ముఠా మేస్త్రీలు…విశాఖ వైకాపా నేతలు

చదవేస్తే వున్న మతి పోయింది అన్నది సామెత… కానీ వైకాపా నేతలను చూస్తే ‘పదవి వస్తే వున్న మతి పోయింది’ అని మార్చుకోవాలేమో? విశాఖ తీరంలో వైకాపా నేతలు, వీరు … వారు అని…

చదవేస్తే వున్న మతి పోయింది అన్నది సామెత… కానీ వైకాపా నేతలను చూస్తే ‘పదవి వస్తే వున్న మతి పోయింది’ అని మార్చుకోవాలేమో? విశాఖ తీరంలో వైకాపా నేతలు, వీరు … వారు అని కాదు. అందరూ ఆ తాను ముక్కలే. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే చాలు చెలరేగిపోవడమే.

ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రూపులు కట్టేసి ఒక ముఠా పార్టీ కీలక బాధ్యుల పక్కన చేరితే, మరో ముఠా వీళ్ల బాగోతాలు మీడియాకు లీకులు ఇస్తూ వుంటుంది. ఇదేం బాలేదు అని పార్టీ బాధ్యుడిని పక్కకు తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తే ముఠాలు ఇటు అవుతాయి. కానీ లీకులు మామూలే. పార్టీ పరువు బజారున పడేయడం అంతకన్నా మామూలే. అసలు విశాఖ మీద పార్టీ ఎజెండా ఏమిటి? తాము కూడా దానికి అనుగుణంగా వెళ్లాలి కానీ దాన్ని ముంచేలా కాదన్న కనీసపు ఇంగిత జ్ఙానం కూడా లేదు.

విశాఖ అంటే చాలు ఇప్పుడు వైకాపా అయినా గతంలో తేదేపా అయినా సరే జరిగేది..చేసేది ఒక్కటే..భూముల భాగోతం. ఇక్కడ ఏదీ ఇల్లీగల్ కాదు. లీగల్ నే. అమ్మేవాడు అమ్ముతాడు. కొనేవాడు కొంటాడు. కానీ అక్కడే చిన్న చిన్న మతలబులు వుంటాయి. అమ్మేవాడు ఇష్టపడే అమ్మాడా? కష్టపెట్టి అమ్మేలా చేసారా? అన్నది బయటకు రావు. అలాగే భూములను వివాదాల్లోకి తోసి అమ్మేలా చేసారా? అన్నదీ బయటకు రాదు. రాజకీయ నాయకులకు స్వంతమైన రియల్ ఎస్టేట్ విద్య ఇది.

విజయసాయి విశాఖ వ్యవహారాలు చూసినపుడు ఆయన చుట్టూ ఓ కోటరీ. అందులో అన్ని రంగాల వారూ వున్నారు..మీడియా మహానుభావులతో సహా. అది నడిచినన్నాళ్లు నడిచింది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం విజయసాయి మీద పరోక్షంగా రుసరుసలాడారు. ఆ తరువాత వైవి సుబ్బారెడ్డి వచ్చారు. ఇప్పుడు వర్గాలు అటు ఇటు అయ్యాయి. గమ్మత్తేమిటంటే తెలుగుదేశం అనుకూల వర్గం కొందరు కూడా ఇప్పుడు ఇటు చేరారని బోగట్టా.

సరే ఏదైతేనేం మొత్తానికి తగలబడుతున్నది వైకాపా కొంపే. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్న టైపులో నువ్వు అలా కొన్నావు కదా అంటే…మరి నువ్వు ఇలా కొన్నావు కదా అంటూ వీళ్ల బాగోతాలు వాళ్లు, వాళ్ల బాగోతాలు వీళ్లు బయటపెట్టుకుని పార్టీని పలుచన చేస్తున్నారు.

నిజానికి జగన్ కానీ, వైకాపా కానీ మొదటి నుంచీ చెబుతున్నది ఏమిటి? అమరావతిలో భూముల దందా జరిగింది అనే కదా. మరి అలాంటి దందా మీరు విశాఖలో చేస్తే ఎలా? అలాంటి దందాలు చేసుకోవాలి అనుకున్నపుడు పార్టీ పదవుల్లో వుండకూడదు. పార్టీ మద్దతు దారులుగా వుంటూ వ్యాపారాలు చేసుకోవాలి. ఇటు పదవులు కావాలి అటు దందాలు కావాలి అంటే పార్టీ పరువేం కావాలి?

