హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా, అధికార టీఆర్ఎస్ టార్గెట్ అవుతుంది. గతంలో సినిమా వాళ్లకు డ్రగ్స్ తో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన సమయంలో పెద్ద హడావిడి నడిచింది. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా.. ఎవరిపైనా కేసులు పెట్టకుండానే వదిలేశారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు.
అప్పట్లో టీఆర్ఎస్ పెద్దల అండదండలతోనే సినిమావాళ్లు పునీతులయ్యారని అంటారు. ఆ క్రమంలో కేటీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తుంటారు. ఆమధ్య కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని రేవంత్ రెడ్డి నోటికి అడ్డుకట్ట వేయగలిగారు కేటీఆర్. ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగిపోలేదు. అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడినా టీఆర్ఎస్ నేతలే టార్గెట్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ తో కూడా టీఆర్ఎస్ నేతలు మరోసారి ఇబ్బంది పడుతున్నారు, ఈసారి ఏకంగా సీఎం కేసీఆరే ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు.
డ్రగ్స్ వ్యవహారం బయటకు రాగానే బీజేపీ ఒక్కసారిగా స్వరం పెంచింది. డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లని ఎన్ కౌంటర్ చేయాలంటూ మండిపడ్డారు నేతలు. ఈ పబ్బుల సంస్కృతిని హైదరాబాద్ నుంచి తరిమేయాలంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటినీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఎన్సీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఉండేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రేట్ డ్రగ్ సిటీగా మారిందని విమర్శిస్తున్నారు.
ఇక ఆ పబ్ యజమాని ఎవరనే విషయంలో కూడా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు నాయకులు. టీఆర్ఎస్ కి చెందిన ఓ మాజీ ఎంపీ కుమార్తె ఆ పబ్ కి యజమాని అని, అందుకే పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక బీజేపీ నాయకులతో ఆ పబ్ యజమానులని చెబుతున్నవారి కలసి ఉన్న ఫొటోలని మీడియాకి రిలీజ్ చేసి టీఆర్ఎస్ కూడా రచ్చ చేస్తోంది.
మొత్తమ్మీద ఈ వ్యవహారంలో మరోసారి అధికార పార్టీ అడ్డంగా బుక్కైంది. సీఐని సస్పెండ్ చేయడంతోనే సరిపెడతారా..? లేక పెద్ద తలకాయల్ని కూడా బయటకు తీసుకొస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరోసారి హైదరాబాద్ పేరు మారుమోగిపోయింది. ఇక ధాన్యం కొనుగోళ్ల గురించి టీఆర్ఎస్ మాట్లాడితే.. బీజేపీ నేతలు డ్రగ్స్ కొనుగోళ్లు బాగానే చేస్తున్నారు కదా అని దెప్పిపొడుస్తారు.
ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే కానీ.. డ్రగ్స్ మాఫియాని మాత్రం ఎవరూ పారదోలలేరనేది మాత్రం కఠిన వాస్తవం. మరోవైపు టాలీవుడ్ లో కూడా భుజాలు తడుముకునే బ్యాచ్ ఎక్కువైపోయింది.