సర్కార్‌వారి పాటలో మహేశ్‌బాబు బ్యాంకుల గురించి చిన్న స్పీచ్ ఇస్తాడు.
'బ్యాంకులు మన దగ్గర నుంచి మనకు తెలియకుండానే చిన్నచిన్న మొత్తాలు కట్ చేస్తాయి. రకరకాల పేర్లతో Hidden charges వసూలు చేస్తాయి. ఒక వైపు వందలు, వేలకోట్లు బ్యాంకులకి అప్పులు ఎగ్గొడుతూ వుంటారు. మనలాంటి కస్టమర్ల దగ్గర వసూలు చేసి, వాళ్ల అప్పులకి జమ చేస్తూ వుంటారు. ఒక రకంగా వాళ్లు ఎగ్గొట్టిన అప్పు మనతో కట్టిస్తారన్న మాట'. ఇది దాని సారాంశం. మంచి పాయింట్.
మనలో చాలా మంది సరిగా గమనించం. కానీ మన అకౌంట్‌లో రకరకాల చార్జీల రూపంలో చిన్న మొత్తాలు కట్ అవుతుం టాయి. చిన్న అమౌంట్ కదా అని మనమూ పట్టించుకోం. దేశంలో ఉన్న కోట్లాది మంది ఇప్పుడు బ్యాంకులతో లింక్ అయి వున్నారు. మరీ నాగరికతకి దూరంగా వుండే సంచార జాతులు మినహా ప్రతి ఒక్కరికీ అకౌంట్ వుండాల్సిందే. లేదంటే ప్రభుత్వ పథకాలు అందవు. అంటే Hidden charges పేరిట ఒకొక్కరి దగ్గర 30 రూపాయలు కట్ అయినా వంద కోట్ల మందికి (మన జనాభా దాదాపు 140 కోట్లు) 3 వేల కోట్లు బ్యాంకులకి ఆదాయం. స్థూలంగా చూస్తే ఈ ఫిగర్ చాలా పెద్దది.
సినిమాలో సందేశం బానే వుంది. మరి మీరు వసూలు చేసే అదనపు టికెట్ డబ్బు సంగతి ఏంటి? విదేశాల్లో సినిమాలు తీసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి, హీరోలు, డైరెక్టర్లు కలిసి కనీసం 80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని వందల కోట్లు బడ్జెట్ చూపించి ప్రేక్షకుడి దగ్గర బాహాటంగానే 50 అధికారికంగా, అనధికారికంగా 100 వసూలు చేస్తున్నారు కదా? ఇదేం న్యాయం?
సర్కార్ వారి పాటలో హీరోహీరోయిన్లు అమెరికాలో కాకుండా ఇండియాలో వుంటే సినిమాకి ఏమైనా నష్టమా? ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టి అది మా నెత్తిన రుద్దడం కరెక్టా? మిమ్మల్ని సినిమా ఎవరు చూడమన్నారు అని అడగచ్చు.
కరెక్టే! బ్యాంకుల E M I లు ఎలా అనివార్యంగా మారాయో, పెద్ద హీరోల సినిమాలు మొదటి రోజు చూడాలనుకోవడం చాలా మంది ప్రేక్షకులకి అనివార్యం. దీనికి అభిమానం, పిచ్చి, ఉత్సాహం ఏ పేరైనా పెట్టుకోండి. చూడంది వుండలేరు. ఇదో అడిక్షన్. బ్యాంకులు రహస్యంగా చేస్తే మీరు బాహాటంగా చేస్తున్నారు.
వెనుకటికి ఎవరో బతకలేని వాళ్లు థియేటర్ దగ్గర బ్లాక్ అమ్ముకునే వాళ్లు. ఇప్పుడు హీరో, నిర్మాత కలిసి బ్లాక్‌లో అమ్ముతున్నారు. అది తేడా!
జీఆర్ మహర్షి