జగన్ చుట్టూ తిమింగలాలు

నాయకులు తమ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రాథమికంగా అది సెక్యూరిటీ వలయం. కాస్త ఎదిగిన తర్వాత సలహాదారుల వలయం, దళారీల వలయం.. ఇలా ఆ వలయాలు రకరకాలుగా ఉంటాయి. కానీ.. జగన్…

నాయకులు తమ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రాథమికంగా అది సెక్యూరిటీ వలయం. కాస్త ఎదిగిన తర్వాత సలహాదారుల వలయం, దళారీల వలయం.. ఇలా ఆ వలయాలు రకరకాలుగా ఉంటాయి. కానీ.. జగన్ తన చుట్టూ తిమింగలాల వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ తిమింగలాలు ఆయన రక్షణ కోసం పనిచేస్తుండేవి కాదు! సామాన్యులైనా అసామాన్యులైనా ఇతరులెవ్వరూ ఆయన దరికి చేరకుండా చూస్తూ ఉండే తిమింగలాలు! అవి మామూలు తిమింగలాలు కాదు.. జగన్ చుట్టూ వలయంగా ఏర్పడడమే ఒక ప్రివిలేజీగా చెలరేగిపోతూ.. నానాటికీ బలిసిపోతూ.. జగన్ ను మబ్బులో ఉంచి, ఆయనను మించిపోతున్న తిమింగలాలు!

అధికారంలో ఉన్నన్నాళ్లు ఈ తిమింగలాలే రాజకీయ, పాలన వ్యవహారాలను నిర్దేశించాయి, శాసించాయి. ఫలితం అందరూ చూస్తున్నదే. ఇప్పటికీ వీరి గురించి తెలుసుకోకుండా.. రాబోయే అయిదేళ్లూ వీరి మధ్యనే గడుపుతూ రాజకీయం చేస్తానంటే.. ప్రజలు అప్పటికైనా జగన్ ను ఇంకో రకంగా ఎలా చూడగలరు? ఇదే పార్టీ వారిలో మెదలుతున్న ప్రశ్న! ఆ పోకడలమీద నే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘జగన్ చుట్టూ తిమింగలాలు’!

పొరబాట్లు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎంత త్వరగా ఆ పొరబాట్లను వారు గ్రహించి దిద్దుకునే ప్రయత్నం చేస్తారు? అనేదాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి పొరపాట్లు చేసేవారు- వాటిని గుర్తించడం ఎలాగ? బయటి వ్యక్తుల నుంచి విమర్శల రూపంలో గానీ, విజ్ఞప్తులు రూపంలో గానీ తమ లోపాల ప్రస్తావన వచ్చినప్పుడు తృణీకారభావంతో, అహంకారంతో వాటిని చూడకుండా..  ఆ కోణంలోంచి సమీక్షించుకునే నేర్పు, ఓర్పు ఉండాలి! అదే ఒక లోపరహితమైన పనితీరును అలవాటు చేస్తుంది. ఈ అలవాటు అంత సులభం కాదు! అయితే అసాధ్యం కూడా కాదు.

రాజకీయాలలో ఉండేవారికి- నిత్యం వందిమాగధులు చుట్టూ చేరి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటారు. దారితప్పి పోయే ప్రమాదం ఎక్కువ. ఆ ముప్పు పొంచి ఉన్నవాళ్లు- సాధన మీద అయినా సరే ఆ అలవాటు చేసుకోవాలి! తమ లోపాలను ఇతరులు వేలెత్తి చూపినప్పుడు.. వారు తమ వ్యతిరేకులు అయినా సరే లిప్త పాటు వారి మాటలు నిజం అనుకొని, తమను తాము సమీక్షించుకుంటే మరింతగా మెరుగుపడతారే తప్ప కోల్పోయేదేమీ ఉండదు!

ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అలవాటు ఒక్క శాతం కూడా చేసుకోలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన చుట్టూ ఒక బలమైన కోటరీ ఏర్పడింది. ఆ కోటరీ తొలుత ఇనుప గోడల లాగా మారి బాహ్య ప్రపంచంతో ఆయనకు సంబంధం బాంధవ్యాలను పూర్తిగా తుంచేసింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే, వాటిని ఆయనకు ప్రీతికరమైన రీతిలో వక్రీకరించి తెలియజేసే దుర్మార్గమైన పని చేసింది. ఆయన వ్యవహార సరళి గురించి బాహ్య ప్రపంచానికి ఉన్నవీ లేనివీ అభూతకల్పనలు కలిపి అందజేసింది.

నెమ్మదిగా ఈ కోటరీ జగన్మోహన్ రెడ్డి నీ మించిపోయే విధంగా తయారైంది. ఆశ్రితులుగా చుట్టూ చేరిన వారు, రకరకాల రూపాలను సంతరించుకుని చివరికి తిమింగలాలుగా లెక్క తేలేరు. ఈ తిమింగలాలు జగన్ చెంతకు రాగల ఏ చిన్నవారినైనా అమాంతం కబళించేయడం మాత్రమే కాదు… అసలు పార్టీనే కొద్ది కొద్దిగా మింగేస్తూ ఇవాళ ఈ పరిస్థితికి తీసుకువచ్చారు!

జగన్మోహన్ రెడ్డి సలహాదారులు సహాయకుల గురించి వారి దుర్మార్గమైన పెత్తనం గురించి రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటలను పక్కన పెట్టండి. సొంత పార్టీ వారే ఎన్ని సందర్భాలలో విమర్శలు చేశారో లెక్కేలేదు! తన పార్టీ నాయకులు చెబుతున్న మాటలను కూడా జగన్ చెవిన వేసుకోకుండా, ఐదేళ్లపాటు ఒక మాయలో ఉండిపోయారు. లేదా, ఆ మాటలేవీ ఆయన చెవి దాకా వెళ్లకుండా ఈ మాయగాళ్ళే అనేక అడ్డు పొరలను సృష్టించారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు గురించి అధికార పార్టీ నాయకుడికి కనీస అవగాహన లేకుండా పోయిది.

గెలవడం ఓడడం అనేది పెద్ద చర్చ కానే కాదు! రాజకీయాలలో ఓడలు బండ్లు కావడం.. బండ్లు ఓడలు కావడం చాలా సహజం. అయితే ప్రజలు 151 స్థానాలతో ఆశీర్వదించిన పార్టీ, కేవలం 11 సీట్లతో పరిమితం కావడం అనేది పార్టీ వారికి బాధాకరమైన సంగతి. ఒకవైపు పార్టీ అధినేత ‘వై నాట్ 175’ అంటూ నూరు శాతం విజయాలను నమోదు చేస్తానని అట్టహాసంగా ప్రతి ఊరిలోనూ ప్రకటిస్తూ సాగుతుండగా కేవలం 10 శాతం సీట్లు కూడా దక్కకపోవడం అనేది అవమానకరమైన విషయం.

వైనాట్ 175 అన్నది జగన్ మాయ చేయడానికి అన్నటువంటి మాట కాదు. నిజంగానే ఘనమైన విజయం దక్కుతుందని ఆయన అనుకున్నారు. కానీ దక్కిన అవమానం హఠాత్తుగా తయారైనది కాదు. ఎంతో కాలంగా ఆ పరిస్థితి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. కాకపోతే దానిని గుర్తించడంలోని జగన్ విఫలం అయ్యారు. ఆయన చుట్టూ ఉన్న తిమింగలాలు ఆయనను ఆ దుస్థితిలోకి నెట్టివేశాయి!