విజయసాయి అల్లుడు..కూతురు ఓ కంపెనీ పెట్టుకుని వుండొచ్చు. రియల్ ఎస్టేట్, హోటల్, ఫార్మా వ్యాపారాలు వుండి వుండొచ్చు. కానీ ఆయన కీలక బాధ్యుడిగా వున్న చోటకు వచ్చి వ్యాపారాలు సాగిస్తే అది కచ్చితంగా ఆయన మీద పడుతుంది అన్న ఆలోచన వుండాలి కదా? ఇదే కంపెనీ మరే రాష్ట్రంలో వ్యాపారాలు సాగించినా ఎవ్వరూ అడగరు. ఓ పెద్దాయిన వున్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో సైలంట్ గా వుంటారు. ఆయన కుటుంబీకులు బెంగుళూరుల్లో వందలాది ఎకరాలు, కోట్ల రూపాయల వ్యాపారాలు సాగిస్తారు. కానీ ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆ మాత్రం ఆలోచన పరిణితి లేకుండా విజయసాయి కుటుంబీకులు వ్యాపారాలు సాగిస్తే ఎలా?

పైగా అమరావతి వ్యవహారం కీలక దశలో వుంది. విశాఖ విషయంలో అలాంటి అభియోగం రాకూడదు అన్న ఆలోచన వుండాలి కదా? రియల్ ఎస్టేట్ చేసే ఎంవివి సత్యనారాయణ ఎంపీ గా మారారు. అలాంటపుడు ఎంత జాగ్రత్తగా వుండాలి. ఎక్కడా తన వ్యాపారాల మీద మాట రాకుండా చూసుకోవాలి కదా?

వీళ్ల కాళ్లు వాళ్లు లాక్కుని, వాళ్లను వీళ్లు కిందకు తోసి మొత్తం మీద సాధించేది ఏమిటంటే పార్టీ పరువును బజార్న పడేయడం. ఇక జగన్ ఎవర్ని నమ్మాలి? ఎవరికి పగ్గాలు అప్పగించాలి? ఎవరికి ఇస్తే వాళ్లే ఇలా ముఠాలు కడుతుంటే ఏవిధంగా ముందుకు వెళ్లాలి. నిర్మొహమాటంగా ముఠాలు కట్టే వీరులందరినీ పక్కన పెట్టాలి. తన వాళ్లా.బంధువులా..స్నేహితులా అన్నది పక్కన పెట్టి, నికార్సయిన వాళ్లకు పగ్గాలు అప్పగించాలి. ముఠాలు కట్టి, పార్టీకి బురద అంటిస్తే సహించేది లేదు అనే సందేశాన్ని బలంగా పంపాలి.

అప్పుడే విశాఖలో ప్రతిపక్షాన్ని తట్టుకోగలరు. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాలుగా విశాఖను తమ అడ్డా చేసుకుని, మీడియా అండతో వ్యవహారాలు బయటకు రాకుండా దందాలు చేస్తూ వస్తోంది ఓ సామాజిక వర్గం. ఎన్ని ఆక్రమణలు చేసారో, ఎన్ని భూములు కొల్ల గొట్టారో అన్నది బయటకు రాలేదు. దీని మీద వేసిన కమిటీలు కూడా అలాగే పడి వున్నాయి. ఇప్పుడు విశాఖ తమ చేతిలోంచి జారిపోతుందనే భయం వున్న ఆ వర్గం, జరుగుతున్న పరిణామలు చూసి సంబరాలు చేసుకుంటోంది.

తామేమీ కష్టపడకుండానే మళ్లీ విశాఖ తమ చేతిలోకి వచ్చేస్తుందని ఆనందిస్తోంది. అయాచితంగా విశాఖను వదలుకుంటోంది వైకాపా. కేవలం ఇలాంటి ముఠా మేస్త్రీల వల్ల..జగన్ నిర్మొహమాటంగా వ్యవహరించి ఈ విషయంలో తన నిజాయతీ నిరూపించుకోవాలి. అవసరం అయితే రిజిస్ట్రేషన్లు రద్దు చేసి షాక్ ఇవ్వాలి. ఆ విధంగా విశాఖ రాజధాని అనే ఆలోచనకు ఊతం ఇవ్వాలి. పార్టీ బలం చేకూర్చాలి.

-ఆర్వీ