దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆశాదీపమైన ఆప్ మార్క్ పాలనకు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఈ ఏడాదిలో మార్చిలో పంజాబ్‌లో ఆప్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకనే అవినీతి ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రి వర్గం నుంచి సీఎం భగవంత్‌మాన్ తప్పించి దేశ ప్రజల మనసులను చూరగొన్నారు.
సాధారణంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి, నేర సంబంధిత ఆరోపణలు వస్తే, ఎలా తప్పించాలని సీఎం, పీఎంలు ఆలోచిస్తుంటారు. ఎవరేమనుకున్నా సరే, పదవులు పట్టుకుని వేలాడుతుంటారు. కానీ పంజాబ్ సీఎం అందరిలా వూరుకోలేదు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడం, విచారణలో నిజమని తేలడంతో సీఎం ఏ మాత్రం ఉపేక్షించలేదు.
వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించి దేశంలోని పాలకులందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. మంత్రి అవినీతిపై తన వద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం నుంచి తప్పించడమే కాదు, అవినీతికి పాల్పడ్డ సదరు మంత్రిపై కేసు కూడా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం విశేషం.
సీఎం ఆదేశాలతో బర్తరఫ్ అయిన మంత్రిని పంజాబ్ అవినీతి శాఖ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అవినీతిపై ఆప్ ముఖ్యమంత్రి కఠిన చర్యలపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి ఇలాంటి పాలకులు రావాలి, కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.