ముఖ్యమంత్రి చుట్టూ వలయంలో ఉన్న కీలక నాయకులు అనే హోదాను అడ్డుపెట్టుకుని ఎంతమంది ఎన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు పాల్పడ్డారో లెక్కేలేదు. సాధారణంగా ఒకరికి లబ్ధి చేకూర్చే పనులు చేసినప్పుడు లంచం చేతులు మారడం, అవినీతి జరగడం సహజం! కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడానికి కూడా భారీగా ముడుపులు సమర్పించవలసి వచ్చేదంటే.. సొంత పార్టీ నాయకులు కూడా అపాయింట్‌మెంట్ కోసం డబ్బులు ఇచ్చేవారంటే.. ఈ తిమింగలాలు ఏ స్థాయిలో చెలరేగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

కాంట్రాక్టులు అన్నింటికీ పర్సంటేజీలు నిర్ణయించడం..  ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి నుంచి ముడుపులు పుచ్చుకుని బిల్లులు చేయడం..  సొంత పార్టీ కాంట్రాక్టర్లను అటూ ఇటూ కాకుండా ఇవాళ్టికి కూడా బిల్లులు అందరిని దుస్థితిలో ఉంచడం జరిగింది. ఇలాంటి దుర్మార్గాలు జగన్ చుట్టూ కొలువుదీరిన తిమింగలాలకే చెల్లాయి. సలహాదారు ముసుగులో సకల శాఖల మంత్రి కాదు కదా, తానే  ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరించిన పెత్తందారీ పోకడలే ఇవాళ పార్టీకి చేటు చేశాయి!

మొత్తానికి జగన్ ఓడిపోయారు! ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ దుస్థితిలో ఉన్న సమయంలో కూడా తన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించలేని స్థితిలో ఉంటే ఎలాగ? తిమింగలాల వలయంలో ఇరుక్కుని రేపటి రాజకీయంలో పూర్వవైభవం సాధించగలనని ప్రగల్బాలు పలికితే ఎలాగ? అదంతా సాధ్యమయ్యేదేనా? ఈ తిమింగలాలను ముందు దూరం తరమకుండా- తాను మళ్లీ జనం నమ్మకాన్ని చూరగొనగలగడం కుదురుతుందా అనేది జగన్ స్వయంగా.. మరొకరి ప్రభావానికి లోనుకాకుండా సమీక్షించుకోవాల్సిన సంగతి. 

ప్రజలకోణం తెలియని తిమింగలాలు!

జగన్ చుట్టూ వలయంలో ఏర్పడిన, ఆయనను ప్రభావితం చేస్తూ వచ్చిన ఏ పేరునైనా తీసుకోండి. సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధనంజయ రెడ్డి, రిషి రాజు, కెఎన్ఆర్, రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిలో ఏ ఒక్కరైనా ప్రజలకోణంలో ఆలోచించగలిగిన వారు ఉన్నారా? జగన్ ను ప్రభావితం చేయగలిగిన కోటరీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి లాంటి వాళ్లు తప్ప.. ప్రజల కోణం తెలిసిన నాయకులు ఎవ్వరూ లేరు.

ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో, నాయకుడినుంచి ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసిన వారు లేరు. ప్రజల మనసులను గెలుచుకోవడం ఎలాగో, కేవలం నిర్ణయాలు చేయడం, మానిప్యులేషన్ మాత్రమే కాదు.. ప్రజల యాంగిల్ కూడా ముఖ్యమేనని తెలిసిన వారు కూడా లేరు. కేవలం జగన్ వద్ద మాటలు చెప్పడం.. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. జగన్ కు ఇష్టమయ్యే విధంగా వాటిని మార్చిచెప్పడం మాత్రమే వారు చేస్తూ వచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ప్రధాన లోపం ఒకటి ఉంది. పార్టీ అంటే నిత్యం ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎవ్వరైతే కనిపిస్తూ ఉంటారో.. అలాంటి వారితో అధినేతకు సంబంధ బాంధవ్యాలు సమూలంగా తెగిపోయాయి. పార్టీ జెండా మోసే, అధినేతను  పిచ్చిగా ప్రేమించే కార్యకర్తలు జీవిత పర్యంతం జెండా మోస్తూనే బతికేస్తారు. వారి సంగతి పక్కన పెట్టండి. కనీసం  స్థానిక నాయకులకు, పల్లెలను, సామాజిక వర్గాలను ప్రభావితం చేయగలిగిన నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎవ్వరికీ ప్రభుత్వ వ్యవస్థలో విలువ లేకుండాపోయింది.

