ఇటీవల కాలంలో టీడీపీ ముఖ్య నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయి. రానున్నది తమ ప్రభుత్వమే అని, తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్రత్యర్థి పార్టీ నాయకుల పేర్లన్నీ రాసుకుంటున్నామని, వడ్డీతో సహా రుణాన్ని చెల్లిస్తామని పదేపదే హెచ్చరిస్తున్నారు (ఇదేదో రైతులకు రుణమాఫీ పేరుతో బాకీపడ్డ సొమ్ముకు కూడా వడ్డీ వేసి చెల్లిస్తే బాగుంటుంది కదా అనే వాళ్లున్నారు). ఈ హెచ్చరికలు, బెదిరింపులు వింటుంటే చిత్రగుప్తుడు గుర్తుకొస్తున్నారు.
హిందూ పురాణాల్లో చిత్రగుప్తునికి విశిష్ట స్థానం వుంది. ఈయనకు యమ ధర్మరాజు ఆస్థానంలో కొలువు. ప్రతి మనిషి పాప పుణ్యాలను చిత్రగుప్తుడు లిఖిస్తుంటారని పురాణాలు చెబుతాయి. చిత్రగుప్తుని లెక్కలను బట్టి మరణానంతరం మనుషుల్ని స్వర్గం లేదా నరకానికి పంపాలనే నిర్ణయం జరుగుతుంటుందని కథలుకథలుగా పెద్దలు చెబుతారు.
బహుశా టీడీపీ నేతలు కూడా చిత్రగుప్తునిలా తమను ఇబ్బంది పెట్టే అధికారులు, వైసీపీ నేతల పేర్లన్నీ డైరీలో రాసుకుంటున్నట్టు వారి మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. లోకేశ్ ఒక అడుగు ముందుకేసి తాను తండ్రిలా మంచి వ్యక్తిని కాదని, మూర్ఖుడిని అని, అధికారంలోకి వస్తే ప్రత్యర్థులందరి సరదాలు తీరుస్తానని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ప్రకాశం జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఘనంగా మహానాడుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో పార్టీ దెబ్బతినడంతో, శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు భారీగా మహానాడు నిర్వహించేందుకు టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది.
అయితే మహానాడు నిర్వహణకు వేదిక మొదలుకుని ప్రతి అంశంలోనూ అధికార పార్టీ, ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మహానాడు నిర్వహణకు ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రతి ఒక్కర్నీ గుర్తు పెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తాజాగా అచ్చెన్నాయుడు కూడా అదే రీతిలో వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి రద్దీ పేరుతో సాకులు చెబుతూ బస్సులను ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒకవేళ మహానాడుకు వాహనాలు పంపితే వాటిని సీజ్ చేస్తామని ప్రైవేట్ వాహనాల యజమానులను ఆర్టీవో అధికారులు హెచ్చరిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వాహన యజమానులను భయపెడుతున్న రవాణాశాఖ అధికారుల వివరాలను సేకరించామని, భవిష్యత్‌లో వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇలా ప్రతి చోట హెచ్చరిస్తూ అధికారులు, ప్రత్యర్థి పార్టీల నేతల్ని అదుపులో పెట్టుకోవాలనే ఎత్తుగడతో టీడీపీ ముందుకెళుతోంది. అధికారంలో ఏ పార్టీ వున్నా ప్రత్యర్థులకు అడ్డంకులు సృష్టించడం సర్వసాధారణమైంది. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు. గతంలో పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత జగన్ కూడా ఇదే రీతిలో అధికారులను, ప్రత్యర్థులను హెచ్చరించడం చూశాం. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు తన విధులు కాకుండా, ఇతరేతర పనులు చేస్తున్నారని నాటి ప్రతిపక్షం వైసీపీ విమర్శించిన సంగతి తెలిసిందే.
2019లో అధికార మార్పుతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు, వివిధ హోదాల్లో గత ప్రభుత్వానికి కొమ్ము కాసిన వాళ్లంతా ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారని సమాచారం. అధికారంలో వున్నప్పుడు, మాట చెల్లు బాటు అవుతున్నప్పుడు ఎవరికీ కళ్లు కనిపించవు. చెప్పినా చెవికెక్కవు.
అధికారానికి ఉన్న చెడు లక్షణమే ఇది. కొత్తగా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు హెచ్చరించినంత మాత్రాన ఎవరూ వెనక్కి తగ్గరు. ఎందుకంటే గతంలో తాము చేసిందానికి చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు ఇలా ఎవరైనా మూల్యం చెల్లించుకోవా ల్సిందే. ఇదే ప్రకృతి నీతి. 2024లో అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోడానికి టీడీపీ సమాయత్తం అవుతున్నట్టు ఆ పార్టీ నేతల మాటలే చెబుతున్నాయి. అన్నట్టు టీడీపీలో పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడెవరు? కొంపదీసి ఊరూరికి ఒకర్ని నియమించారా?
సొదుం రమణ