగా ఓన్ చేసుకున్నారో, ఏ నాటి నుంచైతే బోయపాటి ఎంటరయ్యాడో అప్పటి నుంచి బాలకృష్ణంటే తక్కిన కులాల వాళ్లకి "సినిమా హీరో" గా కన్నా "పెద్ద కమ్మవాడు" గానే స్థిరపడ్డాడు. 

ఒక వర్గం కమ్మవారు, కమ్మ పత్రికలు, కమ్మ మీడియా కలిసి సినీరంగంలో బాలకృష్ణకి, రాజకీయరంగంలో చంద్రబాబుకి బ్రహ్మరథం మోస్తున్న భ్రమలో వాళ్ల కెరీరల పాడె మోస్తున్నాయి. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?