సంక్షేమ పథకాలు డీబీటీ విధానం, వాలంటీర్ల వ్యవస్థ, ఇలా ఏ పేర్లతో అమలు చేసినా.. వాటి వలన.. చివరికి ప్రజలకు ఎమ్మెల్యేలకు కూడా సంబంధాలు లేకుండా ప్రభుత్వం తెంచేసింది. ‘జగన్మోహన్ రెడ్డి- లబ్ధిదారులైన ప్రజలు’ మాత్రమే వ్యవస్థకు అటు ఇటు నిలిచారు. మధ్యలో మరెవ్వరూ లేకుండా.. జగన్ చుట్టూ ఉన్న తిమింగలాలు ఒక అపభ్రంశమైన వ్యవస్థను రూపొందించాయి. 

వారి స్వార్థమే అందరి పరమావధి

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇవాళ ఈ స్థాయికి దిగజారేలా భ్రష్టుపట్టిందంటే.. ముందుగా నెంబర్ 2 గా తనకు తాను సృష్టించుకున్న ఇమేజితో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి పేరు చెప్పుకోవాలి. మీడియా ముందు మాట్లాడడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి.. అందుకోసం సజ్జల మీద ఆధారపడడం ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి అనేక తప్పుడు సంకేతాలను పంపింది. ‘మీడియా ముందుకు రావడం జగన్ కు భయం’ అనే విషయాన్ని సజ్జల ఏకంగా టీవీ ఇంటర్వ్యూల్లోనే సంకేతమాత్రం సెలవిచ్చారు. నెంబర్ టూగా ఆయన బిల్డప్ లకు పార్టీ మొత్తం ఆయన ఎదుటే సాగిలపడింది. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయన డిక్టేషన్ ఇచ్చేవారు. ఎమ్మెల్యేలు తనను కలవడానికి వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరు.. అనే అహంకారముద్ర వేయించుకున్నారు.

‘అశ్వంబు చెడుగైన ఆరోహకుని తప్పు’ అని నరసింహ శతకం చెబుతుంది. సలహాదారులు అనేవారు జగన్ కు అవసరమైన పనులు చేయడానికి, చెప్పిన పనిచేయడానికి చేసుకునే ఏర్పాటు కావాలి. అలా కాకుండా, జగన్ ను శాసించే రాజ్యాంగేతర శక్తులుగా వారు మారితే ఇక ఆ పార్టీని ఎవరు కాపాడగలరు? వైసీపీలో పరిస్థితి అలాగే తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి బీభత్సమైన భూకబ్జాల ఆరోపణల్లో సజ్జల రామక్రిష్ణారెడ్డి పేరు ప్రబలంగా వినిపించినదంటే అతిశయోక్తి ఏముంది?

సజ్జల వల్లనే పార్టీ సగం నాశనం అవుతుందని అందరూ అనుకుంటూ ఉండగా.. ఆయన కొడుకు సజ్జల భార్గవ్ ను తీసుకువచ్చి సోషల్ మీడియా సారథ్యం ఆయన చేతిలో పెట్టిన తర్వాత.. పతనంవైపు గమనం పరిపూర్ణం అయింది. పార్టీని పూర్తిగా కూల్చేయడానికి ఈ తండ్రీకొడుకుల కృషి ఉపయోగపడింది. సోషల్ మీడియాపార్టీ  సెటప్ ను .. దేశంలోనే మరే ఇతర పార్టీకి లేనంత పటిష్టంగా రూపొందించిన అదివరకటి వారినందరినీ భార్గవ్ బయటకు పంపారు. సోషల్ మీడియా ప్రచారాల మీద నెలవారీగా కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. కానీ ఫలితం మాత్రం సున్నా అయింది.

జగన్ ప్రభుత్వం వ్యవహారసరళిలో చరిత్ర ఎరగని కొత్త చిన్నెలు కూడా కనిపించాయి. ముఖ్యమంత్రితో పనులు చేయించుకోవడానికి  లేదా, ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కు కావడానికి ఎక్కడైనా లంచాలివ్వడం గురించి మనం చూస్తూ ఉంటాం. కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా లంచాల ద్వారా మాత్రమే దక్కుతుంది.. అనేది బహుశా జగన్ వలయంలోని తిమింగలాలకు మాత్రమే సాధ్యమైంది. జగన్ అపాయింట్మెంట్లు చూసే కెఎన్ఆర్ మీద ఈ తరహా ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కేలేదు.

అలాగే ముఖ్యమంత్రిని శాసించే స్థాయి కోటరీ తిమింగలంగా ముద్రపడిన ధనంజయరెడ్డి వ్యవహారం ఇంకా తీవ్రమైనది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఓకే అయ్యే వ్యవహారం మొత్తం ఆయన చేతుల మీదుగా సాగేదని  అంటారు. ప్రతి బిల్లు చెల్లింపులోనూ 8 నుంచి 10 శాతం అనేది ఫిక్స్‌డ్ ధరగా నిర్ణయించి ఆయన కమిషన్లు వసూలు చేసేవారని ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లు బిల్లులు పొందే సమయంలో ముడుపులివ్వడం కొత్త విషయం కాదు. అలాగని పర్సంటేజీలు ఇచ్చినా కూడా.. తెలుగుదేశంకు చెందిన వారికి బిల్లులు అయ్యాయే తప్ప.. వైసీపీ వారికి అసలు ఆ యోగం కూడా లేదని ఆరోపణలొచ్చాయి. తీరా ఇప్పుడు ప్రభుత్వం మారాక.. వైసీపీ కాంట్రాక్టర్లంతా లబోదిబో మంటున్నారు. జగన్ కు మొరపెట్టుకుంటున్నారు. ఆయన ఆలకిస్తున్నారా? అనేదే తేలడం లేదు.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ట్రంప్ అవినాష్ అనే ఇద్దరు అసమర్థుల పాలబడి పార్టీ ఇవాళ ఇంత ఘోరంగా ఓడిపోయింది. ప్రతినెలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలకు సారథులు వీరు. అయిదేళ్లలో ఎక్కడో ఒకచోట ప్రజా వ్యతిరేకత సూచనమాత్రంగానైనా వీరికి కనిపించలేదంటే అది అబద్ధం. వీరు సర్వేల ముసుగులో, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టి పార్టీ విధానాలు మార్చుకోవడానికి ఉపయోగపడి ఉండాలి. కానీ వీరంతా తమస్వార్థం చూసుకున్నారే తప్ప.. పార్టీకి ఉపయోగపడింది సున్నా.

ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి అవినీతి గురించి వెల్లువలా ఫిర్యాదులు అప్పుడూ ఇప్పుడూ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ ను చుట్టుముట్టిన తిమింగలాల్లో ఒకరుగా ఉంటూ.. అక్రమార్జనలతో హైదరాబాదులో సంపదలను పెంచుకుంటూ వచ్చిన మేధావిగా ఆయన గురించి చెబుతుంటారు. అలాగే లిక్కర్ మాఫియా బాగోతాలను మొత్తం నడిపించిన కింగ్ పిన్ గా రాజ్ కసిరెడ్డి పేరు వినిపిస్తుంది.

పెద్దిరెడ్డి జనం నాడి తెలిసిన నాయకుడే గానీ.. అధికారంలో ఉండడం అనేది ఆయన పూర్తిగా తన సొంత వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే అన్నట్టుగా వాడుకున్నారు.

బాబాయి వైవీ సుబ్బారెడ్డిని జగన్ చాలా నమ్మారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేతిలో టీటీడీ ని పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవస్థను- ఆరూపేణా ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడంలో వైవీసుబ్బారెడ్డి తన వంతు పాత్ర పోషించారు. నాలుగేళ్లు ఆ పదవిని వెలగబెట్టిన తర్వాత.. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ సారథ్యం అప్పగిస్తే.. అక్కడ కూడా పార్టీని సర్వనాశనం చేశారు.

టీటీడీ విషయంలో ఈవో ధర్మారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగన్ అండ చూసుకుని.. మొత్తం ప్రభుత్వ పార్టీ వ్యవస్థలను పురుగుల్లా చూసిన అధికారి ఆయన! పార్టీలో కీలకం అయిన పెద్దిరెడ్డి, సజ్జల వంటి వారికి తప్ప మరొకరి గోడు వినిపించుకోని వ్యక్తి. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరే.. ప్రభుత్వాన్ని అనేక రకాలుగా భ్రష్టుపట్టించిందంటే అతిశయోక్తి కాదు.

విజయసాయిరెడ్డి.. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ టూ అనిపించుకోవడంలో సజ్జల తో పోటీపడిన నాయకుడు. ఆయన పార్టీకి నిజాయితీగా చేసిందేమీ లేదు. కేంద్రంలోని బిజెపి పెద్దలతో సఖ్యంగా ఉంటూన్న పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడు గా జగన్ ఇచ్చిన గౌరవాన్ని ఆయన పూర్తిగా తన స్వార్థానికి వాడుకున్నారు. కేంద్రంలోని పెద్దలతో తన వ్యక్తిగత భేటీలు అన్నీ తన ప్రాపకం కోసం ఉపయోగపడేలా మార్చుకున్నారు.

ఇంకా బధిరాంధ నిర్వహణేనా?

జగన్ ఎవరు చెబితే వింటారు? ఎవరి గోడును చూస్తారు? అనేదానికి అర్థమే లేకుండాపోయింది. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు జగన్! ఆ తర్వాత ఆయన వినడం, చూడడం కూడా ఆగిపోయింది. ప్రజల కష్టాలను ఆయన స్వయంగా చూడడం మానుకున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడం మానుకున్నారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరాజయం నుంచి పాఠాల నేర్చుకున్నారా? అంటే అది కూడా లేదు.

జగన్ చుట్టూ ఉండే తిమింగలాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పటికీ జగన్ ను మబ్బులో పెట్టడానికే పనిచేస్తున్నాయి. తెగించిన ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. వారి వైఖరి తెలిసిన వారంతా.. ఆ మాట ఎత్తాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు.

ఎందుకంటే.. జగన్ ఇంకా వారి మీద ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తుండడమే కారణం. వీరందరినీ అయిదేళ్లపాటు జగన్ నమ్మారు.. వారందరూ కలిసి ఇంతటి ఘనమైన ఓటమికి బాటలు తీర్చారు. మరి వారి సామర్థ్యం మీద, కార్యకుశలత మీద జగన్ కు ఇప్పటికైనా జ్ఞానం ఏర్పడకపోతే ఎలాగ? వారిని ఒక్కరొక్కరుగా దూరం నెట్టకపోతే.. తిమింగలాలను దూరం తరమకపోతే.. అయిదేళ్ల తర్వాత మళ్లీ ఇంతకంటె అద్భుతమైన మెజారిటీతో మనం అధికారంలోకి వస్తాం అని ఆయన చెప్పే మాటలు కార్యరూపం దాలుస్తాయా? లేదా, ఉత్తరకుమార ప్రగల్భాలులాగా మిగిలిపోతాయా?

ఈ అంశాలను .. జగన్ స్వయంగా మరొకరి మీద ఆధారపడకుండా సమీక్షించుకోవాలి. అప్పుడే ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. 

..ఎల్ విజయలక్ష్మి